Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

చివర్లో పైచేయి

india2

సత్తా చాటిన అశ్విన్, రాణించిన మార్క్రామ్, ఆమ్లా, సౌతాఫ్రికా 269/6

సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ ఆఖరి సెషన్‌లో పుంజుకుంది. టివిరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 182/2తో పటిష్ట స్థితిలోఉన్న ఆతిథ్య జట్టును భారత బౌలర్లు ఆట చివర్లో దెబ్బతీశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. అశ్విన్ మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కట్టడి చేశాడు. ప్రత్యర్థి కెప్టెన్ డుప్లెసిస్ (24), కేశవ్ మహారాజ్ (10) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ (94), హాషిం ఆమ్లా (82) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు.
శుభారంభం..
టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందేనని ఓపెనర్లు నిరూపించారు. డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్ సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వీరు ఇన్నింగ్స్‌ను పటిష్ట పరిచారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశారు. దీంతో స్కోరును నత్తాను తలపించింది. ఎల్గర్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, మార్క్రామ్ అడపాదడపా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్క్రామ్ 81 బంతుల్లో 9 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది.
ఆమ్లా జోరు..
మరోవైపు డివిలియర్స్‌తో కలిసి హాషిం ఆమ్లా జోరును కొనసాగించాడు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. డివిలియర్స్ కూడా ఆత్మరక్షణతోనే ఆడాడు. అయితే రెండు ఫోర్లతో 20 పరుగులు చేసిన డివిలియర్స్‌ను ఇషాంత్ క్లీన్‌బౌల్ట్ చేశాడు. మరోవైపు ఆమ్లా తన జోరును కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగుల వర్షం కురిపించాడు. అతనికి కెప్టెన్ డుప్లెసిస్ అండగా నిలిచాడు. అయితే 153 బంతుల్లో 14 ఫోర్లతో 82 పరుగులు చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్న ఆమ్లాను హార్దిక్ రనౌట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 246 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. కాగా, తర్వాత వచ్చిన డికాక్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లి పట్టిన క్యాచ్‌కు డికాక్ వెనుదిరిగాడు. ఆ వెంటనే ఫిలాండర్ (౦) కూడా ఔటయ్యాడు. అతను కూడా పాండ్య అద్భుత ఫీల్డింగ్‌కు రనౌట్ కాక తప్పలేదు. దీంతో 251 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఒక దశలో 199/2తో పటిష్ట స్థితిలో కనిపించిన సౌతాఫ్రికా 70 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఓపెనర్ ధావన్ స్థానంలో లోకేష్ రాహుల్, వి కెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో పార్థివ్ పటేల్, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మలు తుది జట్టులోకి వచ్చారు. అజింక్య రహానెకు ఈ మ్యాచ్‌లోనూ నిరాశ మిగిలిం ది. తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు. రోహిత్ తన స్థానా న్ని నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్టెయిన్ స్థానంలో నిగిడి జట్టులోకి వచ్చాడు.
మార్క్రామ్ శతకం మిస్..
లంచ్ తర్వాత దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 4 ఫో ర్లతో 31 పరుగులు చేసిన ఎల్గర్‌ను అశ్విన్ వెనక్కి పంపాడు. దీంతో 85 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన స్టార్ ఆటగాడు హాషిం ఆమ్లాతో కలిసి మార్క్రామ్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. వీరిని ఔట్ చేసేందుకు కోహ్లి తరచు బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్క్రామ్ 150 బంతుల్లో 15 బౌండరీలతో 94 పరుగులు చేసి వెనుదిరిగాడు. మార్క్రామ్ ఆరు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ వికెట్ కూడా అశ్విన్ ఖాతాలోకే వెళ్లింది.

Comments

comments