Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

కార్మికులలో బడ్జెట్ నైరాశ్యం

edit

రానున్న 2018 బడ్జెట్‌పై అనేక వర్గాల ప్రజలు ఆశలు అల్లుకుంటున్నారు. వేతన జీవులు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందని ఎదురు చూస్తున్నారు. యువతరం నిరుద్యోగ భృతి వంటి కొత్త తరహా నిర్ణయం కోసం ఆశగా ఉన్నారు. అలాగే కార్మిక లోకంలో కూడా ఆశలు రెపరెపమంటున్నాయి. వాటిలో ముఖ్యమైనది రిట్రెంచ్ అయిన కార్మికులకు భృతి. కార్మిక అంశాల్లో మోడీ ప్రభుత్వం చేష్టలుడిగినట్లు వ్యవహరిస్తుండడంతో కార్మిక నాయకుల్లో మాత్రం ఈ బడ్జెట్‌పై అంతగా ఆశలు లేవు. ప్రభుత్వ అనుమతి లేకుండా కార్మికులకు ఉద్వాసన చెప్పే అధికారాన్ని 30 లోపు సిబ్బంది పనిచేసే సంస్థలకు కట్టబెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం 2017 నవంబర్ 30న ఉపసంహరించుకుంది. అలా ఉద్వాసన పలికిన వారికి పెన్షన్ సౌకర్యం కూడా ఉండదని ప్రతిపాదించింది. చివరకు ఓట్ల కోసం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది ఒక్కటే మోడీ ప్రభుత్వం కార్మిక ప్రయోజనాలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం. గుజరాత్‌లో ఎన్నికలకు 10 రోజుల ముందు జరిపిన అభిప్రాయ సేకరణ తమకు విరుద్ధంగా ఉండడంతో మోడీ తక్షణమే స్పందించారు. ఆ ప్రతిపాదనకు వెంటనే స్వస్తి పలికారు. గుజరాత్ ఎన్నికలు లేకుంటే మోడీ ఆ ఒక్క కార్మిక ప్రయోజనకర నిర్ణయమూ తీసుకునే వారు కాదు. గత నవంబర్‌లో ఎకనామిక్ టైమ్స్ ఇండియా డెవలప్‌మెంట్ డిబేట్ జరిపినప్పుడు పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ ఆర్థిక విధానాలపై సణుగుడు ప్రారంభించగా, ఆర్థిక మంత్రి జైట్లీ ప్రమేయం కల్పించుకొని వారిపై ఎదురు దాడి జరిపారు.
గుజరాత్ ఫలితాలు తెలిసిన మరునాడు జైట్లీ గొంతు మార్చా రు. గుజరాత్ ఫలితాల ఒత్తిడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రస్తుత, తదుపరి సమావేశాల కోసం వేచిచూడమని పారిశ్రామిక వేత్తలను, కార్మిక నాయకులను ఉద్దేశించి అన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు నియమావళులు (కోడ్స్) గా మిళితం చేసే సంస్కరణకు 2014లోనే ప్రధాని మోడీ నాంది పలికారు. ఆ సంస్కరణ మాటున ఇష్టానుసారం కొన్ని మార్పులు చేయడానికి ఆయన ప్రయత్నించారు. చిన్న పారిశ్రామిక సంస్థలను కార్మిక చట్టాల నుంచి మినహాయించడం, బయటి వారిపై ఆంక్షల పేరుతో కార్మిక సంఘాల నుండి వృత్తి నిపుణులను నిషేధించడం వంటి చర్యలకు ఆయన ప్రయత్నించారు. ఆ నాలుగు కోడ్‌లకు ఒకే ఒక్క కోడ్ ( 2017 వేతనాల నియమావళి ముసాయిదా బిల్లు) ఒకటే సిద్ధమైంది. వాటిలో అంతగా వివాదాస్పదం కాని కోడ్ అది ఒక్కటే.
గత ఆగస్టులో దానిని లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటికీ అది ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఆ ధైర్యం ప్రభుత్వానికి లేకపోయింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్లుపై పరస్పర విరుద్ధ నివేదికలు వెలువడ్డాయి. కార్మిక సంఘాలు ఈ బిల్లుపై మూడు రో జుల సమ్మెకు ఆరంభంలో పిలుపునిచ్చాయి. కంపెనీలు తమ కార్మికుల్లో 300 మంది దాకా అనుమతి లేకుండా రిట్రెంచ్ చేయవచ్చునన్న నియమాన్ని కార్మికుల నుంచి వల్ల రద్దు చేయడానికి జైట్లీ అంగీకరించారు. దీని తర్వాత కార్మిక సంఘాలతో ఒప్పందానికి వచ్చామని ప్రభుత్వం చాటుకుంది. పారిశ్రామిక సంబంధాల కోడ్ బిల్లును ఆమోదింప చేస్తామని హామీ కూడా ఇచ్చింది. కార్మిక నాయకులు కూడా అంగీకారం కుదిరిందీ లేనిదీ చెప్పలేదు. ఆ కోడ్ బిల్లుకు తమ ముందునాటి అభ్యంతరం ఏమైందన్నది కూడా స్పష్టం చేయలేదు. కార్మిక సంఘాల కార్యనిర్వాహక పదవుల్లో బయటవారు ఉండకూడదన్న ఆంక్ష విషయంలో పునః పరిశీలన జరపాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కూడా జైట్లీకి సూచించింది. ఎన్నికల ముందు ఏడాదిలో ఆ బిల్లు విషయంలో ప్రభుత్వం మిన్నకుంటుందని చెప్పవచ్చు. సమాచార టెక్నాలజీ, ఇ కామర్స్ రంగాలలో వేలాది మందికి ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడింది.
సమాచార టెక్నాలజీ రంగంలో వ్యవస్థీకృత సంక్షోభం వల్ల దాదాపు లక్ష మందికి ఉద్యోగ ఉద్వాసన హెచ్చరికలు జారీ అయ్యా యి. అసలే కార్మిక లోకంలో అస్థిరత నెలకొంటున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికల ఏడాది (2019) వేగంగా దూసుకొస్తోంది. ఆర్థిక వృద్ధి మృగ్యమై పతనం దశలో ఉన్న తరుణంలో కార్మిక చట్టం సవరణల పేరుతో లక్షలాది మందిని దూరం చేసుకోవడం ఎన్‌డిఏ ప్రభుత్వానికి ఇష్టం లేదని దీని వల్ల తెలుస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో అది ప్రధాని స్వరాష్ట్రం అయినప్పటికీ ఓటర్లు బిజెపికి గునపాఠం గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం దూకుడు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కార్మిక కోడ్ బిల్లులు ఇష్టానుసారం తెచ్చే వీలు ఇప్పట్లో లేదు. యూరోజోన్ సంక్షోభంవల్ల అనేక బిపిఒలు మూతపడ్డాయి. ఈ మూసివేతలు అనేక విధాన సంబంధమైన ప్రశ్నలను లేవనెత్తాయి. దేశంలో ఆర్థిక మాంద్యం వల్ల 10 లక్షల మంది పారిశ్రామిక కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. అయినప్పటికీ నిరుద్యోగ భృతివంటి చిన్న ఊరట కల్పించే చర్యల గురించి కూడా ప్రభుత్వం యోచించడం లేదు. పశ్చిమ దేశాల్లో పారిశ్రామిక ఆటుపోట్లు సహజం కనుక నిరుద్యోగ భృతి ఇచ్చే ఆనవాయితీ ఎప్పటి నుంచో ఉంది. మన ఐటి కార్మికులకు కొత్తకొత్త సాంకేతిక విద్యలలో నైపుణ్యం అందించడానికి ప్రభుత్వ నిధులతో కార్యక్రమాలను జరపాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలికా లేదు. సాంకేతిక విజ్ఞానం మొత్తం మార్పు చెందుతున్న ప్రస్తుత తరుణంలో అటువంటి నైపుణ్య కల్పన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి.నోట్ల రద్దు కాలంలో కొన్ని నెలలపాటు అనేక లక్షల మంది ఉద్యోగాలు లేకుండా గడిపారు. అయినప్పటికీ వారికి మోడీ ప్రభు త్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు. బ్యాంకు సిబ్బందిపై పనిభారం విపరీతంగా పెరిగింది. కానీ వారికి కూడా అదనపు చెల్లింపుగాని, నష్ట పరిహారంగాని లేదు. చేనేత, మరమగ్గాలకు చెందిన 10 లక్షల మంది జౌళి కార్మికులకు జిఎస్‌టి వలన బతుకు చిన్నాభిన్నమైంది. మోడీ ప్రభుత్వానికి అదిపెద్ద అంశమే కాదు. సంస్థల దివాళా నియమావళి అన్నది అనధికార మూసివేత విధానంగా మారింది. మోడీ తాజాగా బ్యాంకు డిపాజిట్లపై కన్నేసి తేదలచిన ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లుపై కూడా బ్యాంకు సిబ్బంది పోరాట పంథా వైపు మళ్లుతున్నారు. మలాన్ని చేతులతో ఎత్తే పారిశుద్ధ పనివారి ఆనవాయితీని నిషేధించకుండా వృత్తి మూలంగా సంభవించే మరణాల సందర్భంలో వారికి నష్ట పరిహార మొత్తాన్ని పెంచాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అది ఒకరకంగా ఆ దుర్మార్గపు ఆనవాయితీకి ఆమోద ముద్ర వేయడమే అవుతుంది. బాల కార్మిక దుష్ట సాంప్రదాయాన్ని దృఢ చిత్తంతో నిరోధించడం మాని ఎన్‌డిఎ ప్రభుత్వం దానిని కొన్ని రంగాలలో కొనసాగేలా చేస్తోంది. గర్భిణీ స్త్రీలకు నగదు సదుపాయాన్ని ఇద్దరు పిల్ల ల బదులు ఒక బిడ్డకే పరిమితం చేయడం ద్వారా దానికి కూడా గండికొట్టింది. కాబట్టి రానున్న బడ్జెట్‌లో కార్మిక లోకం ఆశలను వెలిగించే చర్యలేవీ ఉండకపోవచ్చు.

Comments

comments