Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

పట్టుతప్పిన పంట కొనుగోళ్లు

batani

* ప్రతి ఏటా అన్నదాతకు ఇదే తిప్పలు
* కందుల కొనుగోళ్లపై మళ్లీ అదే నిర్లక్షం
* పరిహాసం అవుతున్న మార్కెటింగ్ వ్యవహారం
* బోనస్ తగ్గింపుతో రైతుల ఆందోళన

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంట కొనుగోళు వ్యవహారం క్రమంగా అభాసు పాలవుతుందన్న విమర్శలు ఉన్నాయి. పత్తి, వరి, మొక్క జొన్న, సోయా బిన్, కందులు లాంటి పంటల కొనుగోళ్ల వ్యవహారం ప్రతి ఏటా విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం ఆయా ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరిపిస్తున్నప్పటికి సరైన విధానం పాటించకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియ అభాసు పాలవుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ఓ వైపు గిట్టుబాటు ధర లభించకపోవడం, తూకాల పేరిట మోసం జరగడం, నాణ్యత పేరిట అధికారుల వేధింపులు కొనసాగుతుండడం లాంటి అంశాలన్నీ కొనుగోళ్ల ప్రక్రియకు గుదిబండలా మారుతున్నాయి. ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆయా సంస్థల ద్వారా కొనుగోళ్ల ప్రక్రియకు సైతం చర్యలు తీసుకుంటున్నప్పటికి ఆచరణలో మాత్రం కొనుగోళ్ల ప్రక్రియకు రకారకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న పంట కొనుగోళ్ల విధానం అసలైన రైతులకు కాకుండా వ్యాపారులకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందన్న వాదనలు ఉన్నాయి. ఈ పంట కొనుగోళ్ల చేసే వివిధ సంస్థలలోని కొంత మంది అధికారులు స్థానిక వ్యాపారులతో మిలాఖత్ అవుతూ నాణ్యత పేరిట రైతులకు ఇబ్బందులు కల్పిస్తున్నారంటున్నారు. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. ప్రతి ఏటా పంట కొనుగోళ్ల సమయంలో రైతుల ఆందోళనలు పెరగడం సాధారణమైపోతోంది. పత్తి పంట విషయంలోనూ, మొక్కజొన్న, సోయాపంటల విషయాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కందుల కొనుగోళు వ్యవహారం తాజాగా తెరపైకి వస్తుంది. పంట చేతికొచ్చే సమయం ఆసన్నమైన్నప్పటికీ ఇప్పటి వరకు కందుల కొనుగోలు కేంద్రాలను అంతటా ఏర్పాటు చేయలేదు. రైతులు తమ పంటనంతా నిల్వ ఉంచుకొనేందుకు చోటు లేదంటున్నారు. దీంతో సర్కారు కొనుగోళు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిని ప్రతి ఏటా దాపురిస్తుందని అంటున్నారు.

గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నాఫెడ్, ఎఫ్‌సిఐ ద్వారా ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు బోనస్‌గా 420 రూపాయలు చెల్లించి 5050 రూపాయల మద్ధతు ధర ప్రకటించింది. దళారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసిన కారణంగా పంట పండించిన రైతులకు మద్దతు ధర దక్కలేదు. సుమారు ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 144 కోట్ల వ్యాపారం జరిగినట్లు చెబుతున్నాయి. గతేడాది పెద్ద ఎత్తున కంది సాగును ప్రోత్సహించడంతో పంట పండిన రైతులకు మద్దతు ధర దక్కకపోవడంతో ఈ సారి ఆ పంట పండించిన ఆధిక శాతం రైతులు మొగ్గు చూపలేదు., సాగు విస్తీర్ణయం గణనీయంగా తగ్గింది. గతేడాది ఆదిలాబాద్ 24వేల హెక్టార్లు పంటలు సాగు చేయగా ఈ ఏడాది 19వేల హెక్టార్లకు పరిమితం అయింది. నిర్మల్‌లో గతేడాది 8వేల600 హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది 5వేల473 హెక్టార్లకు పరిమితం అయింది. ఆసిఫాబాద్, మంచిర్యాలలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. పత్తి, వరి, మొక్కజొన్నతో పాటుగా కందిని సైతం ఉమ్మడి జిల్లా రైతులు పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కందికి మద్ధతు ధరను 5450 రూపాయలుగా ప్రకటించింది. అయితే దీంట్లో ప్రభుత్వం బోనస్‌గా 220 రూపాయలకే పరిమితం చేసింది. గతేడాది 420 బోనస్‌ను ప్రకటించగా ఈసారి 200 రూపాయలు తగ్గించడం పట్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి అంచనాల ప్రకారం లక్ష్యాన్ని నిర్ణయించిన అధికారులు కొనుగోళుకు కార్యచరణ చేపట్టకపోవడం ఆరోపణలకు తావిస్తోంది.
ఇప్పటికే కొన్ని చోట్ల కంది పంట అమ్మకాలకు సిద్దమైనట్లు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో దళారులు కొనుగోళు చేస్తున్న వారిని నిరోధించడంలో మార్కెటింగ్ అధికారులు విఫలమవుతున్న కారణంగా రైతులు ఇక గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకే కంది పంటను అంత అమ్ముకునే పరిస్థితిని సృష్టిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కందులకు గిట్టుబాటు ధర ప్రకటించి కొనుగోళు బాధ్యతలను ప్రభుత్వ రంగ సంస్థలకు సైతం అప్పజెప్పింది. అయితే ఆ సంస్థలు ఈ దిశగా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పంటల కొనుగోళు ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాల్సిన మార్కెట్ యార్డులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు. రైతులకు నష్టం జరగకుండా తూకం, నాణ్యత విషయాల్లో అన్యాయం జరగకుండా చూడాల్సిన మార్కెట్ యార్డులు ఆశించిన మేరకు స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మార్కెట్ యార్డుల వ్యవహార శైలిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది అధికారులు, సిబ్బంది ప్రైవేట్ వ్యాపారులకు లబ్దిచేకూర్చే విధంగా ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైన అధికారులు కంది కొనుగోళ్లపై కార్యాచరణ ప్రకటించి రైతులకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.

 

Comments

comments