Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

ఆశయాలకూ, ఆశకూ అదే తేడా

Jesus

అడిగిన వరమీయని దేవుడు …. అంటారు పెద్దలు. దేవుడంటే అడిగినదల్లా ఇవ్వాలని, వరాల జల్లు కురిపించే వాడని చాలామంది అభిప్రాయం. అది పాక్షికంగా మాత్రమే నిజం. దేవుడు పరలోకంలోని మన తండ్రి అన్న భావన కరువైనప్పుడు వచ్చే వాదన ఇది. చిన్నపుడు మన తల్లిదండ్రుల్ని ఎన్నో అడిగే వారమే కాని, వాళ్ళు మాత్రం మనకేది అవసరమో, తాము ఏది ఇవ్వగలరో అది మాత్రమే ఇచ్చేవారు. తమ పిల్లలకేది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదన్న తల్లిదండ్రుల విచక్షణ వెనుక వారి అనంతమైన ప్రేమ దాగి ఉందని మర్చిపోవద్దు. కత్తులు, రేజర్లు, కత్తెర్లవంటి మొనదేలిన వస్తువులను తల్లిదండ్రులు పిల్లలకందకుండా జాగ్రత్తగా దాస్తారు. పిల్లలకేమో తమకేది అందుబాటులో లేదో వాటిని పొంది వాడుకోవాలని ఆసక్తి, సరదగా అలాంటి ప్రయత్నాల్లోనే పిల్లలు గాయపడటం, తల్లిదండ్రుల చేతిలో ఒకటి రెండు దెబ్బల్ని తినడం ఇదంతా అనుభవమే.. ఆకాశపక్షులను చూడండి, అవి విత్తవు, కూయవు, కొట్టలో కూర్చుకొనవు అయినా కూడా తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా.. అలాంటప్పుడు వాటి కంటె శ్రేష్టమైన మిమ్మల్ని దేవుడు పోషించడా? అని యేసు ప్రభువు ఒకసారి బోధించాడు (మత్తయి 6:26) దేవుడలా వరాలిచ్చినా ఇవ్వకపోయినా, పోషణ భద్రత మాత్రంపుష్కలంగా అనుగ్రహిస్తాడన్నది యేసు బోధల తాత్పర్యం. మనకేం కావాలన్నది మన కన్నా బాగా పరలోకపు తండ్రికే బాగా తెలుసునని, అందువల్ల మనమడిగినా అడుగక పోయినా దేవుడిచ్చేవే మనకు ఆశీర్వాదకరమైనవని యేసుప్రభువు చెప్పాడు. మనమడిగింది దేవుడిస్తే అది ఆశీర్వాదం. మనమడిగింది దేవుడను గ్రహించకపోతే అది అంతకన్నా పెద్ద ఆశీర్వాదం అని అర్థంచేసుకోగల ఆత్మీయ ఔన్నత్యంలోకి విశ్వాసం ఎదగాలి. ఆ స్థాయిలో జీవితంలో ఓటమి, అసంతృప్తి అనేది మచ్చుకు కూడా కనిపించవు. అపరిమితమైన కోరికలు, ఆశలు సాధారణంగా జీవితంలో పరాజయ, అసంతృప్త భావనలకు ఆజ్యం పోస్తాయి. ఆశయాలు మంచివి ఎందుకంటే వాటిలో సమాజ శ్రేయస్సు అనే అంశం నిక్షిప్తమై ఉంటుంది. కాని ఆశలు సాధారణంగా మన స్వార్థానికి ప్రతీకలుగా ఉంటాయి. కాబట్టే వాటి విషయంలో జాగ్రత్త పడాలంటాడు దేవుడు. పల్లకిలో ఊరేగాలన్న ఆశ ఉండటం సహజం కాని అదెప్పుడైనా ఒక సారి జరిగితేనే ఆనందం. కాని జీవితమంతా పల్లకిలోనే ఊరేగాలనుకోవడం అసహజం దురాశాపూరితం. అందుకే ఆశల పల్లకి అన్నారు పెద్దలు.

Comments

comments