Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

చిన్న పరిశ్రమలకు అభయం

ktr

సూక్ష్మ, చిన్నతరహా యూనిట్ల సమస్యలపై జిల్లాల్లో నెలనెలా టౌన్‌హాల్ సమావేశాలు
బ్యాంకులు, ప్రభుత్వపరంగా అన్నిరకాల సహకారం : మంత్రి కెటిఆర్ హామీ

 హైదరాబాద్ : సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల సమస్యల పరిష్కారానికి లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి నెల జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్ సమావేశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల ద్వారా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం, బ్యాంకులపరంగానూ, ప్రభుత్వపరంగానూ అన్ని రకాల సహా య సహకారాలను అందిస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఈ దిశగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లనుందన్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు బ్యాంకుల నుండి అందించాల్సిన సహాయం పై హైదరాబాద్ కోఠిలోని ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయంలో వివిధ బ్యాంకర్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కెటిఆర్ పాల్గొని పలు సూచనలు చేశారు.
జిల్లా పారిశ్రామిక కేంద్రాలు (డిఈసి)లతో సమన్వయం చేసుకుని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణకు ముందుకు రావాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల పునరుద్దరణకు రికవరీ, రీ స్ట్రక్చరింగ్, రెక్టిఫికేషన్ అనే త్రీ “ఆర్ ” సూత్రాన్ని పాటించాలన్నారు. ఖాయిలా పడిన పరిశ్రమల పునరుద్ధరణలో యూనిట్ల సమస్యను గుర్తించి వాటికి పరిష్కారం చూపించి రుణాలను పునరుద్దరించి తోడ్పాటు నందించాలని కోరారు. ఆ తర్వాతే ఈ రుణాల రికవరీ చేసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా చిన్న తరహా పరిశ్రమల సమస్యలను అర్థం చేసుకొని వాటికి సంబంధించిన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు ముందుకు పోతామన్నారు. ఈ హెల్త్ క్లినిక్‌కు ఆర్‌బిఐ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీగా గుర్తింపు ఇచ్చిందన్నారు. ఇలా సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండిస్ట్రీ హెల్త్ క్లినిక్ సంస్థలో బ్యాంకర్లు పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని కెటిఆర్ పిలుపు నిచ్చారు.
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిలో బ్యాంకుల సహకారాన్ని తాము గుర్తిస్తున్నామన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో రుణాలు ఇచ్చేలా, ఒక వేళ వాయిదాలు చెల్లించకుంటే మొండి బకాయిల ఖాతాలోకి పంపకుండా వాటిని తిరిగి ఆదుకునే విషయంలో నిర్వహించే సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనంలో కొంత సానుకూలంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో దీన్ని పూర్తి చేయాలన్నారు. అవసరం అయితే ఈ అధ్యయనాన్ని తమ హెల్త్ క్లినిక్ చేసి పెడుతుందన్నారు. సూక్ష్మ పరిశ్రమలకు ‘ముద్రా’ బ్యాంకు లోన్ల పంపిణీ, ఖాయిలా పడిన యూనిట్లకు అందించాల్సిన సహకారం పై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. తక్కువ మొత్తాల్లో రుణాలను పునరుద్దరించడం ద్వారా అనేక చిన్న తరహా పరిశ్రమలు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని, ఇలాంటి వాటికి ఖచ్చితంగా సహకారం అందించాలని మంత్రి బ్యాంకర్లను కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్, లెదర్, వివిధ వృత్తుల ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న యూనిట్లకు లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు. మహిళా పెట్టుబడిదారులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, ముద్రా రుణాల్లో ప్రధాన మంత్రి ఉపాధి పథకం వంటి కార్యక్రమాల్లో రుణాల పంపిణీ లక్షాలను చేరుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని మంత్రి బ్యాంకర్లకు సూచించారు. ఈ రెండు అంశాల్లో వందశాతం లక్షాన్ని పూర్తి చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ముద్రా రుణాల్లో అవకాశం కల్పించి రుణాలను ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో పలు బ్యాంకుల ఉన్నతాధికారులు, తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, పరిశ్రమ సంఘాలు, చిన్న తరహా పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments