Search
Tuesday 19 June 2018
  • :
  • :

డీసిఎం-లారీ ఢీ: ముగ్గురు మృతి

accident
– బీఎస్‌ఎన్‌ఎల్ పైపులు దింపుతున్న రెండు డీసీఎంలను ఢీకొన్న లారీ
– ముగ్గురు మృతి మరో 10మందికి గాయాలు
– కొత్తగూడెం టూ ఏటూరునాగారం రహదారిపై దారుణ ఘటన
– లారీ డ్రైవర్ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందంటున్న స్థానికులు

నూతన సంవత్సర వేడుకల ఆనందం వారి జీవితంలో రెండ్రోజులు కూడా లేకుండా పోయింది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చి నిండు ప్రాణాలను బలికొంది. అశ్వాపురం మండలం మొండికుంట గ్రామసమీపంలోని జాతీయ రహదారిపై బీఎస్‌ఎన్‌ఎల్ పైపులు దింపుతున్న రెండు డీసీఎం వ్యానులను అతివేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్షంగా నడపటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మనతెలంగాణ / అశ్వాపురం : కొత్త సంవత్సరం మూడవ రోజే మృత్యువు ప్రమాదం రూపంలో ముగ్గురిని బలితీసుకుంది. బుధవారం అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంట గ్రామసమీపంలో గుంటూరు నుండి వచ్చిన ఏపీ (16టీసీ 1684), ఏపీ (28 వీ 9360) రెండు డీసీఎం వ్యానులు మొండికుంట గ్రామ సమీపంలో బీఎస్‌ఎన్‌ఎల్ పైపులు, వైర్లు ను పదిహేను మంది కూలీలు దింపుతున్నారు. మణుగూరు నుండి కొత్తగూడెం వెళ్తున్న లారీ ఏపీ (20ఎక్స్ 3991), అతివేగంతో రెండు డీసీఎం వ్యానులను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ భాగ్యరావు(23), పైపులు దింపుతున్న కూలీ శివరాత్రి గోపయ్య(50) ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా కనకారావు(40) భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అదేవిధంగా ఈ ప్రమాదంలో పైపులు దింపుతున్న కూలీలు తీవ్రంగా గాయపడడంతో వీరిని భద్రాచలం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. లారీ డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడం వల్లే ఘోరం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు ఎలిపారు. ఇందులో మృతిచెందిన, తీవ్ర గాయాలపాలైన వారి వివరాలు పరిశీలిస్తే అందరూ గుంటూరుకు చెందిన వారిగా తెలుస్తుంది. కాగా రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న అశ్వాపురం సీఐ ఆలం నరేందర్, ఎస్సై రవీందర్ లు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపహాడ్‌కు తరలించారు.
బాధితులను పరామర్శించిన సీపీఐ బృందం
జాతీయ రహదారి మొండికుంట సమీపంలో జరిగిన ప్రమాదం విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు తమ బృందంతో సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను హుటాహుటీన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన బాదితులకు గుండెధైర్యం నింపి సానుభూతి తెలియజేశారు. కొత్తగూడెం – ఏటూరునాగారం జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నారు. ముగ్గురు ప్రాణాలు బలిగొన్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై పోలీసులు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది.

Comments

comments