Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

తీరు మారని ఖాకీలు

cap*రియల్ తగాదాలలో తలదూర్చుతున్న వైనం
*వరుస అటాచ్‌లు, సస్పెండ్‌లు చేసినా ఫలితం సున్నా

మన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాసుల సంపాదనకు అలవాటు పడ్డ శివారులోని పలువురు ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. భూ వివాదాలకు దూరంగా ఉండాలని పోలీసు పెద్దలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వాటిని కనీసం పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రియల్ దందాలలో చాలా మంది ఖాకీ బాస్‌లు బిజీబిజీగా గడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైబారాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు నగర శివారు ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతుంది. భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో రియల్ వ్యాపారంలో వివాదాలు సైతం అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. రియల్ వ్యాపారంలో వస్తున్న తగాదాలతో పలువురు రియల్టర్‌లు, దళారులు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతుండటంతో వాటిని పలువురు కింది స్థాయి పోలీసు యంత్రాంగం క్యాష్ చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌లతో పాటు ఎస్‌ఎచ్‌ఓలపై సైతం పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీస అనుమతులు లేకుండా లేఅవుట్‌లు చేస్తున్న వారి నుంచి ఇటీవల ఒక స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేసి వసూళ్లకు తెరతీసినట్లు ప్రచారం జరుగుతుంది. మరో పోలీస్‌స్టేషన్ పరిధిలో లేఅవుట్‌ల చుట్టూ ఖాకీలు తిరుగుతూ అక్రమ లేఅవుట్ తమకు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు ప్లాట్లు విక్రయించాలని సైతం బెదిరింపులకు పాల్పడినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. శివారు పోలీస్‌స్టేషన్‌ల ముందు రియల్ తగాదాలతో వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది.
వేటు వేస్తున్నా…
సివిల్ వివాదాలకు ఖాకీలు దూరంగా ఉండాలని ఉన్నతాధికారులు ఎన్ని సార్లు హెచ్చరికలు చేస్తున్నా కొంత మంది వాటిని పూర్తిగా పెడచెవిన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. భూములకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు వస్తే వాటిని పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక ఫైల్‌ను తయారు చేసి నిర్వహించవలసి ఉండగా చాలా పోలీస్‌స్టేషన్‌లో కనీసం వాటిని ఎంట్రీ కూడా చూపకుండా నేరుగా డీల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఫిర్యాదు దారుడితో పాటు అన్ని వర్గాలను ఒకేసారి పిలిచి దర్యాప్తు ఆరోపణలు నివారించేందుకు ప్రయత్నించవలసి ఉన్నా కొంత మందికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న సమయంలో రక్షణ కల్పించవలసి ఉన్న ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల వత్తిడులతో ఇటీవల కాలంలో పలువురు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శలు సైతం ఉన్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవలసి ఉన్నా కనీసం జి.డి ఎంట్రీ లేకుండానే శివారు పోలీస్‌స్టేషన్‌లో సివిల్ వివాదాలను సెటిల్ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిధిలో ఇటివల కాలంలో మియాపూర్‌లో పోలీస్ సార్‌తో పాటు మేడ్చల్ జిల్లాలో జవహర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ముగ్గురు కానిస్ట్టేబుల్‌లు భూతగాదాలలో తలదూర్చినందుకు పోలీస్ బాస్‌లు వారిపై వేటు వేశారు. సైబారాబాద్, రాచకొండ కమీషనర్‌లు సందీప్ శాండిల్యా, మహేశ్ భగవత్‌లు సివిల్ వివాదాలలో తలదూర్చిన వారిపై కఠీనంగా వ్యవహరిస్తు వేటు వేస్తున్న క్రింది స్థాయి అధికారులలో మాత్రం మార్పు రావడం లేదు. శంషాబాద్ డిసిపి పరిధిలోని పలు పోలీసు స్టేషన్‌లలో రోజు రోజుకు సివిల్ వివాదాలలో తలదూర్చుతున్న ఖాకీల సంఖ్య పెరుగుతుందని కొంత మంది తాము పనిచేసే స్టేషన్ పరిధిలో రియల్ వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సైబారాబాద్ పరిధిలోకి కొత్తగా వచ్చిన పలు పోలీస్‌స్టేషన్‌లలో ఇలాంటి వ్యవహరం పెద్ద ఎత్తున సాగుతుందని కొంత మంది మరింత బరితెగింపు వ్యవహరాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం ఒక స్టేషన్ నుంచి ఇక్కడే మరోస్టేషన్‌కు బదిలీ అయిన అధికారి ఒకరు స్టేషన్‌లోనే రియల్‌వ్యాపారులకు కూర్చోపెట్టుకుని మరి దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సైబారాబాద్, రాచకొండ కమీషనరేట్‌ల పరిధిలోని శివారు పోలీసుస్టేషన్‌లకు దీటుగా వికారాబాద్ జిల్లాలోని పలువురు ఖాకీలు రియల్ దందాలలో ఇటివల బిజిబిజిగా మారారని రియల్ బూమ్‌ను క్యాష్ చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. భూమి విషయంలో ఇటివల ఒక వర్గంకు కొమ్ముకాసి పిర్యాదుదారుడినే  బెదిరింపులకు పాల్పడిన అధికారిపై వేటు వేసిన వికారాబాద్ జిల్లాలోని ఇతర అధికారులలో మార్పు రావడం లేదు. వికారాబాద్ జిల్లాలో సంవత్సరాల తరబడి తిష్టవేసిన పలువురు అధికారులు రియల్ దందాలతో పాటు సివిల్ వివాదాలను తమదైన శైలీలలో డిల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి రియల్ దందాలు, సెటిల్‌మెంట్‌లలో తలదూర్చుతున్న వారి వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి తగు చర్యలు చేపట్టవలసిన అవసరం చాలా వరకు ఉంది.

Comments

comments