Search
Sunday 21 January 2018
  • :
  • :

50:60

50

కృష్ణ నీటిని తెలంగాణ 50, ఎపి 60 టిఎంసిలు వాడుకోవాలని బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం 

హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో ఉన్న నీటిలో తెలంగాణ 50 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్ 60 టిఎంసిలు వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్ణయించింది. జలసౌధలో బుధవారం సమావేశమైన త్రిసభ్య కమిటీ ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు అంగీకారానికి వచ్చారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కలిపి 130 టిఎంసిల నీటి లభ్యత ఉం ది. అందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా 73.42 టి ఎంసిలు, తెలంగాణ వాటాగా 60.33 టిఎంసిలు వస్తుంది. ఈ నీటినే వచ్చే ఆగస్టు వరకు జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాల ని బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం సూచించారు. ఇరు రాష్ట్రాలకు రావాల్సిన కోటాలోంచి చేరో పది టిఎంసిలు తగ్గించుకొని, మిగతా నీటిని అవసరాలకు తగ్గట్లుగా వాడుకోవాలని కోరారు. దీంతో తెలంగాణకు 50 టిఎంసిలు, ఆంధ్రప్రదేశ్‌కు 60 టిఎంసిల వినియోగానికి బోర్డు అనుమతించింది. అయితే ఇప్పటికే వినియోగించిన నీటిలో ఆంధ్రప్రదేశ్ అధికంగా వాడుకున్న విషయం సమావేశంలో ప్రస్తావనకు రాలేదు. శ్రీశైలంలో నీటి విడుదలపై చెన్నైకి నీటి విడుదల తర్వాత చెబుతామని చెప్పిన ఎపి ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, సాగర్‌లో 520 అడుగుల వరకు నీటిని వినియోగించుకుందామని ప్రతిపాదించారు.
దీంతో తెలంగాణ ఇఎన్‌సి మురళీధర్ అంగీకరించారు. శ్రీశైలంలో ఎంత వరకు వినియోగించుకోవాలనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రాజెక్టుల నిర్వహణ బోర్డుకే అప్పగిద్దామని ఎపి ఇఎన్‌సి వెంకటేశ్వరరావు ప్రతిపాదించారు. టెలీమెట్రీ పాయింట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని నిర్ణయించారు. పోతిరెడ్డిపాడు నీటిని తక్కువ చూపుతున్న వైనంపై, నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఆంధ్రా కోటా కింద తక్కువగా వస్తున్న విషయంపై సమావేశంలో ప్రస్తావనకు రాగా, దానిపై కమిటీలు వేశామని, వాటి నివేదికలు వచ్చాక చర్చిద్దామని సభ్య కార్యదర్శి పరమేషం సూచించారు. అయితే ఆంధ్రప్రదేశ్ తరపున 38 టిఎంసిలు, తెలంగాణ తరపున 17 టిఎంసిల నీటి విడుదల కోరుతూ ఇప్పటికే ఇండెంట్ ఇచ్చారు.

Comments

comments