Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఆ నలుగురి ధర్మయుద్ధం

cort-image

నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా విలేకరుల గోష్టిని ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేయడాన్ని న్యాయ వ్యవస్థకు చెందిన చాలా మంది ప్రశంసించారు. అది చరిత్రాత్మకమని అభివర్ణించారు. అయితే కొందరు ఆ న్యాయమూర్తుల ఫిర్యాదుల్లో స్పష్టత లేదని పెదిమ విరిచారు. న్యాయ వ్యవస్థలోని లోటుపాట్లను తెరమీదకు తేవడంపట్ల చాలా మంది ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. జస్టిసెస్ జె. చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బి లోకూర్, కురియన్ జోసెఫ్ 12వ తేదీ నాడు విలేకరుల గోష్టిలో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై నేరుగా ఆరోపణలు చేశారు. న్యాయాన్ని అందించడంలో, కేసులను కేటాయించడంలో ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తున్నారన్నది వీరి ప్రధాన ఆరోపణ.
సిబిఐ జడ్జి బి.హెచ్ లోయా మృతి కేసును జూనియర్ జడ్జీలతో కూడిన బెంచ్‌కు అప్పగించడం ఇందుకు తాజా ఉదాహరణని వారు పేర్కొన్నారు. అసలు ఈ కేసుపైనే న్యాయవ్యవస్థమీద నిప్పులు చెరగడం చోటు చేసుకొంది. ఈ అంశం తుదకు న్యాయ వ్యవస్థ పరిధిలోనే పరిష్కారం కావల్సి ఉండగా ఆ న్యాయమూర్తులు అస్పష్ట ఆరోపణలను చేయడం సబబు కాదని కొందరు జడ్జీలు, న్యాయ వాదులు వ్యాఖ్యానించారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు సభ్యుల కొలీజియంలో జెస్టిసెస్ చలమేశ్వర్, గొగోయ్, లోకూర్, జోసెఫ్ ఉన్నారు. వారు జస్టిస్ మిశ్రాకు రాసిన ఒక లేఖను కూడా బయటపెట్టారు. అందులో వారు తమ ఉద్దేశాలను వెల్లడించడాన్ని చాలా మంది సీనియర్ న్యాయవాదులు ప్రశంసించారు.

జస్టిస్ లోయా మృతి కేసు కీలకం
న్యాయమూర్తి లోయా మరణంపై రేకెత్తిన అనుమానాల నివారణకు స్వతంత్ర దర్యాప్తు జరపాలని 12వ తేదీన కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. 2004 నాటి సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో ప్రస్తుత బిజెపి జాతీయ అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా తో సహా అనేక మంది పోలీసు అధికార్లు నిందితులుగా ఉన్నారు. న్యాయ వ్యవస్థలో లోటుపాట్లు నలుగురు న్యాయమూర్తులు విలేకరుల గోష్ఠి పెట్టేదాకా రావడాన్ని దురదృష్టకరమైనదిగా సీనియర్ అడ్వకేట్ కామినీ జైస్వాల్ పేర్కొన్నారు. ఇది న్యాయ వ్యవస్థకు దుర్దినమని అన్నారు.
‘ఇంతకాలం జడ్జీలను ఆయా ధర్మాసనాలకు వర్గీకరణ ప్రకారం నియమించడం ఆనవాయితీగా ఉంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తలకిందులయింది. ముఖ్యమైన అంశాలకు సంబంధించిన అన్ని కేసులు ఒకే కోర్టుకు కేటాయించబడుతున్నాయి. ఇందులో సీనియర్ జడ్జీలను నిర్లక్షం చేయడం జరుగుతోంది. ప్రతిరోజూ సీనియర్ జడ్జీలను అవమానించడం జరుగుతోంది. జస్టిస్ చలమేశ్వర్ తీవ్రంగా ఇటువంటి నిర్లక్షానికి ఒక కేసులో గురయ్యారు. ఆయన ఐదుగురు సీనియర్ మోస్ట్ జడ్జీలో కూడిన రాజ్యాంగ బెంచ్ విచారించాలని అభిప్రాయపడిన కేసును తమకు తోచిన బెంచ్‌కి అప్పగించి డిస్మిస్ చేయడం జరిగింది’ అని జైస్వాల్ ఉదహరించారు.
దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం కేసుల అప్పగింత (రోస్టర్ అమలు ) జరుగుతోందని ఆ నలుగురు న్యాయమూర్తులు సిజెఐ జస్టిస్ మిశ్రాకు రాసిన లేఖలో వెల్లడించినట్లు పేర్కొన్నారు. ‘ఖాలికోపుల్ ఆత్మహత్య కేసును ఒక జూనియర్ జడ్జి కోర్టుకు అప్పగించడం జరిగింది. అది చాలా తీవ్రమైన కేసు కావడంతో అలా నీరు కార్పించారు. సహారా బిర్లా డైరీ కేసును కూడా సీనియర్ జడ్జికి అప్పగించ లేదు. ఆ డైరీ లో అనేక మంది కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న అవినీతి ఉదంతాల వివరణ ఉంది’ అని కామినీ జైస్వాల్ ఉదహరించారు. కొందరు జడ్జీలు న్యాయ వ్యవస్థ కోసం ఉండగా, మరి కొందరు తమ స్వార్థం కోసమే ఉన్నారు’ అని జైస్వాల్ వివరించారు. ‘ఆ వ్యవస్థ ఒత్తిళ్ల కింద పతనం అవడం ప్రస్తుతం జరుగుతోంది. ఒక ఏడాది కాలం నుంచి ఇలాగే సాగుతోంది. తన ప్రయోజనాలకు అంకితం అయి పనిచేసే న్యాయ వ్యవస్థ ప్రభుత్వానికి కావాలి. ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రజలకు బహిర్గతమయ్యాయి’ అని ఆమె జడ్జీల విలేకరుల గోష్టిపై వ్యాఖ్యానించారు.

ఎంఓపి ఖరారు పట్టని సర్కార్
కేసులను వివిధ కోర్టులకు, బెంచ్‌లకు కేటాయించడంలో అనుసరించే ఎంఒపి (మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్) ని ఐదుగురు న్యాయమూర్తుల కొలీజియం 2017 మార్చిలో ఖరారు చేయగా కేంద్రం ఇంత వరకు ప్రతిస్పందించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎంఒపి ఖరారులో ప్రమేయం కల్పించుకొని ఉంటే బాగుండేదన్నారు. జస్టిస్ గొగోయ్ వచ్చే అక్టోబర్‌లో ప్రధాన న్యాయమూర్తి కానున్న పరిణామాన్ని ఆమె స్వాగతించారు. అయితే న్యాయ వ్యవస్థ దిగజారుడు ప్రమాణాలు ఘోరంగా ఉండడంతో కొన్ని నెలలు ఆగలేక తక్కిన నలుగురు జడ్జీలు విలేకరుల గోష్టి ద్వారా ప్రజల ముందుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని జస్టిస్ లోయ హత్య కేసు పతాక స్థాయికి చేర్చింది. ఎంఒపి ఆమోదం ప్రక్రియ పూర్తి కాకపోవడం ఆయా శాఖల ఇన్‌చార్జీలుగా ఉన్న న్యాయమూర్తుల తప్పిదమని సీనియర్ అడ్వొకేట్ అమన్ లేఖి అన్నారు. జడ్జీల మధ్య ఒకరి ముఖంలోకి ఒకరు సూటిగా చూసుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు.

జడ్జీలకు తప్పనిసరి అయింది: ప్రశాంత్ భూషణ్
పరిస్థితి చేయిదాటిపోయే విధంగా పరిణమించడం వల్లే ఆ న్యాయమూర్తులు ప్రజల ముందకు వెళ్లారని సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఇష్టానుసారం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా జస్టిస్ లోయా మృతిపై ధైర్య సాహసాలు గల దర్యాప్తు అధికారిని నియమించి విచారణ జరపాలని ఆయన కోరారు. 2017లో ‘మెడికల్ కుంభకోణం’ కేసులో సుప్రీంకోర్టు వ్యవహరిస్తున్న తీరుపై జస్టిస్ మిశ్రాకు భూషణ్ ఫిర్యాదు చేశారు. అటువంటిదే మరో కేసు వేరే బెంచ్‌కు ఇవ్వడం జరిగింది. తాజాగా నలుగురు జడ్జీల నిరసన మన న్యాయ వ్యవస్థపై నీలినీడలు ప్రసరింపచేసినందువల్ల తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరమని ఆయన అన్నారు.సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కెఎస్ రామకృష్ణన్ వ్యాఖ్యానిస్తూ రోస్టర్ అధికారాలు ప్రధాన న్యాయమూర్తి వద్దనే ఉండాలని లేనిపక్షంలో అనూహ్య పర్యవసానాలు ఏర్పడతాయని హెచ్చరించారు. జస్టిస్ మిశ్రాకు ఆ నలుగురు జడ్జీలు రాసిన లేఖలో ఏ ఫిర్యాదూ స్పష్టంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ నలుగురు న్యాయమూర్తులు పూర్తి వివరాలతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. సుప్రీం న్యాయమూర్తుల విలేకరుల గోష్టితో ఎలాగూ నష్టం జరిగిపోయింది కనుక అసలు ఏమి జరిగిందో సవివరంగా ఇప్పుడైనా వివరించాలని కోరారు. ఇటీవల దారి తప్పిన జ్యుడీసి యరీని మళ్లీ దారిలో పెట్టడానికి మొత్తం మీద నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రజల ఎదుటకు వచ్చి ధర్మ పీఠం దద్దరిల్లేలా చేశారు.

* అనూ భుయన్, గౌరవ్ వివేక్

Comments

comments