Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ప్రేమతో ఉపశమనం

Doctor-sharsha-hospital

జీవితమే ఒక నాటకం.. ప్రతిక్షణం ఓ పాత్రలో జీవించాలి.. అంతిమ ఘడియల్లో పోషించే పాత్ర కొంతమందికి అత్యంత విషాదకరంగా మారుతుంది. మృత్యుకుహరాల్లోకి జారుకుంటారని తెలిసినా బతకాలనే ఆశ చిగురిస్తుంటుంది. ఆదరించే బంధువులు కరువైనా… అద్దె ఇళ్లల్లో చివరి క్షణాల్లో ఉండనీయకున్నా.. నేనున్నాను అంటూ ఆపన్నహస్తం అందిస్తోంది స్పర్శ హాస్పస్ ట్రస్టు. జీవన చివరి క్షణాల్లో అనుభవించే బాధను స్వచ్ఛందంగా దూరం చేసేందుకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది. మానవీయకోణంలో ఈ ట్రస్టును వైద్యురాలు ఫణిశ్రీసాయి నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వందలాది మందికి స్వచ్ఛంద సేవలు అందిస్తున్న ఫణిశ్రీతో అఖిల ముఖాముఖి.

– జీవిత చరమాంకంలో ఉన్న వారికి నిస్వార్థంగా సేవ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
-ఇలాంటి సంస్థలు విదేశాల్లో చాలా ఉన్నాయి. నేను డాక్టర్‌గా విదేశాల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా చూశాను. ఇండియాలో ఇలాంటి సంస్థలు ఇప్పటివరకు లేవు. నేను రోటరీక్లబ్ సభ్యురాలుగా ఉండటంతో కొంతమంది డాక్టర్లకు నా ఆలోచన చెప్పాను. స్వచ్ఛందంగా, ఉచితంగా సేవలు అందించేందుకు డాక్టర్లను సమీకరించాను. ఆ తర్వాత అద్దె ఇంటి కోసం ప్రయత్నించాను. ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకురాలేదు. చివరిదశలో ఉన్న రోగులను ఆదుకునేందుకు కానీ, వారికి ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఎవరికీ మనసు అంగీకరించలేదు. అయినా ప్రయత్నం మానుకోలేదు. చివరకు ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి తన ఇంటిని తక్కువ అద్దెకు ఇచ్చి ప్రోత్సహించారు. 2011లో స్పర్శ హాస్పస్ ట్రస్టును ఏర్పాటు చేసి సేవలు అందించడం ప్రారంభించాను.

* ఎలాంటి వారికి సేవలందిస్తారు?
-డాక్టర్లు వైద్యం నిలిపివేసి ఇక శరీరం వైద్యానికి అంగీకరించదు అంటూ.. రోగులను ఇంటికి పంపిస్తే వారి పరిస్థితి దీనంగా ఉంటుంది. బంధువులు ఆదరించరు. ఇంటి వద్ద దీనంగా చూస్తారు. వైద్యఖర్చులు అనవసరమని భావిస్తారు. అద్దె ఇంట్లో ఉండనీయరు. రోగి చనిపోకముందే నరకం అనుభవించడం బాధవేస్తుంటుంది. ప్రత్యక్ష నరకానికి నకలుగా రోగులు అనుభవించే మానసిక క్షోభ గుండెలను పిండివేస్తుంటుంది. అలాంటి వారిని ఆదుకోవడమే స్పర్శ లక్ష్యం. ఉచితసేవలందించడమే స్పర్శ ధ్యేయం. చివరిదశలో ఉండే పేషెంట్స్‌ను మిగతావారితో పోలిస్తే మానసికస్థితి ఆందోళనగా ఉంటుంది. చనిపోతారని తెలిసి బతకాల్సిన సందర్భంలో రోగి పడే బాధ హృదయాలను కదిలిస్తుంటుంది. వారికి ప్రత్యేకమైన చికిత్స అందివ్వాలి. ఎక్కువగా క్యాన్సర్ రోగులకు ఈ పరిస్థితి ఉంటుంది. అడ్వాన్స్‌డ్ స్టేజిలో క్యాన్సర్ ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి. వారిని సరిగ్గా అర్థం చేసుకుని మానసిక ధైర్యాన్ని కలిగిస్తూ వైద్యం చేయాలి. వారికి చికిత్సే కాదు ప్రేమతో పలకరిస్తే ఉపశమనం కలుగుతుంది.

* ఉచితసేవలు అందిస్తారా..మందుల కోసం చార్జీ వేస్తుంటారా?
-ఇక్కడ సేవలన్నీ ఉచితమే..రోగితో పాటు అటెండెంట్‌కు కూడా భోజనసదుపాయం కల్పిస్తున్నాం. పనిచేసే సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు. వారికి వసతి సదుపాయాలు కలిగిస్తుంటాం. మా డాక్టర్ల బృందం ఖర్చు భరించడంతోపాటు రోటరీ క్లబ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని కొంతవరకు పొందుతున్నాం. పెద్దభవనం లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆసుపత్రి నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది. క్యాన్సర్ రోగులు బాధతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వారి నొప్పులను తగ్గించేందుకు ఖరీదైన మందులు అవసరమవుతుంటాయి. చికిత్స పొందిన ఆసుపత్రి రికార్డులను పరిశీలించి చివరి ఘడియల్లో ఉన్నారని మా వైద్యబృందం నిర్ణయించిన అనంతరమే సేవలందిస్తాం. ఇప్పటి వరకు 800 మందికి చివరి దశలో అందించిన సేవల్లో కొంత మంది బతికారు.

-* సేవాకార్యక్రమాలకు కుటుంబపరమైన సహాయం ఉందా?
నేను డిగ్రీవరకు గోదావరిఖనిలో చదివాను. ఎంబిబిఎస్ కరీంనగర్‌లో చేశాను. మా వారు జగదీష్ పూర్తిగా సహకరిస్తున్నారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ట్రీట్‌మెంట్ పూర్తయిన తర్వాత కూడా వృద్ధులు మళ్ళీ వచ్చేవారు. దీనితో వృద్ధుల వైద్యంపై జిడియాట్రిక్స్ చదివాను. అప్పటి చదువు ఇప్పుడు ఉపయోగపడుతోంది.

-* వృద్ధులకు వైద్యసేవలు ఎలా ఉంటున్నాయి?
-వైద్య శాస్త్ర అభివృద్ధితో వృద్ధుల జీవితకాలం పెరిగింది. విదేశాల్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక అడ్వాన్స్ మెడికల్ కేర్ ఉంది. అలాంటిది మనదేశంలో రావాలి. 60 ఏళ్లు పైబడిన వారికి అనారోగ్య సమస్యలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రధానంగా క్యాన్సర్ బాధ భరించడం కష్టంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్య వస్తుంటుంది. చికిత్స ద్వారా ఆరోగ్యవంతుల్నిగా చేసే వైద్యవిజ్ఞానశాస్త్రం అందుబాటులో ఉంది. జీవితగమనంలో పోరాడి అలిసిపోయిన ఆరోగ్యసమస్యలు మృత్యుకుహరాలకు నెడుతుంటాయి. అలాంటివారికి ధైర్యం చెబితే హాయిగా కన్నుమూసే అవకాశాలు ఉంటాయి.ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు ఏదో విధంగా జీవితంలో చివరి అడుగు వేయాల్సిన వారే, అయితే ముందూవెనక తేడాలు మాత్రం యి..అందుకే అంతిమ ఘడియల్లో ఆనందం కోసం తపించే హృదయాలను ఆనందింపచేయడంలోనే ఆనందం వెతుక్కోవాలి.

                                                                                                                                                                            వి.భూమేశ్వర్

Comments

comments