Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రెవెన్యూ అధికారి భూ కుమ్మక్కు

land

కబ్జాకోరలకు పదును రంగారెడ్డి జిల్లా జెసి నిర్వాకం
లబోదిబోమంటున్న భూ యజమాని

షాద్‌నగర్ : సాక్షాత్తూ రెవెన్యూ ఉన్నతాధికారులే కబ్జాకోరలకు పదును పెట్టి భూ సొంతదారుకు దగా చేసిన దారుణోదంతం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామపరిధిలో చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇక్కడ వేర్వేరు సర్వే నెంబర్లలో 34.31 ఎకరాల మేరకు ఉన్న హైదరాబాద్ నగరవాసి మాడ్గుల కృష్ణారెడ్డికి చెంది న భూమిని స్వయంగా జాయింట్ కలెక్టరే కబ్జాదారుల పేర ఖరారు చేసినట్టు భూమి సొంతదారు ఆధారాలతో ఆరోపించారు. ఈ భూమిలో 12.15 ఎకరాలు సర్వేనెంబర్ 191లో, 9.16 ఎకరాలు 192లో, 13 ఎకరాలు 193లో ఉన్నది. ఈ భూమిని కృష్ణారెడ్డి కొన్న తరువాత చట్ట ప్రకారం ప్రొసీడింగ్స్ బి/2468/2007 ద్వారా మ్యుటేషన్ చేసుకోవడం కూడా జరిగింది. అనంతరం ప్రభుత్వానికి నాలా పన్ను చెల్లించి 2009లోనే వ్యవసాయేతర భూమిగా మార్చుకొని చుట్టూ ప్రహరీగోడను కూడా నిర్మించుకున్నారు. తరువాత కార్పోరేషన్ బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. రెవెన్యూ యంత్రాంగం మాత్రం దీనిని బొత్తిగా పట్టించుకోలేదు. ఈ భూమిని తనకు విక్రయించిన వ్యక్తి గతంలో (1977) షాద్‌నగర్ కోర్టులో కేసు గెలిచి తమకు విక్రయించిన తేదీ వరకు స్వయంగా సాగుచేస్తూ వచ్చాడని, అతని పేర తిరుగులేని పట్టా కూడా ఉన్నదని కృష్ణారెడ్డి తెలియజేశారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ తమ వద్ద ఉన్న సర్వ ఆధారాలను, తమ అభ్యర్థనను తృణీకరించారని వాపోయారు. రామచంద్రయ్య కుమారులమంటూ అప్పీల్ చేసుకున్న (అప్పీల్ నెంబర్ డి1/4728/2016 ఆర్‌ఆర్‌డి 174/2004) బోయినిపల్లి నర్సింలు, బోయినిపల్లి యాదగిరిలే ఈ భూమికి హక్కుదారులని గతనెల 14న అక్రమంగా, అన్యాయంగా ప్రొసీడింగ్స్ ఇచ్చారని, తమకు ఆర్డర్ కాపీని గానీ, నోటీసులు గానీ ఇవ్వకుండానే ఈ దారుణానికి పాల్పడ్డారని కృష్ణారెడ్డి తెలియజేశారు. మ్యుటేషన్ కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారిని పట్టించుకోకుండా ఇటువంటి కబ్జాలకు తివాచీలు పరుస్తున్న రెవెన్యూ అధికారుల తీరు జిల్లాలోని అసలు భూయజమానులను ఆందోళనకు గురిచేస్తున్నదని, ఇటువంటి కేసులు ఇంకా ఉన్నాయని కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments