Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నలు వీటిపైనే..

life2

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వూలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి పరిణామాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తుంటాయి.ముఖ్యంగా అభ్యర్థి ప్రొఫైల్ ఆధారంగా బోర్డు సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు ఉపాధ్యా
యుడిగా విధులు నిర్వర్తిస్తోన్న వారిని విద్యా రంగానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇప్పటివరకు సాగిన ఇంటర్వూల ప్రశ్నల విధానం పరిశీలిస్తే … అభ్యర్థి నేపథ్యం, చేస్తున్న ఉద్యోగం, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కరెంట్ అఫైర్స్‌తో పాటు అంతర్జాతీయ అంశా లను సైతం అడిగినట్లు అర్థమవుతోంది. ఒక్కోఅభ్యర్థికి కనిష్ఠంగా 15 నిమిషాలు, గరిష్ఠంగా 30 నిమిషాల వరకు ఇంటర్వూ జరుగుతోంది. గ్రూప్స్ అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ ఇంటర్వూ ప్రశ్నల విధానం…..

టీచర్‌గా పనిచేస్తున్న అభ్యర్థిని ఎలాంటి ప్రశ్నలు వేస్తారంటే…మీరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? ప్రభుత్వ పాఠశాలలో చేరేలా విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తారు? ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నవారిని వారి పిల్లలను ఏ స్కూల్లో చేర్పించారనే విషయాన్ని కూడా అడిగారు.
* ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో అభ్యర్థిని విద్యారంగంపై ఎక్కువగా ప్రశ్నించారు. కొఠారి కమిషన్, విద్యాహక్కు చట్టం, విద్యా రంగంలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సమూల మార్పులకు సూచనలు? తెలంగాణ ప్రభుత్వం చెబుతోన్న కేజీ టు పీజీ ఉచిత విద్య గురించి ప్రశ్నించారు. కేజీ టు పీజీ అమలు ఎలా ? కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే ఏమిటి అనే ప్రశ్నలు అడిగారు.
* లేబర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నవారిని కార్మిక చట్టాలపై.. పోలీసు శాఖలో పనిచేస్తున్నవారికి శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? లాఠీచార్జీ ఎప్పుడు చేస్తారు? 144 సెక్షన్ ఎప్పుడు విధిస్తారు? అని అడిగారు.
* ఇంటర్వూలో ఎక్కువగా దృష్టిసారుస్తున్న మరో అంశం… భూ సేకరణ చట్టం. ఈ చట్టం విధివిధానాలు, దానికి సంబంధించిన సవరణల గురించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం.. భూ సేకరణ ప్రాధాన్యత , రాష్ట్రంలో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలు, భూ సేకరణను వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలిచిన కొన్ని సంఘటనలు, వాటిపై అభ్యర్థి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు బోర్లు సభ్యులు ప్రయత్నించారు. ఒక వేళ మీరు ఆర్డీఓగా విధుల్లో ఉంటే భూ సేకరణను వ్యతిరేకిస్తోన్న ప్రజలను ఎలా మెప్పిస్తారు? అని అడిగారు.

* మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రభుత్వ పథకాల ప్రాముఖ్యం, వాటి ఉద్దేశం, ఆయా పథకాలకు ఎంత నిధులు అవసరం? వాటిని ప్రభుత్వం ఎలా సమకూర్చుకుంటోంది ? ఏయే సంస్థల నుంచి కావాల్సిన నిధులు తెచ్చుకుంటోంది..? ఆయా పథకాల అంచనా బడ్జెటు ఎంతెంత? మీకు బాగా నచ్చిన, నచ్చని రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమిటి? అందుకు కారణాలు ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.
* తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కృష్ణగోదావరి నదీ జల వివాదాలపై అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. మరీ ముఖ్యంగా కృష్ణ నదిపైనే ఎక్కువ వివాదాలు రావడానికి కారణాలు ఏంటి అని అడిగారు?
* మత్తు మందులపై ప్రశ్నలు ఎదురయ్యాయి. డ్రగ్స్ వినియోగం మన దగ్గర ఇప్పుడే కొత్తగా ఉందా ? ఒక వేళ ముందు నుంచే ఉంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు ప్రధానాంశంగా మారింది? ప్రపంచంలో ఏయే దేశాల్లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంది? డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే పరిణామాలు? ఫార్మసీ నేపథ్యం ఉన్న అభ్యర్థులను డ్రగ్స్‌కు సంబంధించిన పదజాలం, వాటి అబ్రివేషన్స్ పైన ప్రశ్నలు అడిగారు.
* జిల్లాల సమాచారంపై సభ్యులు ప్రశ్నలు సంబంధించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, జిల్లా విశిష్టతపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
* భారత్‌చైనా సరిహద్దు ప్రాంతంలో నెల కొన్న ఉద్రిక్త పరిస్థితులపైన ప్రశ్నించారు. చికెన్ నెక్, ట్రై జంక్షన్, డోక్లా పీఠభూమి వివాదాలపై ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు తెలిపారు.
* జమ్ముకశ్మీర్‌లో ఈ మధ్య హింస బాగా పెరిగిపోయింది. అక్కడ ప్రశాంత పరిస్థితులు నెలకొనాలంటే .. ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? వంటి ప్రశ్నలు అడిగారు.
* దేశంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఎక్కడ జరుగుతుంది?
ఆ ఉద్యమం రావాడానికి గల కారణాలు? అక్కడి భౌగోళిక , రాజకీయ పరిస్థితులు ఏమిటి? ఆ ప్రత్యేక ఉద్యమంపై మీ అభిప్రాయం ఏమిటి? అని ప్రశ్నించారు.
* ఇంటర్వ్యూ మొత్తం అభ్యర్థుల ప్రొఫైల్ ఆధారంగా, సమకాలీన అంశాల మేళవింపుగా , ప్రభుత్వ పథకాలపై అవగాహనను పరిశీలించే విధంగా ఉంటునట్లు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అభ్యర్థులు చెప్పే సమాధానాల ఆధారంగా ఎక్కువగా ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ఇంటర్వూకు ఎంపికైనవారిలో చాలామంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరు విధుల్లో భాగంగా చేసే పనులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు.

Comments

comments