Search
Monday 23 April 2018
  • :
  • :

రాహుల్ సహన హిందూత్వ?

edit

‘హిందువుని అని చెప్పుకోడానికి గర్వించు’ అనే నినాదం ద్వారా దేశ రాజకీయాలను మలుపు తిప్పామని భారతీయ జనతా పార్టీ ఘనతను చాటుకోవచ్చు. కానీ ఆ నినాదం ఇప్పుడు వారు ఊహించని విధంగా దారి తప్పి వేరే పార్టీ ఆవరణలో కూడా తచ్చాడుతోంది. 1990 నాటి రామజన్మ భూమి ఉద్యమంతో పాతాళపు లోతులలోంచి కేంద్రస్థానంలోకి వచ్చిన ఆ పార్టీ హిందూత్వపై తన గుత్తాధిపత్యాన్ని ఇతరులు దెబ్బతీస్తుంటే నోరెళ్లబెట్టే పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ ఇటీవల గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఆలయ సందర్శనలు విరివిగా జరిపారు. అలాగే బెంగాల్‌లో మమతా బెనర్జీ మెజారిటీ వర్గీయులైన హిందువులకు మోకరిల్లుతూ ఇటీవల చేపట్టిన కార్యక్రమా లు కూడా బిజెపి నినాదాన్ని ఇతర పార్టీలు హైజాక్ చేస్తున్నాయి అనడానికి నిదర్శనాలు.
ఇదివరకు సెక్యులర్ మంత్రజపం వల్ల ప్రధాన మతంతో వ్యక్తిగతం గా మినహా ఎటువంటి సంబంధాలు బాహాటంగా పెట్టుకోడానికి భయపడే ఆనవాయితీ నుంచి ప్రధాన పార్టీలు బయటపడి పెను మార్పుకు నాంది పలుకుతున్నాయనడానికిది నిదర్శనం. మతాన్ని రాజకీయాలతో కలగలపడం ఆదిలో ముస్లిమ్ లీగ్ అనుసరించిన పోకడ. 1937 ఎన్నికలలో కాంగ్రెస్‌పై చెప్పుకోదగ్గ విజయం దక్కకపోవడంతో మత మార్గాన్ని పట్టక తప్పదని అది నిర్ణయానికి వచ్చింది. ‘ఇస్లామ్ ఖత్రేమే హై’ (ఇస్లామ్ ప్రమాదంలో ఉంది) అని హెచ్చరిస్తూ, వలస పాలకులు పోయి కాంగ్రెస్ సారథ్యంలో హిందూ పాలకులు వస్తే ముస్లిమ్‌లు నశించి పోవలసిందే అని తమ మతస్థులలో ముస్లిమ్ లీగ్‌వారు భయాలను వ్యాపింప జేశారు. అదే దారిలో బిజెపి కూడా 1984లో రెండు పార్లమెంటు సీట్లే గెలిచినపుడు ఓటర్లను బుజ్జగించితే ఎటూ తేలమనీ నిర్ధారణకు వచ్చింది. హిందూ కార్డే శరణ్యం అని నిర్ణయించింది. మధ్యయుగాల నాటి ఆలయాల ధ్వంసం నుంచి 1947లో దేశ విభజనదాకా అన్నిటికీ ముస్లిములే కారణమని నిందించడం ప్రారంభించింది. మత ద్వేషాన్ని ప్రచా రం చేయడం ద్వారా హిందూ ఐక్యతను, తద్వారా మెజారిటీ ఓటు బ్యాంకును సృష్టించే ప్రయత్నంలో పడింది. దేశ విభజన తర్వాత కూడా దేశంలో ముస్లింలు ఉనికిని కొనసాగించడాన్ని బిజెపి మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకిస్తోంది. ఆ సంస్థ గురువు ఎంఎస్ గోల్వాల్కర్ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ అనే పుస్తకంలో ముస్లింలు దేశం చూరుపట్టుకు వేలాడు తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ మత విద్వేష ధోరణి వల్ల బిజెపికి కలిగిన ఏకైక ప్రయోజనం ఏమిటంటే సెక్యులర్ పార్టీలను దోషులుగా చూపడం. రాజకీయాల్లోకి హఠాత్తుగా మత ధోరణులు ప్రవేశించడంతో సెక్యులర్ పార్టీలు గందరగోళంలో పడ్డాయి. ఆ పార్టీల విధానాలను ‘కుహనా సెక్యులరిజం’గా బిజెపి విమర్శించసాగింది. తమది అసలైన సెక్యులరిజం అని బిజెపి చెప్పుకుంటుంది. ‘ఏ ఒక్కరినో సంతోషపెట్టడం కాకుండా అందరికీ న్యాయం చేకూర్చడమే తమ సెక్యులరిజం లక్షం’ అని ప్రచారం చేసుకుంటోంది. ‘కుహనా సెక్యులరిజం’ ముస్లింలను సంతోషపెట్టడానికే ఉందని ఉధృతంగా ప్రచారం చేసింది. కొంతమేరకు ఈ తరహా ప్రచారం లో బిజెపి విజయవంతం అయింది. తమది ‘అందరి కోసం’ ఉన్న పార్టీ అంటూ, ముస్లింలను జాతి వ్యతిరేకులుగా చాటడం దాని ప్రధాన లక్షం. నరేంద్ర మోడీ ‘అందరికీ అభివృద్ధి (సబ్ కా సాథ్ సబ్ కా వికాస్) మంత్రం ఈ ధోరణిలో ఇచ్చిన నినాదమే.
ముస్లిం ఆధిక్యతలోని 54 జిల్లాలు దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రమాదకరమని వ్యాఖ్యానించడం ద్వారా గిరిరాజ్ సింగ్ వంటి ఆయన మంత్రులు మతపరమైన విద్వేష ప్రచారాలను కొనసాగిస్తున్నప్పటికీ అభివృద్ధిలో అందరినీ కలుపుకుపోవాలి అనే నినాదాన్ని మోడీ ఇచ్చారు. మరో బిజెపి ఎంఎల్‌ఎ తాజ్ మహల్‌ను భారతీయ సంస్కృతికి మచ్చగా అభివర్ణించారు. మోడీ నినాదం ఆచరణలో కనపడడం లేదనడానికి ఆయన మంత్రులు, ఎంఎల్‌ఎలు చేసే వ్యాఖ్యలే ఉదాహరణ. బిజెపి చెబుతున్నంత హిందూ వ్యతిరేకులం తాము కామని సెక్యులర్ పార్టీలు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు కొత్తగా చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికల తరుణంలో రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన వారిలోని ఈ కొత్త ధోరణికి నిదర్శనం.
బిజెపి దారిలో నడిస్తే ప్రమాదమని శశిథరూర్ వంటి కొందరు కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. లేకుంటే ముస్లింలను దూరం చేసుకోవడం ద్వారా హిందువుల హృదయాలను చూరగొనాల్సి వస్తుందన్నది కూడా వారి హెచ్చరిక సారాంశం. బిజెపికి చెందిన అరుణ్ జైట్లీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అసలు సరుకు దొరుకుతున్నప్పు డు దానిలాంటి మరోటి ఎందుకు కోరతారు అన్నది ఆయన ప్రశ్న. అంటే హిందూ మిత్రపక్షం బిజెపి మాత్రమేనని, బిజెపిని అనుసరించే పార్టీలకు తావుండదని చెప్పడమే. కాంగ్రెస్ దారి మార్చుకోవడం బిజెపికి సుతరామూ ఇష్టం లేదని చెప్పలేము అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ రాహుల్ గాంధీ ఆలయ సందర్శనలను వెక్కిరిస్తూ వాటిలో ఆయన ‘నమాజ్’ చేశారా అని అన్నారు. ఆలయాల్లో రాహుల్ భంగిమ అలాగే కనిపిస్తోందన్నారు. రాహుల్ తన ఇంటిపక్క ఆలయాలనే సందర్శించారా అంటూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ విస్తుపోయారు. రాహుల్ గాంధీ కొత్త అవతారాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా ముస్లింలు భావించకపోవచ్చు కాబట్టి ఆ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకు చెక్కుచెదరదని బిజెపికి తెలుసు. దేవాలయాలకు వెళ్లడం అంటే మసీదును కూల్చడంగా ముస్లింలు భావించరు. ఆ పని 1992 డిసెంబర్ లో బిజెపి మద్దతుదార్లు అయోధ్యలో చేశారు. మథుర, వారణాసి మసీదులను ఇప్పటికీ వారు గురిపెడుతున్నారు. ఈ కోణంలో చూస్తే రాహుల్ ప్రవర్తనలో మార్పు కేవలం సరిదిద్దుకోవడమే అవుతుంది.
సెక్యులరిజం అర్థాన్ని పూర్తిగా మార్చివేసి విరుద్ధ ధోరణిలో బిజెపి సాగుతున్నందువల్ల తన మార్గాన్ని సరిదిద్దుకోవలసిన అవసరం రాహుల్ కు వచ్చింది. అలాగే గతంలో షాబానో విషయంలో కాంగ్రెస్ కూడా ముస్లిం ఛాందసవాదులను సంతోషపెట్టబోయి తప్పు చేసింది. ఛాందసవాదుల భావజాలం సగటు ముస్లిం కలిగి ఉంటాడని అప్పట్లో కాంగ్రెస్ అపోహపడింది. కాంగ్రెస్‌వి అనైతిక రాజకీయాలని, తాము దశాబ్దాలుగా హిందూ సనాతన భావజాలానికి రక్షకులమని బిజెపి చాటుకుంటోంది. బిజెపి ప్రచారాలను తిప్పికొట్టడమే రాహుల్ ఆలయాల సందర్శన అసలు ఉద్దేశం. బెంగాల్‌లో మమతా బెనర్జీ హిందూ అనుకూలతను ప్రదర్శించడాన్ని కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. మొత్తానికి రాహుల్ వైఖరిలో మార్పు బిజెపికి గొంతులో పచ్చి వెలక్కాయలా మారిందని చెప్పవచ్చు. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అని రాహుల్ అన్నట్టుగా ఈ వ్యవహారం ఉంది.
* అమూల్య గంగూలీ

Comments

comments