Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

భగీరథ పనులెక్కడా..?

bagiratha*నత్తనడకన సాగుతున్న పనులు
*సకాలంలో విడుదల కాని నిధులు
*వేసవి వరకైనా మంచినీరందేనా..?

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి:  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని  నిర్ధేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం తలపెట్టినప్పటికీ లక్షం చేరుకోలేకపోయింది. గత డిసెంబర్ మాసం చివరి నాటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచీనీరు అందిస్తా  మని  ప్రకటించినప్పటికి ఆచరణలో అమలుకు నోచుకోలేకపోయింది. వచ్చే వేసవి కాలం నాటికైనా మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి ప్రజలకు మంచీనీరు అందిస్తారా అన్నది సందేహంగా మారింది. పైపులైన్ల, ఇతర నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కాకపోవడంతో పనులలో తీవ్రజాప్యం జరుగుతోంది. ఈ పథకం ద్వారా జిల్లాలో 471.65 కోట్ల రూపాయల వ్యయం తో1691 ఆవాసాలకు  మంచినీరు అందించాలని నిర్ణయించడం జరిగింది.  1486 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు నిర్మించడానికి 464 ప్యాకేజీలుగా రూపొందించారు. ఇందులో 263 ప్యాకేజీలలోని 865 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లను కాంట్రాక్టర్లు గత అక్టోబర్‌లో ఒప్పందం చేసుకున్నారు. వీటిలో 810 వరకు గ్రౌండింగ్ అయినప్పటికి నిధులు విడుదల కాక సగానికి పైగా నిర్మాణ దశలోనే  నిలిచిపోవడం గమనార్హం.  జి ల్లాలో   2766.28 కిలోమీటర్లు మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పైప్‌లైన్లు వేయాల్సి ఉంది.  ఇప్పటి వరకు 500 కి  కిలోమీటర్ల పైప్‌లైనులు మాత్రమే కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది.  గత రెండు నెలల క్రితమే మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్, ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్  సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినప్పటికి పనులలో ఆశించినంతగా పురోగతి కన్పించడంలేదు.

ప్రతి వారం  మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పనులపై సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నప్పటికి పనులు ముందుకు సాగడంలేదు. అనేక చోట్ల మేజర్  పైపులైన్ల పనులు కూడ అసంపూర్తిగా నిలిచిపోయాయి.  ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణానికి  భూ సమస్య, ఇసుక సమస్యలు వెంటాడుతున్నాయి.  మిషన్ భగీరథ ఇంట్రావిలేజ్ పనుల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు టార్గెట్లను నిర్ణయించుకొని టార్గెట్ల ప్రకారంగా పనులు చేపట్టాలని అధికారులు సూచించినప్పటికి  పనులను పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు విఫలమౌతున్నారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో పైపులైన్ల పనులకు కాంట్రాక్టు పొందిన బడా కాంట్రాక్టర్ల నుంచి సబ్ కాంట్రాక్టురులు పొందిన వారికి సరైన ధర చెల్లించడం లేదని కొంత కాలం పనులను బంద్ పెట్టారు. నేతలు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చడంతో తిరిగి పనులు ప్రారంభించారు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి చెర్వుచుట్టూ వేయాల్సిన భగీరథ పైపులైన్ల పనులు నిలిపివేశారు. చెరువులో నీరువుండటంతో పైపులైన్ల గుంతల్లోకి నీరు చేరుతుండటంతో అధికారులు చెరువునీటిని  తొలగించే ప్రయత్నం చేయగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. చెరువు కింద వందల ఎకరాల్లో పంట నష్టపోవాల్సి వస్తుందని, పైపులైన్‌ను మరి కొంత దూరం పొడిగించి వేయాలని కోరినప్పటికి అధికారులు వినకుండా చెరువు వత్వను పగుల గొట్టి నీరు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గతంలో వర్షాలతో, ఇప్పుడు సాగర్ కాల్వకు నీరు విడుదల చేస్తుండటంతో చెరువుచుట్టూ పైపులైన్ల నిర్మాణం నిలిచిపోయింది. ఎప్రిల్ మాసాంతానికి గాని పనులు తిరిగి ప్రారంభించే వీలు కలుగుతుంది. ఇబ్బందులు తొలగి మిషన్ భగీరథతో ఈ వేసవి నాటికైనా  మంచినీటి సమస్య తీరుతుందా అని ప్రజలు  అభిప్రాయ పడుతున్నారు.

Comments

comments