Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

విపరిణామం

sampadakeyam

సుప్రీం కోర్టు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు నలుగురు పత్రికా గోష్టి జరిపి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అడ్మినిస్ట్రేటివ్ పనితీరుపై ధ్వజమెత్తటం అత్యున్నత న్యాయ వ్యవస్థ చరిత్రలో అసాధారణం, అపూర్వం. జస్టిస్‌లు జె.చలమేశ్వర్, రంజన్ గొగోయ్ (తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావలసిన సీనియర్), మదన్ బి.లోకూర్, కురియన్ జోసెఫ్ తమ అసంతృప్తిని, ఆవేదనను వెల్లడించటానికి ఎంచుకున్న మార్గంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, గత్యంతరరాహిత్య స్థితిలోనే వారు ప్రతికల ద్వారా ప్రజల ముందుకు వచ్చారన్న భావన బలంగా ఉంది. ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసిన రీతిలో బెంచీలు ఏర్పాటు చేయటం, అత్యంత సున్నితమైన, జాతీయ ప్రాధాన్యత కేసులను వాటికి కేటాయించటంపట్ల తమ మనస్తాపాన్ని వ్యక్తం చేసేందుకు వారు ఎంచుకున్న మార్గాన్ని ప్రశ్నించటం కన్నా, లేవనెత్తిన అంశాలకు పరిష్కారాలు కనుగొనటం జస్టిస్ మిశ్రా ముందున్న కర్తవ్యం. ఎందుకంటే మన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది. దాని సమస్యలను అంతర్గత చర్చల ద్వారా అదే పరిష్కరించుకోవాలి. కార్యనిర్వాహక వ్యవస్థకు చెందిన కొందరి జోక్యాన్ని అనుమతించటమే వ్యవస్థ గాడితప్పటానికి కారణమన్న భావన నలుగురు న్యాయమూర్తులు ఫిర్యాదులో పూసలో దారంలో ఉంది. ప్రధాన న్యాయమూర్తి పాలనా రీతిని ప్రశ్నిస్తూ వారు రెండు నెలల క్రితమే లేఖ రాశారు. స్పందన లేదు. శుక్రవారం ఉదయం స్వయంగా కలిసి కొన్ని అంశాలు లేవనెత్తారు, సానుకూల స్పందన రాలేదు. అప్రజాస్వామిక, అవాంఛనీయ పరిణామాల నుంచి వ్యవస్థను కాపాడే సదుద్దేశంతో పత్రికాగోష్టి ద్వారా సమస్యలను దేశ ప్రజల ముందుంచారు. ప్రజాస్వామ్యం ప్రమాదం ఎదుర్కొంటున్నట్లు హెచ్చరిక చేశారు.
శుక్రవారం పరిణామాలు ఏమి సూచిస్తున్నాయి? సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలతో సమమతమవుతోంది. బెంచిలకు కేటాయించే కేసులు ఈ విభేదాలకు మూలం. ప్రధాన న్యాయమూర్తి ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ అయినప్పటికీ కీలకమైన కేసుల కేటాయింపులో సీనియర్‌లను కాదని జూనియర్లతో కూడిన బెంచిలను ఎంచుకుంటున్నారు. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో బెంచీల ఎంపికను కార్యనిర్వాహక వర్గం (ప్రభుత్వం) ప్రభావితం చేస్తుండవచ్చు. జడ్జీల నియామకం సిఫారసులను ప్రభుత్వం దీర్ఘకాలం తొక్కి పట్టినపుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ బహిరంగంగా కన్నీళ్ల పర్యంతం కావటం గుర్తు చేసుకోదగింది.
జడ్జీలను జడ్జీలతో కూడిన కొలీజియం నియమించే విధానం స్థానంలో ప్రభుత్వం తెచ్చిన జాతీయ జుడీషియల్ కమిషన్ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు కొట్టి వేసిన నాటి నుంచి ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ నడుస్తోంది. జడ్జీల ఎంపిక ప్రక్రియలో న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం, ప్రభుత్వం నియమించే ఇద్దరు ప్రముఖులు ఉంటారని కమిషన్ చట్టం నిర్దేశించింది. ఇది న్యాయ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం జోక్యంగా సుప్రీంకోర్టు భావించింది. అదే సమయంలో కొలిజియం వ్యవస్థ మెరుగుదల ఆవశ్యకతను వక్కాణించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్‌పై అనేక నెలలపాటు ఇరు పక్షాల తర్జనభర్జనల అనంతరం సుప్రీంకోర్టు తమ అభిప్రాయాలతో ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం అనేక మాసాలుగా మౌనంగా ఉన్నందున దాన్ని ఆమోదించినట్లే భావించబడింది. కాగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అది ఇంకా ఫైనల్ కాలేదనే వైఖరి తీసుకున్నారు. అలాగే బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నిందితుడిగా ఉన్న సొహ్రాబుద్దీన్ కేసును విచారిస్తున్న సిబిఐ కోర్టు జడ్జి బిహెచ్ లోయా మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నతస్థాయి దర్యాప్తు కోరుతూ కుటుంబ సభ్యులు, మరి కొందరు దాఖలు చేసిన పిటిషిన్‌ల విచారణను ప్రధాన న్యాయమూర్తి జూనియర్‌లతో కూడిన బెంచికి కేటాయించటంపై అసమ్మతి న్యాయమూర్తుల అభ్యంతరం వారి ఓర్మికి చివరి పరీక్ష అయింది.
న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఈ సంక్షోభాన్ని వారే పరిష్కరించుకోవాలని ప్రభుత్వం సూత్రప్రాయ వ్యక్తీకరణతో తాము ఈ విషయంలో పరిశుద్ధంగా ఉన్నట్లు ప్రకటించుకుంది. కాగా జాతీయ మీడియాలో కొన్ని ఛానళ్లు రాజకీయ రంగు పులిమేందుకు గొంతెత్తి అరుస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నుంచి రాజనీతిజ్ఞతను డిమాండ్ చేస్తున్నది. తానను తాను చక్కదిద్దుకోగల వివేకం, విజ్ఞత అత్యున్నత న్యాయస్థానానికి ఉందని దేశ ప్రజల విశ్వాసం. రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రయత్నాలు ఎవరు చేసినా అవి బెడిసికొడతాయి. అదే మన ప్రజాస్వామ్య బలం.

Comments

comments