Search
Thursday 19 April 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌లో సీట్ల పంచాయితీ

HAND

*ఉమ్మడి జిల్లాలో టికెట్ల లొల్లి
*పట్టించుకోని ఎఐసిసి, పిసిసి పెద్దలు
*కొత్త జిల్లాలకు కమిటీలు లేక నారాజ్

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
ప్రజల నుంచి పార్టీకి మంచి స్పందన లభిస్తున్నా కాంగ్రెస్ పెద్దలు పంతాలను మాత్రం వీడటం లేదు. మెజారిటీ నియోజకవర్గాల్లో వార్డు స్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉన్న నేతల మధ్య అనైక్యత, గ్రూప్‌లతో, పార్టీని జిల్లా స్థాయిలో సమన్వయంతో నడిపించే నాయకత్వం కరువై కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో పార్టీకి మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్ లాంటి హేమాహేమీలు ఉండటంతో పాటు నియోజకవర్గ స్థాయిలో పటిష్టమైన టీమ్ కలిగినా, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ వంటి ఉద్దండులు ఉన్నా అనుకున్న స్థాయిలో దూకుడు కరువైంది. అసలే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో ఏర్పడిన మనస్పర్ధలు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనైనా పక్కనపెట్టి కలసికట్టుగా ముందుకు పోవడం ద్వారా అధికార పార్టీని కంగు తినిపించే అవకాశం ఉన్నా నేతల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి ఏకతాటిపైకి తీసుకురావలసిన రాష్ట్ర నాయకత్వం మాత్రం రంగారెడ్డి జిల్లాలో అలాంటి చర్యలు చేపట్టకపోవడంపై  విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాకతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నయా జోష్ వచ్చింది. టిడిపితో పాటు టిఆర్‌యస్‌లోని ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో చేరి కొత్త ఉపు తీసుకువచ్చిన జోష్‌ను కంటిన్యూ చేసి మరిన్ని వలసలను ప్రొత్సహించడంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం డీలాపడింది. టిఆర్‌యస్, టిడిపిలలో నైరాశ్యంలో ఉన్న నేతలతో సంప్రదించి తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉన్న కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అలాంటి చర్యలు చేపట్టడం లేదు. చెవెళ్ళ నియోజకవర్గంలో ఇటివల కాలంలో పెద్ద ఎత్తున చేరికలు జరిగిన మిగిలిన నియోజకవర్గాలలో మాత్రం కాస్తా స్తభ్దత కనిపిస్తుంది.
టికెట్ల లొల్లి…
ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో టికెట్‌ల పంచాయతీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. జాతీయ, రాష్ట్ర పెద్దలు పార్టీ నేతలను సమన్వయ పరిచి వివాదాలను సద్దుమణిగేలా చేయవలసి ఉన్న అగ్గికి ఆజ్యం పోసేలా ఇరువర్గాలకు పరోక్ష సహకారం అందచేయడం పార్టీ క్యాడర్‌లో ఆయోమయంకు గురిచేస్తుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూర్‌లో మాజీ మంత్రి మాణిక్ రావు తనయుడు రమేష్ , మాజీ డిసిసిబి చైర్మెన్ లకా్ష్మరెడ్డిలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తు పోటాపోటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని పిలిచి సముదాయించే నాథుడు కరువయ్యారు.
వికారాబాద్‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ పల్లె పల్లెకు ప్రసాదన్న పేరుతో జనంలోకి వెలుతున్నారు. ప్రసాద్ కుమార్‌కు జనం నుంచి మంచి స్పందన సైతం కనిపిస్తుంది. మరోమాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ మాత్రం డిల్లీ పెద్దలతో టికెట్ పైరవీలు చేస్తు ప్రతిపక్షాలపై పోరు కన్న ప్రసాద్‌పై పోరుకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మాజీల పంచాయతీ అధికార పక్షంకు పండుగలా మారనుంది. ఒకరికి టికెట్ వస్తే మరో నేత పనిచేసి గెలిపించే పరిస్థీతులు దారిదాపుల్లో కనిపించడం లేదు. 2014 ఎన్నికలలో వర్గపోరుతో ఇబ్రహింపట్నం లో పరాజయం పాలైన కాంగ్రెస్ నేతలు ఇప్పటికి ఆదే దారిలో పయనిస్తున్నారు. ఇబ్రహింపట్నంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆయన సోదరుడు మల్‌రెడ్డి రాంరెడ్డికి డిసిసి అధ్యక్షుడు క్యామ మల్లేష్‌కు పొసగడం లేదు. గత ఎన్నికల నుంచి ఎవరి దారి వారిదే అయిన రెండు వర్గాలను పిలిచి సముదాయించవలసిన గాంధీ భవన్ పెద్దలు మాత్రం తమకు సంబందం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మేడ్చల్‌లో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిలతో పాటు జంగయ్య యాదవ్‌లు టికెట్ కోసం పోటిపడుతున్నారు. మహేశ్వరం నుంచి మాజీ మంత్రి సబితారెడ్డి, ఎల్.బి.నగర్ నుంచి సుధీర్ రెడ్డి,కుత్బుల్లాపూర్ నుంచి శ్రీశైలం గౌడ్, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి, షాద్‌నగర్ ప్రతాప్‌రెడ్డిలకు టికెట్‌ల విషయంలో పోటిలేదు. చెవెళ్ళ, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలలో కొత్త ముఖాలను టికెట్ వరించే అవకాశం కనిపిస్తుంది. స్వంత పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వలసవచ్చిన నేతలకు టికెట్‌లు దక్కే అవకాశం ఉంది.
కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాదైనా…
కొత్త జిల్లాలు ఏర్పడి సంవత్సరం దాటిన కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాలకు కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోలేని నిస్సాహయ స్థీతితో కనిపిస్తుంది. డిల్లీలో రాహూల్ నాయకత్వంలో యువ టీమ్‌తో 2019 ఎన్నికలకు సిద్దం అవుతున్న కొత్త జిల్లాలకు గాంధీభవన్‌కు, ఇబ్రహింపట్నంకు పరిమితం అయిన నేతకు భాద్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తుంది. మూడు జిల్లాలకు కొత్త టిమ్‌ను ప్రకటించడం ద్వారా నయాజోష్‌తో జనంలోకి పోయే అవకాశం ఉన్న పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోకపోవడంపై పార్టీ క్యాడర్ సైతం మండిపడుతుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో టికెట్‌ల కోసం పోటిపడుతున్న నాయకులను సముదాయించి పార్టీని ఎకతాటిపై నడపడంతో పాటు పార్టీలో యువతకు ప్రాదాన్యత ఇస్తు కొత్త జిల్లా కమిటిలను వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని కార్యకర్తలు ఆశీస్తున్నారు.

Comments

comments