Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పౌరుషానికి ప్రతీక

lfపల్నాటి పౌరుషాన్ని రెచ్చగొట్టి రక్తపుటేరులు ప్రవహింప చేసి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన కోడి పందాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. యుద్ధ విద్యల్లో పందెం కోళ్ళ ప్రస్థావన ఉంది. యుద్ధానికి వెళ్లే ముందు కోడిపం దాలను చూసి అలాగే శత్రువును మట్టుపెట్టేం దుకు సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే
సంప్రదాయం ఏళ్ల సంవత్సరాల క్రితమే అనేక పాశ్చాత్య దేశాల్లో ఉంది. గ్రీకు దేశంలో థెమిస్టోలెస్ రాజు సైనికులకు పందెం కోళ్ళ విన్యాసాలను ప్రత్యేకంగా నేర్పించి యుద్ధానికి సిద్ధం చేసేవారు. భారత దేశంతో పాటు అనేక క్రైస్తవ దేశాల్లో శతాబ్దాల పూర్వమే కోడి పందాలు ఉండేవి.

నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ ఆడే కోడిపందాలు ఇప్పటికీ కొన్ని దేశాల్లో అధికార క్రీడగానే కొనసాగుతుంది. మనుషులు తమలోని పోటీ తత్వాన్ని, క్రూరత్వాన్ని నోరులేని ప్రాణుల్లో ప్రవేశపెట్టి అవి ఒకదానికొకటి చంపుకుంటుంటే చూసి ఆనందించే రాక్షసక్రీడ కోడిపందాలు. మొదట సాధారణంగా కాలక్షేపానికి ప్రారంభమైన ఈ క్రీడ చివరికి వాటిని సాయుధం చేసేంత వరకు వెళ్ళింది. కోళ్ళకాళ్ళకు కత్తులుకట్టి పోటీలో నిలబెట్టి ఒకదానిని ఒకటి దారుణంగా హింసించుకుంటుంటే చూసి ఆనందించడం పరిపాటైంది. కోడిపందాల్లో ప్రపంచంలోని అనేకదేశాల్లో హింసాత్మక సంఘటనలు నెలకొన్నాయి. క్రీస్తుపూర్వం నుంచి పల్నాటి యుద్ధం వరకు అనేక రాజ్యాలు నేలకు ఒరిగాయి.
ప్రాచీన వ్యవసాయ సమాజంలో తీరుబడి వేళల్లో ఉల్లాసంగా కనిపెట్టిన ఈ క్రీడ కాలక్రమేణ రాక్షసక్రీడగా రూపాంతరం చెందింది. అయితే భారతదేశంలో పల్నాటి యుద్ధంతోనే ప్రారంభం అయిన ఈ క్రీడ వేలాది సంవత్సరాల క్రితం ప్రపంచంలోని అనేకదేశాల్లో ఉన్నట్లు పురావస్తు ఆధారాలు లభిస్తున్నాయి. క్రీస్తు పూర్వం 524 నుంచి 460 వరకు గ్రీకులో నిర్వహించిన కోడిపందాలతో రాజ్యాలు కోల్పోగా రక్తం ఏరులై ప్రవహించింది. గ్రీకు దేశంలో కోడిపందాల కోసం అలెగ్జాండ్రియ, డిలోస్, తనాగ్రా దేశాల్లో కోడిపుంజులను పెంచేవారు.కోడిపందాల ఫలితంగానే రోము లు, గ్రీకులకు బేధాభిప్రాయాలు రావడంతో క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో ఈపందాలను నిషేధించాలని అప్పటి రాచరిక ప్రభుత్వాలు ప్రయత్నించాయని ఆనాటి రచయిత కాలంఎల్లా పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం సుమారు 5వందల సంవత్సరాల పూర్వం గ్రీకులో ప్రారంభమైన ఈక్రీడ కాలక్రమేణ అనేక మార్పులు చెందుతూ పలుదేశాలకు విస్తరించింది. రోమ్ నుంచి దక్షిణ ప్రాంతాలకు విస్తరించి మెల్లమెల్లగా వ్యాపించి ఇటలీ, జర్మనీ,స్పెయిన్,ఇంగ్లాండ్ దేశాల్లో ఈ పందెం నీరాజనాలు అందుకుంది. హింసాత్మకమైన సంఘటనలకు తెరతీసింది. రాచఠీవి, దర్పం కోసం 16వ శతాబ్దంలో ఇంగ్లాండులో ఈ పోటీని నిర్వహించేవారని అప్పటి ఇంగ్లీషు రచయిత మార్కామ్ ప్లెజర్స్ ఆఫ్ ప్రిన్సెస్ తన రచనల్లో తెలియజేశారు. అలాగే కోడి పందాలకు ప్రత్యేకమైన మైదానాలు ఉండేవి. ఈ వేదికల చుట్టూ ఇనుప చువ్వల కంచెలు కట్టివాటిని కూడా రక్షించేందుకు సైనికులు ఉండేవారని ఆయన రచనల్లో తెలుస్తుంది. ప్రాచీన సమాజంలో ఈ ఆటకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక బృందంలో తర్ఫీదు పొందిన ఎనిమిది మంది ఉండేవారు. నెగ్గిన నాలుగు కోళ్ళతో మరో పోటి, ఆ తర్వాత నెగ్గిన రెండు కోళ్ళతో చివరిపోటీ ఉండేది. చివర్లో రాజ్యాలకు రాజ్యాలు,సంపద,ఇతర అంశాలను పోటీల్లో పెట్టేవారు. ఈనేపథ్యంలో అనేక యుద్ధాలకు కారణమైన ఈకోడి పందాలను క్రీ.శ. 1836 వరకు ప్రపంచంలో ఎక్కడా నిషేధించలేదు. నిషేధించాలనే ప్రయత్నం జరగలేదు. తొలిసారిగా 1836 లో గ్రీకు,రోమ్ తదితర దేశాలు కోడిపందాలను నిషేధించాలని సమావేశాలను నిర్వహించారు. అయితే బ్రిటన్ 1849 లో కోడిపందాలను నిషేధించి ప్రపంచానికి ఆదర్శం అయింది. ఆ తర్వాత కెనడా,అమెరికా, రాష్ట్రాలు ఈ పందాలను నిషేధించాయి. జంతువులను ,పక్షులను హింసించే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని క్రీస్తుపూర్వం అశోకచక్రవర్తి ప్రకటించినట్లు ఆనాటి శిలాశాసనాల్లో ఉంది. ఈ శాసనాన్ని పరిశీలిస్తే ప్రపంచంలో పశుపక్ష్యాదులపై తొలిసారిగా ప్రేమను ప్రకటించి వాటి సంరక్షణ బాధ్యత నిర్వహించింది భారతదేశంలో అశోక చక్రవర్తి. అయినా వందలాది సంవత్సరాల అనంతరం 1181 నుంచి 1182 మధ్యలో పల్నటి యుద్ధంలో కోడిపందాల ద్వారా రుధిర ప్రవాహం జరిగింది. రాజ్యాలు నేలకొరిగాయి.
ఇదిలా ఉండగా కోడిపందాలు ఆడేవారి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అపాయకరమైన విధానాలు ఉంటాయి. ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసున్న కోడిపుంజులతో పందాలు నిర్వహిస్తారు. పందాలలో పాల్గొనేముందు కోడి పుంజులకు లోహంతో లేదా ఎముకతో చేసిన కత్తులు కాళ్ళకు కడతారు. ఆ కత్తులు నాలుగు సెంటీమీటర్ల నుంచి ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కోడి చనిపోయే వరకు పోటీని నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం తీవ్రంగా దెబ్బలు తగిలిన కోడిని తీసుకుని ఓటమి అంగీకరించే సంప్రదాయం వచ్చింది. అలాగే నిర్ణీత సమయంలో కూడా పందాలను నిర్వహిస్తుంటారు. ఈనాటికి ఆఫ్రికా, లాటిన్ అమెరికా,ఏషియన్ లో కొన్ని ప్రాంతాల్లో కోడిపందాలు సాధారణ క్రీడలుగానే పరిగణిస్తారు. ప్రభుత్వ అనుమతితో క్రీడలు కొనసాగుతున్నాయి. అమెరికాలో అనేక ఆందోళనల అనంతరం కోడిపందాలపై నిషేధం విధించారు. ఆనాటి అమెరికా అధ్యక్షులు జార్జివాషింగ్టన్, అబ్రహం లింకన్‌లకు కోడిపందాలంటే ఎంతో ఇష్టమని చరిత్రకారులు చెపుతుంటారు. ఎన్నో సంప్రదాయాలకు,ఆచారవ్యవహారాలకు,జ్ఞానానికి,విజ్ఞానానికి నిలయమైన భారతదేశంలో అశోక చక్రవర్తి మూగజీవుల రక్షణ కోసం క్రీస్తుపూర్వమే చర్యలు చేపట్టి ప్రపంచదేశాలకు ఆదర్శమైనా కాలగమనంలో కోడిపందాలు పల్నాటిలో రక్తం ప్రవహించేసింది. అయితే పందాల్లో ఎన్నిరకాల మార్పులు వచ్చినప్పటికీ ఒకకోడిని మరోకోడి చంపుకుంటే చూసి ఆనందించే ఈ క్రీడ భారతదేశంలో నిషేధం ఉన్నప్పటికీ సంక్రాంత్రి సందర్భంగా ఆడుతుండటం గమనార్హం. అయితే తెలంగాణలో కోడిపందాలు ఎక్కడా కనిపించవు. ప్రపంచంలోని అనేక దేశాల్లో యుద్ధసమయాల్లో కోడిపందాలను చూపించడం,కోళ్ళ మాదిరిగా శత్రువులతో పోరాడటం ఉన్నకాలంలోనే కాకతీయ రాజులు ఈ విధానాలను అవలంబించలేదు. యుద్ధానికి ముందు సైనికులతో పేరిణి నృత్యం చేయించి శౌర్యాన్ని నింపి ఆదర్శమయ్యారు. కానీ కోస్తా ప్రాంతాల్లో కోడిపందాలు నేటికి కొనసాగుతున్నాయి. పల్నాటి రక్తం సాక్షిగా కోళ్ళు కత్తుల కాళ్ళతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. కుక్కుట శాస్త్రంలో కోడిపుంజుల పెంపకంపై ఉన్న విధానాలను పాటిస్తూ కొన్నివందల కుటుంబాలు పందెం కోళ్ళ పెంపకంలో నిమగ్నమయ్యాయి. దాయాది దేశం పాకిస్తాన్ లో పందెం కోళ్ళను పెంచి డెల్టా ప్రాంతానికి దిగుమతి చేస్తుంది. హింస ప్రేరణకు నిదర్శనమైన కోడిపందాలను నిషేధించడంతో పాటు పాలకవర్గాలు అమలు కోసం ప్రయత్నించనంత కాలం కోడిపందాలు జూదంగా మారి ప్రజల ఆలోచనలను మారుస్తూనే ఉంటాయి.

Comments

comments