Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సర్దుకుపోదాం..రండి

partty* కలిసి పోరాడుతాం అంటున్న కాంగ్రెస్ నేతలు
* కార్యకర్తల్లో వెల్లివిరుస్తున్న ఉత్సాహం

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: నల్లగొండ జిల్లా కార్యకర్తల్లో ఉత్సాహం రేకెత్తుతోంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డినే తిరిగి టీపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగిస్తున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో జిల్లాలో వర్గా విబేధాలకు స్వస్తి చెప్పి సర్దుకుపోదాం అనే ధోరణిలో నేతలు ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు టీపీసీసీ పీఠం పై కన్నేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో తగిన గుర్తింపుతో పాటు పిసిసి పగ్గాలు చేతికందుతాయని భావించారు. ఆ మేరకు పార్టీలోని మిగ తా నేతలపై ఒత్తిడి పెంచి ప్రచార దూకుడు పెంచుతూ వచ్చారు. కాంగ్రెస్ పెద్దన్నగా పేరొందిన సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్‌పి ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు కావడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయమంతా జిల్లా నేతల వ్యవహరంతో పెనవేసుకపోయింది. జానారెడ్డి వివాదాల జోలికి పోకుం డా స్వంత వ్యవహరశైలితో ముందుకు సాగుతున్నారు. స్వపక్ష మో, విపక్షమో తెలియనంత ఇదిగా రాజకీయ వ్యవహరాలు చక్కబెడుతున్నారు. అటు ప్రభుత్వా న్ని ఆయా సందర్బాల్లో ప్రశంసలతో ముంచెత్తుతూ అప్పుడపుడు విపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. జిల్లాలో ఇటీవల కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ తమ వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకునే రీతిలో ర్యాలీ లు, సభలు, సమావేశాలు నిర్వహించారు.  హఠాత్తు నిర్ణయాలతోవిపక్షాన్ని, స్వపక్షాన్ని విమర్శలతో ఇరుకున పెడుతూ వచ్చారు. కొంతకాలం బ్రదర్స్ టీఆర్‌ఎస్‌లోకి చేరుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆపై అమిత్‌షా జిల్లా పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ బిజెపిలో చేరిక ఖాయమని రాజకీయ చర్చలు సాగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాపై మాటల ఈటెలు విసిరినప్పుడు బ్రదర్స్ పార్టీ మారడం తధ్యం అనుకున్నారు. నకిరేకల్, మునుగోడు, దేవరకొండ మూడు నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్దులను గెలిపిస్తామనే సంకేతాన్ని చాటారు.  ఇటీవల మనుగోడు నియోజకవర్గం చండూర్‌లో పార్టీ పెద్దనేతలను ఆహ్వనించకుండా రాజగోపాల్‌రెడ్డి రాహుల్‌గాంధీ అభినందన సభను మండల స్థాయి నేతలు, కార్యకర్తలతోనే నిర్వహించారు.  ఎంపీ సీటు కంటే ఎమ్మెల్యే సీటుపై కన్నేసిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకే అన్ని తానై సభ నిర్వహించినట్లు  రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాగా టీపీసీసీ అధ్యక్ష పదవి వరించిననాటి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక వైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజక వర్గంలో పలుమార్లు సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్త ంగా జిల్లా సభల్లో పాల్గొంటూ 2019 ఎన్నికల్లో పార్టీ అమలు చేయనున్న మేనిఫెస్టోను ప్రచారం చేస్తోన్నారు. స్వంత జిల్లా స్వపక్ష నేతల విమర్శల జోలికి పోకుండా తన దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి, రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, రైతుకు రూ. 2 వేల  గిట్టుబాటు ధర, దళితులకు భూపంపిణీపై  పార్టీ స్పష్టతను ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. కాగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ పాలనా పగ్గాలు మారుతాయని ఆశించి భంగపడిన  కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుతం కాగ్రెస్ గెలుపు గీతం పాడుతున్నారు. తమ నియోజకవర్గాలే కాకుండా 10 నియోజకవర్గాలు తమకు అప్పగిస్తే గెలిపించి తెలంగాణా ఇచ్చిన సోనియా రుణం తీర్చుకుంటామని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం నేతలు ఐక్యతా రాగం వినిపిస్తుండటంతో జిల్లా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. గ్రూపుల రాజకీయాలు మాని సర్దుకుపోతే విజయం ఖాయమనే భావనను వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments