Search
Saturday 21 April 2018
  • :
  • :

నష్ట పరిహారం చెల్లింపులో రైతులకు న్యాయం చేయాలి

collector

మన తెలంగాణ/ ఆదిలాబాద్   భూములకు పరిహారం చెల్లించే విషయంలో ఎలాంటి ఒత్తిడులకు లోను కావద్దని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జైనథ్ మండలంలోని గ్రామాలలో భూములు కోల్పోతున్న రైతులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. డి-14 కాలువ పనులకు జైనథ్ మండలంలోని గిమ్మ, రాంపూర్, హత్తిఘాట్, గిమ్మ(కె) గ్రామాలలోని 55 ఎకరాల భూమి సేకరించడం జరిగిందని, ఆయా రైతులకు మూడు క్యాటగిరీలలో నష్ట పరిహారం చెల్లించడానికి రైతులు అంగీకారం తెలిపారన్నారు. రైతుల సంక్షేమం కోసం భూ ములు సేకరించడం జరిగిందని, ఇప్పటి వరకు 8 వందల ఎకరాలు రైతుల అంగీకారంతోనే సేకరించామని తెలిపారు. నష్ట పరిహారం చెల్లింపులో ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తనకు నేరుగా తెలియచేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వుల మేరకు పరిహారం చెల్లించడం జరుగుతుందని, త్వరలోనే ఈ పరిహారం డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని వెల్లడించారు. కాలువ నిర్మాణ పనులకు పోను మిగిలిన తక్కువ విస్తీర్ణం భూమిలో పంటలను సాగు చేయడం కష్టమని ఆ భూమిని కూడా తీసుకోవాలని పలువురు రైతులు కలెక్టర్‌ను కోరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు కొంత సమయం అవసరమని కలెక్టర్ అన్నారు. కెనాల్‌లపై అవసరమైన చోట్ల వంతెనలను నిర్మించాలని కోరగా, సాంకేతికంగా పరిశీలించి మ్యాపులను అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ కృష్ణారెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, జైనథ్ తహసీల్దార్ ప్రభాకర్, రైతు నాయకులు గోవర్దన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Comments

comments