Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

సంక్రాంతి సెలవులు వచ్చాయోచ్చ్..! రా.. రమ్మంటున్న జూపార్కు

Zoo-park

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : సంక్రాంతి సెలవులు వచ్చాయ్..! జూపార్కు పిలుస్తోంది. చలిపులి వణికిస్తున్నా నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు వన్యప్రాణులు సందర్శకులను కనువిందు చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఆదివారం, ఇతర సెలవులు వచ్చాయంటే పెద్ద సంఖ్యలో సందర్శకులు ఇక్కడి తరలిరావడం మాములే అయినా ఈ సంక్రాంతి సెలవుల్లో ఆ సంఖ్య మరింతగా ఉండబోతుంది. అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆసియాలోనే అగ్రగామిగా కొనసాగుతున్న నెహ్రూ జూలాజికల్ పార్కు ఇటీవల కాలంలో సందర్శకుల ఆదరణలో అదేస్థాయిలో రికార్డు నమోదు చేసుకుంటుంది. ఇక మన కాంక్రీట్ జంగిల్‌లో జూపార్కు ఓ నిజ వన్యప్రాణి అరణ్యంగా కొనసాగుతుంది. ఇతర పార్కులు, పబ్లిక్ స్థలాలకన్నా ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని సందర్శకులు బాహాటంగా చెబుతున్నారు. ఐదు రోజుల పాటు సెలవులు రావడంతో జూపార్కు జనంతో కిక్కిరిసిపోవడం ఖాయం అనిపిస్తోంది.

అరుదైన పక్షిజాతులు, గాండ్రించే పెద్ద పులులు : జూపార్కులోకి అడుగు పెట్టగానే మొదట సందర్శకులకు జూను ఏలా చుట్టాలో బయోస్కోప్ హాల్లో లఘుచిత్రం చూపిస్తారు. అనంతరం కాలినడకన లేదా బ్యాటరీ ఆపరేటెడ్ వాహనంతో పాటు టాయ్ ట్రైన్‌లో కూడా జూపార్కు తిలకించవచ్చు. అన్ని రకాల వన్యప్రాణులు చూడాలంటే మాత్రం కాలినడకనమాత్రమే సాధ్యం. అక్వేరియం మొదలు గలాపగాస్ దీవులకు చెందిన అతిపెద్ద తాబేళ్లు, వానర జాతిలో అతి చిన్న వైన మార్మోసెట్‌ట్లు, చింపాజీ, లంగూర్, బాబున్ రకం వానరాలను చూడవచ్చు. అక్కడి నుంచి పెద్ద పులుల ప్రదర్శనశాలవైపు అడుగులు వేసే సందర్శకులకు తెల్లపులులు, రాయల్ బెంగాల్ టైగర్, చీత, జాగ్వర్, చిరుత, సింహాలు, ఆ మధ్యలో అడవి కుక్క, రేసు కుక్క, హైన తదితర వన్యప్రాణులు దర్శనమిస్తాయి. బేర్స్‌బే వెళ్లడానికి ముందే నీటి గుర్రం, ఖడ్గమృగం, నిప్పుకోడి, రియా, హారన్‌బిల్స్, వివిధ రకాల కొంగలు తిలకించే వీలుంది. మరో మార్గంలో న్యూ ఎవరీస్‌లోని పక్షి జాతిని చూస్తూ ఏనుగుల సఫారీ వద్ద నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎలివేటెడ్ పాత్‌వే మీదనుంచి గజరాజులు ఘీంకారనాథాలు ఎంతో చక్కగా గమనించవచ్చు.

ఇక్కడి నుంచి నేరుగా వెళితే సఫారీ ప్లాజా వద్ద సిఎన్‌జి వాహనాల్లో ఎక్కడంతో వాహనంలో బందీలుగా ఉండే సందర్శకులు స్వేచ్ఛగా తిరగాడే సింహాలు, పెద్దపులులు, ఎలుగు బంట్లు, అడవి దున్నలు వీక్షించవచ్చు. ఆ తరువాత డీర్స్ ల్యాండ్ వైపు వచ్చే సందర్శకులు శ్వేతవర్ణ జింక, కృష్ణ జింకలు, చుక్కల దుప్పి, సాంబార్, నిల్గాయ్, కొండగొర్రెలు చూసి అత్యంత సందర్శకుల ఆదరణ కలిగిన జిరాఫీ వద్దకు చేరుకుంటారు. జిరాఫీని చూసి కేరింతలు కొట్టే సందర్శకులు రెప్‌టైల్స్ హౌస్ వైపుకు రాగానే మొసళ్లు వేడి కోసం నోరు విప్పి నీటి బయట ఉండడం గమనిస్తారు. అనంతరం సరీసృపాల జగత్తులో విషపూరిత, విషరహిత అనేక రకాల పాములను తిలకించవచ్చు. అక్కడినుంచి పది అడుగులు ముందువేస్తే చీకటి గుహలోకి వెళతారు. అందులోని రాత్రి చర జీవులను భయంతోనే తిలకించిన బయటకు వచ్చాక మాత్రం అబ్బో రాత్రిళ్లు ఇలా ఉంటుందన్నమాట చీకటి ప్రాణుల జీవనం అనుకుంటారు. చివరగా రామచిలుకల ప్రపంచం వైపు అడుగులు వేసి అందమైన, అరుదైన పక్షిజాతి కిలకిలారావాలతో మంత్రముగ్థులు కాకతప్పదు మరీ. ఈ సంక్రాంతి సెలవుల్లో మీరు కూడా జూపార్కులోని వన్య ప్రాణులతో కలసి సందడి చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా వెళ్లాలి జూకి- పిల్లలకు పంచాలి వైల్డ్‌లైఫ్ విజ్ఞానం మరి.

Comments

comments