Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

సలీల్ వార్షిక వేతనం రూ.16.65 కోట్లు

salil

న్యూఢిల్లీ: అసలే దిగ్గజ ఐటీ కంపెనీ.. దానికి సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) అంటే వేతనం మామూలుగా ఉండదు. ఇటీవల ఇన్ఫోసిస్ కొత్త సిఇఒగా బాధ్యతలు చేపట్టిన సలీల్ పరేఖ్ జీతమెంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి రూ. 16.25 కోట్లు.. అయితే ఈ వేతనం ఇంతకుముందు సిఇఒగా పనిచేసిన విశాల్ సిక్కా కంటే తక్కువ కావడం విశేషం. సలీల్ స్థిర వేతనం కింద రూ.6.5 కోట్లు, వేరియబుల్ పే కింద రూ.9.75 కోట్లతో పాటు రూ.3.25కోట్ల విలువ గల స్టాక్ యూనిట్లను అందిస్తున్నట్లు కంపెనీ స్వతంత్ర బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందార్ షా తెలిపారు. వీటితో పాటు వార్షిక ఈక్విటీ గ్రాంట్ల కింద రూ.13 కోట్లు కూడా సలీల్ తీసుకోనున్నట్టు తెలిపారు. ఇక వన్ టైమ్ ఈక్విటీ గ్రాంట్ కింద మరో రూ.9.75 కోట్లు తీసుకుంటారు. ఇక స్టాక్ యూనిట్ల విలువ ప్రతి ఆర్థిక సంవత్సరానికోసారి మారుతుందని తెలిపారు. గతేడాది ఇన్ఫోసిస్ సిఇఒ విశాల్ సిక్కా అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియామకాలు చేపట్టిన సంస్థ సలీల్ పరేఖ్‌ను సిఇఒగా నియమించగా, మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. సిక్కా తర్వాత ఇన్ఫీ సిఇఒ పదవిని చేపట్టిన రెండో ప్రమోటేతర వ్యక్తి సలీల్, కంపెనీ ఏర్పాటు చేసిన కమిటీ ఆయన్ని ఎంపిక చేసింది. అంతేగాక సంస్థ ఆరో సిఇఒ కూడా సలీలే.. ఐదేళ్ల పాటు సిఇఒ పదవిలో కొనసాగుతారు. మాజీ సిఇఒ సిక్కా 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ 6.75మిలియన్ డాలర్లు(దాదాపు రూ.42 కోట్లు) వేతనం అందుకున్నారు. దీనిపై సంస్థ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Comments

comments