Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

లక్ష నూట పదహారు

marriage

 సంక్రాంతి కానుకగా కొత్త బడ్జెట్ నుంచి అమలు?

‘కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్’కి
లక్ష నూట పదహారు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కల్యాణలక్ష్మి’, ‘షాదీ ముబారక్’ పథకాలకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం త్వరలో రూ. 1,00,116కు పెరగనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సిఎం కెసిఆర్ ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. రానున్న బడ్జెట్ నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తలసరి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకానికి అర్హులయ్యేవారి వార్షిక ఆదాయ పరిమితిని కూడా పెంచే అవకాశం ఉంది. ఈ పథకాన్ని తొలుత ప్రారంభించినప్పుడు లబ్దిదారులకు రూ. 51 వేలు అందించిన ప్రభుత్వం ఆ తర్వాత రూ. 75,116కు పెంచింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే కాకుండా బిసి వర్గాలకు కూడా 2016 ఏప్రిల్ నుంచి వర్తించేలా విస్తరించింది.
ఇప్పుడు ఈ వర్గాలన్నింటికీ రూ. 75,116 చొప్పు న అందుతూ ఉంది. అయితే ప్రభుత్వం ఆశించినదానికన్నా ఎక్కువ ఆదరణ లభిస్తుండడం, పేద లబ్దిదారులకు ప్రయోజనకరంగా ఉండడంతో ఈ ఆర్థిక సాయాన్ని మరో రూ. 25 వేలు పెంచి రూ. 1,00,116 చొప్పు న అందజేయాలని భావిస్తోంది. వచ్చే బడ్జెట్ నుంచి అమలు చేయాలని భావిస్తున్నా సంక్రాంతి కానుకగా సిఎం కెసిఆర్ రెం డు మూడు రోజుల్లో ప్రకటన చేయవచ్చని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ప్రజల నుంచి డిమాండ్ లేకపోయినా వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ స్వచ్ఛందంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెక్కుల పంపిణీ సందర్భంగా మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వ గొప్పదనంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పథకానికి దరఖాస్తుల వెల్లువ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచీ గణనీయంగా ఉన్నందున ప్రభుత్వం రూ. 51 వేల సాయాన్ని రూ. 75,116కు పెంచడంతో పాటు 2016 ఏప్రిల్ నుంచి వెనకబడినవర్గాలకు కూడా విస్తరింపజేసింది. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా చెప్పుకోడానికి ఈ ఆర్థిక సాయాన్ని మరింతగా పెంచితే బాగుంటుందని పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు రావడంతో ఇప్పుడు ఈ ఆర్థిక సాయం రూ. 1,00,116కు పెరుగుతోంది. గడచిన మూడున్నరేళ్ళుగా ఈ పథకానికి ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చు పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఆర్థికసాయాన్ని పెంచడంతో మరింత పెరుగుతుంది. ఎలాగూ బిసి సంక్షేమ బడ్జెట్‌గా ఉంటుందని స్వయంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభు త్వం రూ. 1,807.33 కోట్లను ఖర్చు చేసింది. ఇప్పుడు ఆర్థిక సాయాన్ని రూ. 25 వేల చొప్పున పెంచితే మరో రూ. 600 కోట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రానున్న బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయించే మొత్తాన్ని పెంచడంతో పాటు లబ్దిదారుల వార్షికాదాయ పరిమితిని కూడా పెంచే అవకాశం ఉంది.

Comments

comments