Search
Thursday 18 January 2018
  • :
  • :
Latest News

ఎటిఎంలలోకి రూ.200 నోటు

atm2

న్యూఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు చిల్లర కోసం ఇప్పటికీ నానా తంటా పడుతున్నారు. చిన్న నోట్ల సంఖ్యను పెంచడం ద్వారా చిల్లర కష్టాలను తీర్చవచ్చని భావించిన ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఇటీవల రూ.200 నోటును ప్రవేశపెట్టింది. గతేడాది సెప్టెంబరు నుంచి రూ.200 నోటు చలామణీలోకి వచ్చింది. కేవలం బ్యాంకుల ద్వారానే ఈ నోట్ల చలామణి జరుగుతోంది. దీంతో ప్రజలకు చిల్లర సమస్య తీర్చేందుకు ఈ నోట్లను వీలైనంత త్వరగా ఏటిఎంల ద్వారా అందజేయాలని బ్యాంకులను ఆర్‌బిఐ ఆదేశించింది. ఎటిఎంలలోనూ రూ.200 నోటును అందించాలని బ్యాంకులను, ఎటిఎం తయారీదారులను ఆర్‌బిఐ ఆదేశించినట్టు ఓ బ్యాంకర్ వెల్లడించారు. అయితే ఇది అమల్లోకి వచ్చేందుకు 5 నుంచి 6 నెలల సమయం పట్టొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2000 రూపాయల నోట్లకు బదలుగా వీలైనంత ఎక్కువగా చిన్న నోట్లను ఎటిఎంల ద్వారా ప్రజలకు అందేందుకు రిజర్వు బ్యాంక్ ప్రయత్నాలు చేస్తోంది. రూ.200నోట్లను జారీ చేసేందుకు వీలుగా ఎటిఎంలలో మార్పుల ప్రక్రియను చేపట్టాయని సదరు అధికారులు పేర్కొన్నారు. మరో 5 నుంచి ఆరు నెలల్లో ఎటిఎంలలో రూ.200 నోట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అయితే దీనిపై ఆర్‌బిఐ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. రూ.200 నోట్లను ఎటిఎంల ద్వారా ఇవ్వాలంటే అందుకోసం వాటిలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ కరెన్సీ సైజుకు తగిన విధంగా మార్పులు చేపట్టాల్సి వుంటుందని ఎటిఎం తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఈ మార్పుల కోసం ఒక్కో ఎటిఎంపై సగటున రూ.5000 ఖర్చు చేయాల్సి ఉంటుందని సమాచారం. దేశవ్యాప్తంగా మొత్తం 2.2 లక్షల ఎటిఎంలు ఉండగా, వీటన్నింటిని మార్చాలంటే రూ.110కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నాయి. ఇప్పటికే మార్పుల ప్రక్రియ ప్రారంభించగా, జులై నాటికి ఎటిఎంలలో రూ. 200నోట్లు అందుబాటులోకి వస్తాయని ఎటిఎం సంస్థలు పేర్కొంటున్నాయి.

Comments

comments