Search
Monday 23 April 2018
  • :
  • :

పౌరసేవలహక్కు చట్టం తేవాలి

Angry

కండలేని వానికే గండం అన్నట్లుగా తయారైంది నేడు దేశంలోని పేద ప్రజల పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి 70 వసంతాలు గడిచినా పేదవాడికి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ప్రవేశపెట్టినా, ప్రభుత్వ సేవలను పొందటంలో ఎదురవుతున్న ఇబ్బందులు తీర్చేలా నేటికీ వ్యవస్థలో మార్పు రాకపోవడం దురదృష్టకరం. స్వాతంత్య్రం అనంతరం 14 రాష్ట్రాలుగా ఉన్న మన దేశం నేడు 29 రాష్ట్రాలుగా మారినప్పటికీ నేటికీ పాలన సామాన్యుడికి చేరువ కాలేకపోయింది. అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం, అలక్ష్యం లాంటి అంశాలు ప్రభుత్వ పాలనా వ్యవస్థను పట్టిపీడిస్తుండగా, అదే సమయంలో నిరక్షరాస్యులైన సామాన్యులకు, అక్షరాస్యులైనా ఆర్థికంగా లేనివారికి సేవలు, న్యాయం అందని ద్రాక్షగానే మారిందనటంలో అతిశయోక్తి లేదు.

సమైక్య పాలనలో అడుగడుగునా నిర్లక్ష్యం, అణచివేత అనుభవించిన తెలంగాణ ప్రజలు స్వపరిపాలన మొదలయ్యాక జిల్లాలను కూడా పునర్వ్యవస్థీకరించి పాలనను ప్రజలకు చేరువ చేయబూనడం హర్షణీయమే అయినప్పటికీ అదే స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో నిజమైన పాలనా సౌలభ్యం రాలేదనే చెప్పాలి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాల వల్ల, ఉన్న ఉద్యోగు లపై కూడా తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా భూ దస్త్రాల ప్రక్షాళన, సాదా బైనామా, కళ్యాణలక్ష్మి, గొర్రెల పంపిణీ వంటి వినూత్న పథకాలతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఇలాంటి పథకాలు మరింత విజయవంతం కావాలంటే మరింతగా మానవ వనరులను చేర్చుకోవడమే శరణ్యం. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా పేదరిక నిర్మూలనకు తీవ్రంగానే కృషి చేస్తున్నప్పటికీ పథకాల అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అర్హులను దూరం చేస్తూ అనర్హులను ఎంపిక చేయడం, చేతివాటం ప్రదర్శన, రాజకీయ ఒత్తిళ్లు, దళారుల ప్రమేయం, అలసత్వం లాంటి అంశాలతో నేటి పాలనా వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్నది.

అంతా నెట్ మయమైన నేటి సమాజంలో ఇప్పటికీ ఇంకా పాత దరఖాస్తు పద్ధతులపై ఆధారపడటం విడ్డూరం. ఆధునిక ఆవిష్కరణలను ఆలంబనగా చేసుకొని ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తిని అనుసంధా నించి జవాబుదారీతనం పెరిగేలా, పారదర్శక వ్వవస్థ ఏర్పాటుకు కృషి చేయాలి. అందుకుగాను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన, యాప్‌ల తయారీ(రాష్ట్ర సర్వీసులు అన్నింటికీ కేంద్రీకృతంగా ఉండేలా), మొబైల్ ద్వారానే వీలైనన్ని పనులు జరిగే విధానం, సంబంధిత అధికారులపై పర్యవేక్షణ, అధికారుల నిర్లక్ష్యంపై నిరక్షరాస్యులకు, పేద వర్గాలకు ఆలంబనగా ఉండేవిధంగా అవసరమైతే అధికారులపై ముఖ్యమంత్రి స్థాయి వరకు ఫిర్యాదు చేయగలిగేలా వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే నిజమైన అభివృద్ధి, పారదర్శకమైన పాలన సాధ్యమవుతుంది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమంగ్, నమో వంటి యాప్‌లు బాగానే ఉన్నా ప్రతి రాష్ట్రంలోనూ అలాంటివి వచ్చేలా కేంద్రం చూడాలి. ఇప్పటికీ సర్టిఫికేట్ జారీకై కొందరు, ప్రభుత్వ ఆసరాకోసం కొందరు ఆర్థికంగా, మానసికంగా సతమవుతూ, లంచాల వల్ల బాధపడుతున్న నిర్భాగ్యులు ఎందరో ప్రతిరోజు ప్రభుత్వ కార్యాలయాల వద్ద తారసపడుతూనే ఉన్నారు.

ప్రభుత్వానికి పన్నులు చెల్లించి ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలుస్తున్న సామాన్యులకు పాలన చేరువైనప్పుడే నిజమైన స్వాతంత్య్రంగా భావించవచ్చును. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదర్శ పాలనకోసం జవాబుదారీ తనం, పారదర్శకత పెంచేలా, త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేలా, పౌరుడి ఇంటికే పాలన చేరేలా ఆధునిక ఇంటర్‌నెట్ వ్యవస్థను వాడుకొని ప్రతి పౌరుడి ఫిర్యాదును విలువైనదిగా స్వీకరించేలా అధికార వ్యవస్థ ను సమూలంగా ప్రక్షాళించాలి. అందుకు అనుగుణంగా మార్పు లు తెచ్చి ఫిర్యాదు వివరాలతో సహా దాని పరిష్కారం, గడువు, ప్రస్తుత స్థితి, నిర్ణయం, తుది ఫలితం, ఒకవేళ తిరస్కరణకు గురైతే కారణాలు తెలిపేలా అధికార వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా పౌరసేవల హక్కుచట్టం (సమాచారహక్కుచట్టం మాదిరిగా)తీసుకురావాలి. అప్పుడే పౌరులకు పనులు మానుకొని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగే బాధ తగ్గటమే కాక, దళారీల దందాను అదుపు చేయడానికి వీలవుతుంది. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థకు అందే అర్జీలు తగ్గితేనే నిజమైన అభివృద్ధి అని భావించాలి.

వినోద్ కుమార్ సుద్దాల, 9908312949

Comments

comments