Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

భారత్‌కు చావోరేవో

india

సిరీస్‌పై సౌతాఫ్రికా కన్ను
ప్రతీకారం కోసం కోహ్లి సేన 
నేటి నుంచి రెండో టెస్టు

సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టు భారత్‌కు చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిస్తేనే సిరీస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒక వేళ మ్యాచ్ డ్రాగా ముగిసిన కూడా సిరీస్ సాధించడం భారత్‌కు సాధ్యం కాదు. చివరి మ్యాచ్‌లో గెలిచినా అప్పుడూ 11తో సిరీస్ సమంగా ముగుస్తోంది. ఈ పరిస్థితుల్లో సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్ దక్కించుకోవాలని భావిస్తున్న టీమిండియా ఈ మ్యాచ్‌తో పాటు చివరి టెస్టులోనూ గెలవక తప్పదు. ఇక కేప్‌టౌన్‌లో స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక చతికిల పడిన భారత్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. బ్యాటింగ్ వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. కెప్టెన్ కోహ్లితో సహా అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ అందరూ తొలి టెస్టులో విఫలమయ్యారు. ఒక్క హార్దిక్ పాండ్య మాత్రమే తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు సాధించాడు. మిగతావారు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్‌కు ఎదురు నిలువలేక పోయారు. ఈ పరిస్థితుల్లో శనివారం ప్రారంభమయ్యే రెండో టెస్టు కోహ్లి సేన సత్తాకు పరీక్షగా మారనుంది. ఇందులో గెలిచి కేప్‌టౌన్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని భారత్ కసితో ఉంది. మరోవైపు ఇప్పటికే తొలి టెస్టులో ఘన విజయం సాధించి జోరుమీదున్న దక్షిణాఫ్రికా ఇందులోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలర్లు అద్భుత ప్రతిభతో జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో కూడా సఫారీ తన ఫాస్ట్ బౌలర్లపై భారీ నమ్మకాన్నే పెట్టుకొంది. సీనియర్ బౌలర్ స్టెయిన్ లేకున్నా సౌతాఫ్రికా బౌలింగ్ బలంగానే ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చిన ఫిలాండర్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకొంది. రబడా, మోర్ని మోర్కెల్‌లతో బౌలింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ కూడా బరిలోకి దిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. స్టెయిన్‌కు బదులు అతను ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు జట్లు కూడా విజయంపై కన్నేయడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
రాహుల్‌కు చాన్స్…
ఇక, తొలి టెస్టుకు దూరంగా ఉన్న ఓపెనర్ లోకేష్ రాహుల్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. శిఖర్ ధావన్ స్థానంలో అతను తుది జట్టులోకి రానున్నాడు. తొలి మ్యాచ్‌లో రాహుల్‌ను ఎంపిక చేయక పోవడంపై కోహ్లి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇదే జరిగితే ధావన్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. మురళీ విజయ్ తన స్థానాన్ని నిల బెట్టుకున్నాడు. అతను ఈ మ్యాచ్‌లో కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
రహానెకు కష్టమేనా…
మరోవైపు స్టార్ ఆటగాడు అజింక్య రహానెకు రెండో టెస్టులో కూడా చోటు లభించడం కష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ కోహ్లి అతనికి చోటు కల్పించడంపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు. రహానెకు బదులు ఈ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మను ఆడించాలనే ఉద్దేశంతో కోహ్లి ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే రహానె తుది జట్టులోకి రావడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. బౌన్సీ పిచ్‌లపై మెరుగైన రికార్డును కలిగిన రహానెను ఆడిస్తే తొలి టెస్టులో ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేదని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా కెప్టెన్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. కోహ్లి తనకు ఇష్టమైన క్రికెటర్ రోహిత్ వైపే మొగ్గు చూపుతున్నాడు. రహానె కంటే రోహిత్‌పైనే అతనికి ఎక్కువ నమ్మకం కనిపిస్తోంది. ఇదే జరిగితే రహానెకు మరోసారి మొండిచెయ్యి ఎదురుకావడం ఖాయమని చెప్పాలి.
ఉమేశ్, ఇషాంత్‌లకు చోటు…
రెండో టెస్టులో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టుకు దూరంగా ఉంచాలని కెప్టెన్ నిర్ణయించినట్టు సమాచారం. తొలి టెస్టుకు దూరంగా ఉన్న ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు రెండో టెస్టులో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. అశ్విన్‌కు బదులు ఉమేశ్‌ను, బుమ్రా స్థానంలో ఇషాంత్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయాలని కోహ్లి భావిస్తున్నాడు. ఇదే జరిగితే భారత్ ఒక్క స్పిన్నర్ కూడా లేకుండానే బరిలోకి దిగడం ఖాయం. అయితే కోచ్ మాత్రం అశ్విన్ లేదా జడేజాలలో ఒకరికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నాడు. దీంతో ఇషాంత్, ఉమేశ్, బుమ్రాలలో ఒకరు పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు.
సిరీసే లక్షంగా…
ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి జోరుమీదున్న సౌతాఫ్రికా రెండో మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా చాలా బలంగా ఉంది. తొలి మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నారు. ఎల్గర్, మార్క్రమ్, కెప్టెన్ డుప్లెసిస్, దిగ్గజ ఆటగాడు డివిలయర్స్, రన్ మెషిన్ హాషిం ఆమ్లా, యువ సంచలనం డికాక్‌లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో విఫలమైన ఆమ్లా ఈసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. తనకు కలిసి వచ్చే సెంచూరియన్ గ్రౌండ్‌లో మరోసారి చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. అతను విజృంభిస్తే భారత్‌కు కష్టాలు తప్పక పోవచ్చు. డుప్లెసిస్, డికాక్, డివిలియర్స్ కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశారు. దీంతో సఫారీలతో భారత బౌలర్లకు గట్టి పోటీ పొంచి ఉందనే చెప్పాలి. ఇక, సౌతాఫ్రికా బౌలింగ్ చాలా బలంగా ఉంది. స్టెయిన్ లేకున్నా ఫిలాండర్, రబడా, మోర్కెల్‌లతో బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఈ త్రయానికి ఉందని చెప్పాలి. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఫిలాండర్ ఈ విషయాన్ని అచరణలో నిరూపించాడు. ఈ సారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఇదే జరిగితే భారత బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు ఖాయమని చెప్పాలి. కానీ, తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయంతో గుణపాఠం నేర్చుకున్న భారత్ ఈసారి ఎలాగైన బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో మ్యాచ్‌కు సిద్ధమైంది. తమను చిత్తుగా ఓడించిన సఫారీలను ఓడించి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది.
జట్ల వివరాలు
భారత్ (అంచనా): విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, లోకేష్ రాహుల్/ధావన్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె/రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, వృద్ధిమాన్ సాహా, అశ్విన్/జడేజా/ఉమేశ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ/బుమ్రా, మహ్మద్ షమి.
దక్షిణాఫ్రికా (అంచనా): డుప్లెసిస్ (కెప్టెన్), ఎల్గర్, మార్క్రమ్, హాషిం ఆమ్లా, డివిలియర్స్, డికాక్, ఫిలాండర్, మోర్ని మోర్కెల్, రబడా, మోరిస్, కేశవ్ మహారాజ్.

Comments

comments