Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఔటర్ చుట్టూ ట్రామా సెంటర్లు

ORR

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా గాయాల చికిత్సా కేంద్రాలు (ట్రామా సెంటర్స్)లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఎ నిర్ణయించింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టమైన ఆదేశాలను జారీ చేయడంతో అథారిటీ కమిషనర్ చిరంజీవులు వాటి ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిసారించారు. విశ్వనగరానికే తలమానికంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువగా మెరుగైన సేవలందించే వైద్యశాలలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ మేరకు గత మంగళవారం జరిగిన సమావేశంలో ట్రామా సెంటర్లను వేగంగా నిర్మించాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఔటర్‌లో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అత్యాధునికంగా వైద్యం అందించడం ద్వారా వారి ప్రాణాలను సురక్షితం చేయాలని మంత్రి కెటిఆర్ ఆదేశించినట్టు అధికారులు తెలిపారు. దీంతో కమిషనర్ చిరంజీవులు వీటిని వేగంగా అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక అధ్యయనం చేయాలని, అందుకు ఒక కన్సల్టెన్సీని నియామకం చేయాలని నిర్ణయించనున్నట్టు పేర్కొంటున్నారు.

నిరంతరం వైద్యసేవలు : ఔటర్‌లో తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలతో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా అధికశాతం మంది క్షతగాత్రులుగా మారుతున్నారు. అయితే, ప్రమాదాలు జరిగినప్పుడు సమయానుకూలంగా వైద్యం అందిస్తే చాలామంది బ్రతికే వీలుంటుందనేది అథారిటీ అభిప్రాయం. ప్రమాదాల సందర్భంలో అత్యవసర వైద్యసేవలు గంట సమయంలోపున అందితే ప్రాణనష్టం తప్పుతుందనేది వైద్యుల అభిప్రాయం. అది గ్రహించిన అథారిటీ ప్రాణనష్టాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ట్రామాసెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. రింగ్ రోడ్ చుట్టూరా ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రాలు ఎన్ని ఉన్నాయి. వాటి సామర్థమెంత. ఎన్ని పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయవచ్చును. ఔటర్‌కు ఎంతదూరంలో ఉన్నాయి. వంటి విషయాలపై అధ్యయనం చేయాలని కమిషనర్ చిరంజీవులు నిర్ణయించారు. వీటన్నిటిని 24 గంటలు వైద్యసేవలు అందించే ట్రామా కేంద్రాలుగా మార్చాలని ప్రణాళికలను సిద్దంచేయాలని భావిస్తున్నారు. ఈ ట్రామా సెంటర్లన్నింటికీ ఒక కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేసి ఇక్కడినుండే అన్ని కేంద్రాలకు సమాచారం వెళ్ళాలని సూచిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా నాలుగు అంకెల నెంబర్‌ను కేటాయించాలని భావిస్తున్నారు.

రెండు బెడ్స్ అంబులెన్స్‌లు : ట్రామాసెంటర్ల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే టెండర్ ద్వారా ఓ కన్సల్టెన్సీని నియామకం చేయాలని కమిషనర్ భావిస్తున్నారు. ప్రస్తుతమున్న అంబులెన్స్‌లు ఒక బెడ్ సామర్థమున్నవి మాత్రమే. అయితే, ఇవి ఎక్కువగా ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు అంతగా సహకరించవని, కనీసం రెండు బెడ్‌ల అంబులెన్స్‌లను వినియోగంలోకి తీసుకురావాలని కమిషనర్ చిరంజీవుల యోచన. ట్రామాసెంటర్లలోని వైద్య సదుపాయాలు అత్యవసర సేవలకు సంబంధించి అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని అథారిటీ భావిస్తుంది. గాయాల చికిత్సా కేంద్రాలను కనీసం 5 పడకల ఆసుపత్రిస్థాయిలో అభివృద్ధి చేయాలనేది ఆయన అభిప్రాయంగా ఉన్నట్టు తెలిసింది. ఇందుకయ్యే వ్యయం అథారిటీ కేటాయించనున్నట్టు సమాచారం.

ప్రజల ప్రాణాలు ముఖ్యం

మనిషి ప్రాణాలను కాపాడటం అత్యంత ప్రాధాన్యతాంశమని, వాటికి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం, సౌలభ్యాన్ని కల్పించాలని హెచ్‌ఎండిఎ భావిస్తుంద ని కమిషనర్ చిరంజీవులు వెల్లడించారు. మంత్రి తారకరామారావు ట్రామాసెంటర్లను ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంతో తాము ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు.
– కమిషనర్ చిరంజీవులు

Comments

comments