Search
Monday 23 April 2018
  • :
  • :

‘పద్మావత్’ చిత్ర ‘రాజకీయం’!

PADMA

రాజస్థాన్ ప్రభుత్వం ఇంతవరకు రెండు సినిమాలను నిషేధించింది. ఇందుకోసం అల్లర్లు చేసింది కర్నీసేన. రాజపుత్ర సముదాయం ప్రతినిధిగా కర్నీసేన తన గురించి చెప్పుకుంటుంది. అది నిషేధం కోసం అల్లర్లు చేసిన రెండు సినిమాలూ చారిత్రక చిత్రాలుగా అందరూ భావిస్తున్నప్పటికీ పాత్రలు మాత్రం కల్పిత మైనవే అని చాలామంది చరిత్ర కారుల అభిప్రాయం.
ఇందులో మొదటి సినిమా జోధా అక్బర్. ఈ సినిమా వచ్చినప్పుడు కూడా కర్నీ సేన దానిని నిషేధించాలని గలాభా చేసింది. రాజస్థాన్ కాలేజీల్లో ఘర్షణ లు జరిగాయి. కర్నీసేన అభ్యంతరాలేమిటం టే ఒక రాజపుత్ర రాకుమారిని ముస్లిం అయిన అక్బర్ చక్రవర్తి పెళ్ళాడ్డం వాళ్ళు చూడలేకపోవడం. నిజానికి చరిత్ర లో అక్బరుకు జోధాబాయి అనే భార్య లేనేలేదని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. అక్బర్ చక్రవర్తి రాజపుత్ర రాకుమారిని పెళ్ళాడింది నిజమే కాని ఆమె రాజా బిహారిమల్ కూతురు, అమెర్ రాజకుమారి. ఆమె పేరు హీరా కుమారి. ఆమెకు పుట్టినవాడే జహంగీర్. ఆమె పేరు తర్వాత మరియంముజ్జమానీగా మారింది. జహంగీర్ కూడా రాజపుత్ర రాకుమారిని పెళ్ళాడాడు. జోధపూర్ పాలకుడు రాజా ఉదయ్ సింగ్ కుమార్తె. జోధాబాయి అనే పేరు ఈమెకే ఉండాలి, ఎందుకంటే ఈమె జోధపూర్ పాలకుడి కుమార్తె. చరిత్రలో అక్బర్ చక్రవర్తి ఉన్నాడు కాని, అక్బరు భార్య జోధాబాయి లేదు. ఒక కల్పిత పాత్ర విషయంలో అల్లర్లు సృష్టించింది కర్నీసేన. పైగా ఆనాటి రాజపుత్ర రాజులు స్వయంగా తమ కుమార్తెలను ముస్లిం చక్రవర్తులకు ఇచ్చి పెళ్ళి చేయడానికి అభ్యంతరాలు లేవు, కాని నేటి రాజపుత్ర ప్రతినిధులుగా చెప్పుకునే కర్నీసేన వంటి వారికి చాలా అభ్యంతరాలొచ్చేశాయి. రాజస్థాన్‌లో నిషేధం విధించారు. ఆ తర్వాత ఏం జరిగింది? కొంతకాలానికి ఈ సినిమా టివిల్లో, థియేటర్లలో అందరం చూస్తున్నాం. ఆనందిస్తున్నాం. సినిమా పై నిషేధం ఇప్పుడు ఒక జోక్‌లా మారింది. ఇప్పుడు పద్మావత్‌పై కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది. నిజానికి చరిత్రలో పద్మావతి లేదా రాణీ పద్మినీ అనే వ్యక్తి ఎవరూ లేరని చరిత్రకారుల అభిప్రాయం. ముహమ్మద్ జైసీ రాసిన కావ్యంలోని పాత్ర పేరు పద్మావత్. ఈ కల్పితపాత్రపై తీసిన సినిమాపై ఇప్పుడు కర్నీసేన హూంకరిస్తోంది. ఈ సినిమాను రాజస్థాన్‌లో విడుదల చేస్తే థియేటర్లు తగలబెడతామని అంటోంది.
రాజస్థాన్‌లో బిజెపికి పునాదులు వేసినవాడు, బిజెపిని బలమైనపార్టీగా మార్చిన నాయకుడు భైరాన్ సింగ్ షెకావత్. ఇక్కడ ఆయన గురించి కాస్త చెప్పుకోవాలి. రాజస్థాన్‌లో సతీసహగమనం చేసిన రూప్ కన్వర్ గురించి అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. చాలామంది చదివే ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం కొందరు రాజపుత్ర ప్రతినిధులుగా చెప్పుకునే ఇలాంటి గుంపులు భైరాన్ సింగ్ షెకావత్‌ను ఒక రైల్వే స్టేషనులో చుట్టుముట్టి, రూప్ కన్వర్‌ను దేవతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. “సతీమాత” గా ప్రకటించాలని తన చుట్టూ చేరి డిమాండ్ చేస్తున్న వారి చేతుల్లో తల్వార్లు, కత్తులు, కఠార్లు చూసి ఎవరైనా ఏం చేస్తారు? పైగా అప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి నాయకుడాయన. ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో పార్టీకి కొత్త బలం కూడా ఇవ్వవచ్చు. అల్లర్లకు పాల్పడుతున్న వారికి మద్దతు పలికి రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవచ్చు. కాని భైరాన్ సింగ్ షెకావత్ అలా చేయలేదు.“నా చిన్నప్పు డే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ సతీసహగమనం చేసి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడినే కాదు. నేను సతీసహగమనాన్ని ఎన్నటికీ సమర్ధించేది లేదు” అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. ఆయన్ను లొంగదీయలేని అల్లరి గుంపులు వెనక్కి తగ్గాయి.
ఇప్పుడలాంటి నాయకుడు బిజెపిలో ఎవ్వరూ కనబడడం లేదు. ఇప్పుడు పద్మావత్ సినిమాపై జరుగుతున్న ఈ తంతు యెడల ఆయన ఉన్నట్లయితే ఎలా వ్యవహరించేవాడు. పద్మావత్‌ను అడ్డుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించి ఉండేవాడు. రాజస్థాన్‌లో అలాంటి మరో నాయకుడు రాలేదు. ప్రస్తుతం బిజెపి నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం కర్నీసేనకు వంతపాడడంలో పోటీ పడుతున్నారు. పద్మావత్ సినిమాపై అనేక విమర్శలు, అల్లర్ల తర్వాత ఒక స్పెషల్ ప్యానెల్ ఈ సినిమా చూసి సర్టిఫికేటు ఇచ్చిం ది. సెన్సారు బోర్డు సర్టిఫికేటు తర్వాత ఇక ఎలాంటి సమస్యలు ఉండరాదు. కాని రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం సినిమా విడుదలకు అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధియా మాట్లాడుతూ పద్మిని మాకు చరిత్ర మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ అన్నారు. రాణి పద్మిని బలిదానం మా అందరికీ గర్వకారణం అని కూడా చెప్పారు. కాని సెన్సారు బోర్డు అంగీకరించి, ఆమోదించిన సినిమాను కొన్ని అల్లరి మూకలు నిషేధించమంటే నిషేధించడం రాష్ట్రప్రభుత్వానికి గర్వకారణమా? పరువు నష్టమా?
సెన్సారుబోర్డు అభిప్రాయం కన్నా అల్లరి మూకల అభిప్రాయమే గొప్పదని ప్రభుత్వం అనుకుంటుందా? అలా అనుకోవడం రాష్ట్రానికి గర్వకారణ మా? పరువు నష్టమా? లేకపోతే ఈ అల్లరి గుంపులు హింసాకాండకు పాల్పడతాయని భయపడుతుందా? హింసాకాండకు పాల్పడే అల్లరి గుంపులను అదుపు చేయలేని చేతకానితనాన్ని ఒప్పుకుంటుందా?రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె సింధియా దృష్టిలో ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సెన్సారు బోర్డు కన్నా, చరిత్రకారుల అభిప్రాయా ల కన్నా అల్లరి గుంపులే ఎక్కువ అని తేలిపోయింది. ఇది పరువునష్టమే తప్ప గర్వకారణం కానేకాదు.
రాజస్థాన్‌లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. రైతుల ఆందోళనలు, ప్రభుత్వాధికారుల అవినీతిపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పద్మావత్ సమస్య రాజకీయంగా బాగా పనికి వచ్చేలా దొరికింది. రాజస్థాన్‌లో రాజపుత్రులు పదిశాతం ఉంటారు. వారంతా కర్నీసేనకు మద్దతుదారులని చెప్పలేం. రాణాప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్, అమర్ సింగ్ రాథోడ్ వంటి వీరులు జన్మించిన నేలలో గుప్పెడు మంది అల్లరి మూకలకు ప్రభుత్వం లొంగిపోతున్న పరిస్థితి నిజంగానే సిగ్గుచేటు. కాంగ్రెసు కూడా మౌనంగా తమాషా చూస్తుందే కాని గట్టిగా మాట్లాడడం లేదు. అందులో కూడా అశోక్ గెహ్లాట్ వంటి నాయకులు కనుమరుగైపోయారు. ప్రధానిగా పి.వి. నరసింహరావు ఉన్నప్పుడు, ఆయనకు సన్నిహితుడిగా పేరుపడిన చంద్రస్వామిని తీవ్రం గా విమర్శించడానికి కూడా గెహ్లాట్ వెనుకాడలేదు. ఆశారాం బాపు విషయంలో కఠినంగా చర్యలు తీసుకోడానికి సంకోచించలేదు. ఆ గెహ్లట్ కూడా ఇప్పుడు మౌనంగా చూస్తున్నాడు.
భావ ప్రకటనా స్వేచ్ఛ అన్నది ఇప్పుడు అల్లరి గుంపుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడింది. ప్రతిసారి ఎవరో ఒకరు మనోభావాలు గాయపడ్డాయని హంగామా చేయడం, ఏదో ఒక సినిమా విడుదలపై గలాభా చేయడం మామూలైంది. కొంతకాలం క్రితం ఇలాగే తన సినిమా విడుదల ప్రమాదంలో పడినప్పుడు చివరకు ప్రభుత్వంపై ఆధారపడడం కన్నా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అల్లరిమూకలతో ఒప్పందం చేసుకోవడమే మంచిదని కరణ్ జోహర్ నిర్ణయించుకున్నాడు. ఈ ఒప్పందానికి స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ మధ్యవర్తిత్వం వహించడం మన ప్రజాస్వామ్యం ఎలా ఉందో చెప్పకనే చెబుతున్న చేదువాస్తవం. ‘యే దిల్ హై ముష్కిల్’ లో పాకిస్థానీ నటుడు ఫవ్వాద్ ఖాన్ ను కరణ్ జోహర్ తీసుకున్నాడు.
ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలతోనే ఫవ్వాద్ ఖాన్ కాని మరో నటుడు కాని భారతదేశం లో వచ్చి పని చేశాడన్నది గుర్తించాలి. ఇందులో తప్పంటూ ఏదన్నా ఉంటే కరణ్ జోహర్ ది కాదు, ప్రభుత్వానిది. కాని అల్లరి గుంపులు కరణ్ జోహర్ సినిమా విడుదల చేయరాదని గలాభా చేశాయి. ఇలాంటి అల్లర్లే షారుక్ ఖాన్ సినిమా రయీస్ విషయంలోను జరిగాయి. ఆయన సినిమాలో పాకిస్థానీ నటి మహీరా ఖాన్‌ను తీసుకోవడం అభ్యంతరాలకు కారణం. చాలామంది మనోభావాలు గాయపడ్డాయి. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై సినిమా వల్ల మరాఠీ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మండిపడింది. సినిమాలపై అల్లరి శక్తులు దాడులు చేయడం అనేది ఒక మామూలు విషయంగా మారిపోయింది.పద్మావత్ సినిమా షూటింగ్ సందర్భంగా సెట్ పై దాడి చేసి, దర్శకుడు భంసాలీపై భౌతికదాడికి తెగబడిన వారిలో ఒక్కరిని కూడా రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు అరెస్టు చేయలేదు. భంసాలీ తలనరకాలని, హీరోయిన్ దీపికా పదుకునే ముక్కు చెవులు కోయాలని బెదిరింపులు చేసిన వారెవ్వరిపై చర్యలు లేవు. హింసాకాండకు పాల్పడిన వారిని కాని, రెచ్చగొట్టిన వారిని కాని రాజస్థాన్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. పైగా వారిని బుజ్జగిస్తూ పద్మావత్ సినిమాపై నిషేధం విధించింది. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?

వాహెద్
-7093788843

Comments

comments