Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

police2

మన తెలంగాణ/ ఆదిలాబాద్ : ఇసుక అక్రమ రవాణా జరిపే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రహోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో ఇసుక రవాణా, విదేశాలకు పంపించే నకిలీ ఏజెంట్లు, పరిశ్రమల శాఖ ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ప్రభుత్వ పథకాలకు అందించే రుణా లు, ముద్ర రుణాలు వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని సామా న్య ప్రజలకు వారి వ్యక్తిగత అవసరాలకు, పనులకు ఇసుక అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి రాబడితో పాటు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో జరిగే పనులకు ఇసుక సరఫరా చేయడానికి ప్రజల అవసరానికి స్థానిక ఇసుకను వినియోగించుకొనేందుకు విధి విధానాలు ఖరారు చేయడం, మీసేవా ద్వారా బుకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఒకే విధాన పరమైనటు వంటి ఏర్పాట్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ శాఖలు, కింది స్థాయి అధికారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పనుల కోసం గల్ఫ్, విదేశాలకు వెళ్ళే వారు నకిలీ ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఏజెంట్ల విషయంలో చాలా మంది మోసపోతూ, జైళ్ళలో మగ్గుతున్నట్లు వెల్లడించారు.

ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారి పట్ల అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు అయన తెలిపారు. చిన్న, మద్య, సూక్ష్మతరహా పరిశ్రమల పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకు రుణాలు మంజూరు, రికవరీ వంటి అంశాలపై చర్చించి వారికి చేయూత అందించాలని కలెక్టర్లు, బ్యాంకు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ముద్ర రుణాల కింద రూ.5000 కోట్లు లక్షంకాగా, ఇప్పటి వరకు రూ.2016 కోట్లు మాత్రమే మంజూరు చేశారని, ముద్ర రుణాలపై విస్తృత ప్రచారం కల్పించి రాబోయే రెండు నెలల్లో రుణాలు అందించాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు, దళిత, గిరిజన ప్రజలకు, పేద వర్గాల వారికి అందించాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ ఏజెంట్ల విషయంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, బోగస్ ఏజెంట్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇసుక రవాణాలో ఎన్‌ఫోర్స్‌మెంటు టీంలు సక్రమంగా పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఐటి కార్యదర్శి రంజన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా, పరిశ్రమల శాఖలు, ఇతర శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ డి.దివ్య, ఎస్‌పి విష్ణు వారియర్, ఎల్‌డిఎం ప్రసాద్, పరిశ్రమల శాఖ జిఎం రాంకిషన్, మైనింగ్ ఎడి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments