Search
Friday 20 April 2018
  • :
  • :

కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణ పనులు

clctr4

మేడ్చల్‌లో వడివడిగా…రంగారెడ్డి, వికారాబాద్‌లలో నత్తనడకగా

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంవత్సరం అనంతరం గత దసరా సందర్బంగా కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణంకు ఆర్బాటంగా శంకుస్థాపన నిర్వహించారు. 2018 దసరా పండుగలోపు కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీచేశారు. మేడ్చల్, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్ నిర్మాణాలను గత సంవత్సరం అక్టోబర్ 11న మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేయగా రంగారెడ్డి కలెక్టరేట్‌కు అక్టోబర్ 12న మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డిలు శంకుస్థాపన చేశారు. పనులకు ఆర్బాటంగా శంకుస్థాపన చేసిన మంత్రులు పనుల పనితీరుపై ఏనాడూ సమీక్షించిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి స్వయంగా కలెక్టరేట్ నిర్మాణ ప్రాంతంలో పలుమార్లు సందర్శించి పనులను స్వయంగా పర్యవేక్షించడంతో పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఇక్కడ పనులు పూర్తి అయ్యే అవకాశాలున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్ పనులను పట్టించుకునే నాథుడు కరువయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు కలెక్టరేట్‌లలో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. రంగారెడ్డి కలెక్టరేట్ అందరికి దూరంగా ఉండటంతో అటువైపు చూసే వారు లేకుండా పోయారు. కలెక్టరేట్‌కు గతంలో ఉన్న మట్టిరోడ్డును నాలుగులైన్ల రోడ్డుగా మార్చగా ఇప్పటివరకు కేవలం చదును చేసి గుంతలు తీసి పిల్లర్‌లను నిలబెడుతున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మాదిరిగానే పనులు కొనసాగితే రెండు కలెక్టరేట్‌లు గడువులోగా పూర్తికావడం గగనమే.

Comments

comments