Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మాయ దారులు!

Cartoon-New

ఒక గమ్యాన్ని చేరాలంటే ఒక దారి పట్టాలి. కానీ నలుగురు నడిచే దోవలో నడవనొల్లని వాళ్లు చాలా మందే ఉంటారు. మరి వారికి దారేదీ. వాగులూ, వంకలూ దాటుకొంటూ తుప్పలూ, డొంకలూ నరుక్కుంటూ పోవడమే. అందుకు కత్తి ధరించడం తప్పనిసరి. అదిగో అక్కడే హింసావాదం అను కత్తి మార్కు సిద్ధాంతం తలెత్తుతోంది. ఆ తల దించాలంటే కత్తి మార్కు సిద్ధాంతాన్ని కత్తితో తెగ నరకాలి. ఇది మళ్లీ హింసకే దారి తీస్తోంది. అంటే హింస ఓ తప్పనిసరి తద్దినం ఎలా చూసినా..హింసకు ప్రతిగా చేసేది ప్రతిహింస అని కడు విరసాత్మకంగా పాఠం చెప్పబోయారు రావి శాస్త్రి గారు నాకు ఓ సందర్భంలో. అప్పడు ఎదురుగా మా నాన్నగారు పురాణంగారు కూడా ఉన్నారు . ‘ అవి రెండూ ఒకటే అనుకుంటున్నాడు మావాడు’ అన్నారు నాన్నగారు. నేను ఇద్దరికీ ఒకేమాటలో నేననుకొన్న జవాబు చెప్పాను. ‘హింస.. ప్రతి హింస వేర్వేరు పదాలైనా కొంత దూరం తరువాత రెండూ ఒక్కటైపోతాయి జనం దృష్టిలో’ అన్నాను. హింస తప్పయితే ప్రతి హింప ఒప్పా అన్నది నా ప్రశ్న.

ఇంతకూ ఆ చర్చ సందర్భం రావిశాస్త్రి గారి ‘సృష్టిలో..’ కథ. మీరు చదివారో లేదో గాని అది గొప్ప కథ. సృష్టిలో హింస ఉందని మీరు చెప్పారు అన్నాను ఆయనతో. ‘ కాదు.. ప్రతిహింస ఉందన్నాను’ అన్నారు రావిశాస్త్రిగారు. ‘ హింస లేకుండా ప్రతి హింస ఎక్కడిది అని అడిగాను. ‘నేను అడిగేదీ అదే’ అన్నారు ఆయన.. ‘ఇంతకీ అవి వేర్వేరు దారులు కావు, కనీసం ప్రభావంలో’ అని ముక్తాయించారు పురాణంగారు. ఇంతకీ గోవును రక్షించడానికి మనుషుల్ని చంపడం హింసా.. ప్రతిహింసా? చాట్ భండార్ నవ్వుల పరిధి దాటుతోంది! హింస తాలూకు హింసని ప్రతి హింస తాలూకు హింసతో అడ్డుకోవాలను కోవడం కూడా హింసే ! హింస టుది పవర్ ఆఫ్ టూ! హింస దారి అయితే దాన్ని ప్రతి హింసతో అడ్డుకోవాలనుకోవడం మాయదారి! దారులు సవ్యంగా లేని చోట్ల అడ్డదారులు తెరుచుకోవాలి. అడ్డదారులు తెలియకుంటే అసలు దారి పొడుగైపోతుంది.మొసలి పట్టునుంచి గజేంద్రుణ్ణి విడిపించడం మన రోడ్లతో సాధ్యంకాదు . సిరికిన్ జెప్పడు లా హుటాహుటిన వాలాలంటే దారులు బాగుండాలండీ.

– పురాణం జూనియర్, 8౦740 75517

Comments

comments