Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

క్యూ3 ఫలితాలే కీలకం

స్థూల గణాంకాలు, బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభావం చూపుతాయి: నిపుణులు

indexముంబయి : వచ్చే వారం స్టాక్‌మార్కెట్లను ప్రధానంగా మూడో త్రైమాసిక ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో క్యూ3(అక్టోబర్-డిసెంబర్) ఫలితాలను దేశీ కార్పొరేట్ సంస్థలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ ఫలితాలతోపాటు ఆర్థిక గణాంకాలు, బడ్జెట్ ప్రతిపాదనలు వంటి అంశాలు కూడా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి సార్వత్రిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
మూడో త్రైమాసిక ఫలితాల విషయానికొస్తే ఇప్పటికే లిక్కర్ కంపెనీ జిఎం బ్రూవరీస్ ఫలితాలను వెల్లడించింది. దీంతో శుక్రవారం లిక్కర్ షేర్లకు లాభాల కిక్‌నిచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే వారం ప్రధానంగా సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్‌లతోపాటు ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండస్‌ఇండ్ మూడో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. గురువారం టిసిఎస్, ఇండస్‌ఇండ్, శుక్రవారం ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడించనున్నాయి. అపోలో మైక్రో సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ ఈనెల 10న మొదలుకానుంది. శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వివరాలు ప్రకటించింది. 2017-18లో జిడిపి 6.5 శాతం వృద్ధి సాధించవచ్చంటూ ముందస్తు అంచనాలు విడుదల చేసింది. దీంతో జిడిపి నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2016-17లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.1 శాతంతో పోలిస్తే ఈసారి క్షీణించింది. దీనికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) అమలు వంటి అంశాలు జిడిపిపై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీని వల్ల సోమవారం మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తవచ్చని, వారాంతాన మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకిన నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నవంబర్ నెలకు గాను ఐఐపి(పారిశ్రామికోత్పత్తి సూచీ) వివరాలను ప్రభు త్వం ఈనెల 12న విడుదల చేయనుంది. అక్టోబర్‌లో ఐఐపి 2.2 శాతం వృద్ధి చూపింది. అదే సమయంలో డిసెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడికానున్నాయి. ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల) పెట్టుబడుల తీరు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు వంటి అంశాలు దేశీయంగా ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని నిపుణులు పేర్కొంటున్నారు. ఏమైనా ప్రస్తుతం క్యూ3 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని, ఇవి సానుకూలంగా ఉంటే మార్కెట్లు లాభాలతో ముందుకెళతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

comments