Search
Friday 20 April 2018
  • :
  • :

భూమి కోసం ఆగని బీదల పోరు

mahila

* ప్రభుత్వ భూమిలో
వెలసిన గుడిసెలు
* ఆందోళనలు చేసినా స్పందించని ప్రభుత్వం
* ఇళ్ల్ల స్థలాలు ఇచ్చే వరకు కదలం
* అడ్డుకున్న పేదలు, వెనుదిరిగిన తహసీల్దార్

మంచిర్యాల జిల్లా కేంద్రంలో భూ పోరాటాలు అగడం లేదు. గత 20 రోజులుగా పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని గుడిసెలు వేసుకుంటున్నారు. అయితే వారికి నచ్చజెప్పేందేకు వెళ్లిన తహసీల్దార్ శరత్‌ను పేదలు అడ్డుకోవడంతో చేసేది ఏమిలేక వెనుదిరిగారు. గత 20 రోజుల నుంచి పేదలు గుడిసెలు వేసుకుంటున్న ప్రభుత్వం ఇండ్ల స్థలాలు పంపిణీ చేసే విషయంలో పట్టించుకోకపోవడంతో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇప్పటి వరకు రెండు సార్లు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించడమే కాకుండా ఎంఎల్‌ఏ దివాకర్‌రావు ఇంటిని సైతం ముట్టడించి నిరసన తెలిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పేదలు యదావిధిగా గుడిసెలను వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 500 పైగా గుడిసెలను వేసుకున్నారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పేదలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగంలో కదలికలు కనిపించడంతో లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ ఏరియాలోని సర్వే నెం.345లో పేదల గుడిసెలు వెలుస్తున్నాయి. ప్రభుత్వ భూములను ఎక్కడిక్కడే ఆక్రమించుకొని గుడిసెలు వేసుకుంటుండగా రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మంగళవారం మంచిర్యాల తహసీల్దార్ శరత్ పేదలు గుడిసెలు వేసుకున్న ప్రదేశానికి వెళ్లగా పేదలు అభ్యంతరం తెలుపుతూ అడ్డుకున్నారు. ఇండ్ల స్థలాల విషయమై తహసీల్దార్‌ను నిలదీయడంతో ఆయన వెనుదిరిగారు. రాజీవ్‌నగర్ ఏరియాలోని సర్వేనెం. 345లో 310 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా గతంలో 120 ఎకరాల భూములను జంగు సిపాయిలకు ఇవ్వగా మిగతా భూమిలో అర్హులైన పేదలకు అసైన్డ్ చేశారు. అసైన్డ్ పొందిన లబ్ధిదారుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను కొనుగోలు చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేయడమే కాకుండా పక్కనే ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించుకొని రెవెన్యూ రికార్డులలో  పేరు మార్చుకొని పక్కా భవనాలను నిర్మించారు. ప్రస్తుతం భూమి లేని నిరుపేదలు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జంగు సిపాయిలకు చెందిన భూములను ఆక్రమించుకొని తాత్కాలికంగా షెడ్లు వేసుకోగా పరిస్థితి రెవెన్యూ అధికారులకు అర్థం కాని విధంగా మారింది. మంచిర్యాల పట్టణంలో విలువైన ప్రభుత్వభూములను భూ అక్రమార్కులు కబ్జా చేస్తుండగా పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసే విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దాదాపు 500 గుడిసెలు వెలిశాయి. గుడిసెలు వేసుకున్న నిరుపేదలు రాత్రింబవళ్లు తేడా లేకుండా పిల్లాపాపలతో అక్కడే ఉంటున్నారు. వంటావార్పులు చేసుకుంటూ కూలి పనులకు వెళ్తున్నారు. అధికారులు ఎప్పుడు వచ్చి గుడిసెలు తొలగిస్తారోననే భయంతో కొందరు గుడిసెల వద్దనే ఉంటూ అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. ఏదిఏమైనా ఇండ్ల స్థలాలు పంపిణీ చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని, పేదలు అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేసే విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Comments

comments