Search
Monday 23 April 2018
  • :
  • :

ఢిల్లీ కాలుష్యం నుండి గుణపాఠం నేర్వలేమా?

dilhi

ప్రపంచంలోని ప్రభుత్వాలకైనా, ప్రజలకైనా ఏ విషయంలోనైనా సరే అనుభవంలోకి వచ్చేంతవరకు దానిపై దృష్టి సారించకపోవడం పరిపాటిగా మారిం ది. ఈ పరిస్థితి మన దేశంలో అయితే మరీ ఎక్కువగా ఉంది. న్యూఢిల్లీలోని వాతావరణంలో వచ్చిన భారీ మార్పుల వల్ల ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రోజురోజుకు గాలిలోని ఆక్సిజన్ నాణ్యత బాగా క్షీణిస్తూ కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు రికార్డు స్థాయిలలో పెరుగుతున్నాయని కేంద్ర కాలుష్య నివారణ మండలి హెచ్చరిస్తున్నది. దీనికి బాధ్యత వీరంటే కాదు వారు అంటు నిందలు వేసుకుంటూ కాలాన్ని వృధా చేయకుండా తప్పులో అందరు భాగస్తులే….అనే నిశ్శబ్ద నిజాన్ని మనఃస్ఫూర్తిగా ఒప్పుకొని తీరాలి. పర్యావరణ సమతుల్యతల కోసం, హరితవన పరిరక్షణ కోసం శాశ్వత చర్యలను ఇప్పటికైనా రూపొందించవలసిన ఆవశ్యకత మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.
కేంద్రప్రభుత్వం ‘గంగా’నది ప్రక్షాళనకు నడుం కట్టిన విషయం వాస్తవమే. ఆ నీటిని సంరక్షించి శుద్ధీకరణ చేయడానికి ముందుకు రావడం శుభపరిణామం. అదే సమయంలో ‘గంగా’ నదితోపాటు వేలకువేల కిలోమీటర్లు ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి, బ్రహ్మపుత్ర మొదలగు నదుల నీటికి కూడా శుద్ధి ప్రణాళికలను రూపొందించవలసి ఉన్నది. మనం జీవించి ఉన్న ఈ వాతావరణంలో నీరు, నేల, గాలి, ఈ మూడు ప్రజలకే కాకుండా మొత్తం జీవావరణానికి ప్రాణాధారం. ఈ మూడింటిలో నేలను ఇప్పటికే నాశనం చేస్తున్నాము. పంటలకు రసాయనాలను విరివిగా ఉపయోగించి, నేలను నిస్సారం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాం. అదేవిధంగా విచ్చలవిడిగా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ చెత్తను భూమిలో కరిగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కలలో కూడా సాధ్యం కాదనేది నిజం. మనం అవలంబిస్తున్న నేలను కలుషితం చేసే దుర్విధానాలవల్ల రాబోయే తరాలకు నిలువ ‘నేల’ లేకుండా పోయే ప్రమాదం వాటిల్లబోతున్నది. ఇక నీటి విషయానికి వద్దాం.
ప్రమాదకర స్థాయిలో రసాయనాలను నీటిలోకి విడుదలచేసే ఫ్యాక్టరీలు మనదేశంలో కోకొల్లలు. వీటికి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, దేశంలో కొన్ని రాష్ట్రాలలో, వర్షాకాలం చివరలో త్రాగేనీరు కనీసం లభించే పరిస్థితి వస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. రోజురోజుకు భూతాపం ఎక్కువ అవుతున్నది. ఇక ఈ రాబోయే వేసవి సంగతి ఏమిటో, నీటి పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటేనే గుండెలో ప్రకంపనలు. నోరున్న మన పరిస్థితి ఇలా ఉండేట్లుగా ఉంటే, మూగజీవాల పరిస్థితి అగమ్యగోచరమే. సస్యరక్షణ చర్యలలో భాగంగా మూగజీవాల సంరక్షణ కేంద్రాలను ఈ చలికాలం నుండే ప్రారంభించే ఆలోచనలు ప్రభుత్వాలు చేయాలి.
గాలి కాలుష్యం గురించి నేడు చాలా చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ముఖ్యంగా మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో ప్రజలను భయకంపితులను చేస్తున్నది. ఈ కాలుష్యం ఒక్క రోజో, ఒక్క మనిషో చేసింది కాదు. చాలాసంవత్సరాల నుండి అందరు ప్రజలు సమిష్టిగా కలిసి చేసిందని చెప్పాలి. ఇప్పటికీ ఈ గాలి కాలుష్యం చేస్తున్నామనేది స్పష్టంగా అగుపిస్తున్నది.
దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఒక గంటసేపు శ్వాస తీసుకుంటే, 45 సిగరెట్లు తాగిన దానితో సమానమని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తేల్చేయడం, అక్కడ నివసిస్తున్న ప్రజల ఘోరమైన జీవన ప్రమాద ఘంటికలకు ప్రతీక. ఈ సందర్భంగా గాలినే కాకుండా మనకు ప్రాథమిక అవసరాలైన నీరు, ఆహారాన్ని అందిం చే పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. సృష్టిలోని మహోన్నత పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే సర్వమానవాళి ఈ క్రింది విధంగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
*విచ్చలవిడిగా రసాయనాలను నీటిలోకి వదిలే సంస్థలను (అవి ఎంతటి ఉపయోగకరమైనవి అయినా సరే) బహిరంగ మార్కెట్ నుండి బహిష్కరించాలి.
*ప్రస్తుత సమాజ అవసరాలకు తగినట్లు కాలుష్య రహిత వస్తు వుల ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించాలి.
*జన ఆవాసాలు ఉన్నచోట కాలుష్య కారక సంస్థలను
నెలకొల్పుటకు అనుమతులను ఇవ్వకూడదు.
* ప్రతి ఇంటి పరిసర ప్రాంతాలలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రభుత్వం వారు సరఫరా చేసి పెంచుకునేట్లు ప్రజ లలో అవగాహన కల్పించాలి.
* మన దేశంలో అదృష్టంగా అందివచ్చిన అటవీ సంపదను
కాపాడుకోవాలి.
* సౌర విద్యుత్‌తో నడిచే పరికరాల అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలి.
*వాయు కాలుష్యానికి కారణమయ్యే పొయ్యిలను, వాహనా లను సాధ్యమైనంతవరకు ప్రజలు స్వయంగా ఉపయోగించ కుండా అవగాహనా   కార్యక్రమాలు చేపట్టి, వాటి స్థానంలో సోలార్ పొయ్యిలను, సోలార్ బ్యాటరీ వాహనాలను లేదా బయోడీజిల్‌తో నడిచే వాహనాలను అందుబాటులోకి   తేవాలి.
* ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో, కాగితపు బ్యాగులు, గుడ్డతో బ్యాగులను తయారుచేసే సంస్థలకు వ్యక్తులకు తగిన శిక్షణ అందించి వారికి ఆర్థికంగా     లోన్‌లు మంజూరు చేయాలి.
* వ్యవసాయంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించాలి.
* రేడియేషన్‌ను ఎక్కువగా కలిగించే సెల్‌టవర్స్ వాడకం కన్నా వైర్ సహాయంతో నడిచే ల్యాండ్ లైన్స్, ఫ్యాక్స్ మిషన్లలకు అనుమతులు ఎక్కువగా   అందించి ప్రజలు వాడే టట్లు చేయాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యతే కాకుండా ప్రతి వారి వ్యక్తిగత బాధ్యతగా అనుకున్న ప్పుడే   స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాల వారికి అందించిన వారమవుతాం.

Comments

comments