Search
Friday 25 May 2018
  • :
  • :

అంకెల డారడీ అభివృద్ధా?

md

లేనిది ఉన్నట్టుగా చూపించి దానిని విస్తృతంగా ప్రచారం చేసుకోవటం కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే దేశంలో రైతు ఆత్మహత్యలు 50% తగ్గినట్టు చెప్పి ఆ విషయాన్ని జాతీయ మీడియా లో ఉదరగొట్టింది. ఐతే రైతు ఆత్మహత్యల గురించి, జాతీయ నేర గణాంకాల విభాగం(NCRB) డేటా గురించి కొంత పరిజ్ఞానం ఉన్న ఎవ్వరికైనా అది శుద్ధ అబద్దం అని అట్టే అర్థమై పోతుంది. 2014లో జరిగిన రైతుఆత్మహత్యల వివరాలను విడుదల చేసిన ప్రభుత్వం అంతవరకు ఒకే కేటగిరిలో వస్తున్న రైతు ఆత్మహత్యల ను రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు అనే మూడు విభాగాలు చేసి అందులో రైతు ఆత్మహత్యలు 50% తగ్గినట్టు చూపించింది. రైతు సంఘాలు, మేధావులు ఇది వాస్తవం కాదు అని చెప్పేసరికే జాతీయ మీడియా రైతు ఆత్మహత్యలు ఒక్క సంవత్సరంలోనే తగ్గినట్టు ప్రచారం చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా బడ్జెట్‌లో రైతులు పంటలకు పెట్టే ఖర్చునే తగ్గించి చూపించి మద్దతు ధర ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
2018-19 బడ్జెట్‌ను రైతుల బడ్జెట్‌గా ప్రభుత్వం చెప్పుకోవటం ఒక పెద్ద జోక్ లాంటిది. మోడీ ప్రభుత్వం మిగిలిన ఎన్నికల వాగ్దానాలవలె రైతులకు చేసిన ఎన్నికల వాగ్దానాలన్నింటినీ తుంగలో తోక్కేసింది. మరో వైపు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు బలోపేతమవుతున్న క్రమంలో వాటికి తలొగ్గి కేంద్రప్రభుత్వం తప్పని భాగ్యంగా తమ ఎన్నికల వాగ్దానాలైన రైతు డిమాండ్ల ను ఆ మాత్రమైన బడ్జెట్ ప్రసంగంలో పొందుపరచింది. బడ్జెట్‌లో రైతు డిమాండ్ల ప్రస్తావన దేశవ్యాప్త రైతు ఉద్యమాల ఫలితమే. జాతీయ స్థాయిలో 190 రైతు సంఘాలతో కలిసి ఏర్పడ్డ AIKSCC(అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ)ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన కిసాన్ ముక్తి యాత్ర నవంబర్ 20,2017 నాడు ఢిల్లీ లో జరిగిన చరిత్రాత్మకమైన కిసాన్ ముక్తి సంసద్ ఉద్యమo, ఇప్పటికి వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న రైతు సదస్సులు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెంచుతున్నాయి. 2014 ఎన్నికల ప్రచారంలో భా.జ.పా. రైతుల పంటకు కనీస మద్దతు ధరను తమ ఎన్నికల వాగ్దానం గా పేర్కొని, గత నాలుగు సంవత్సరాలుగా వాయిదా వేస్తూ, ఆ వాగ్దానం నుండి వెనక్కు మళ్లుతూ 2015 లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. 2017 జూలైలో కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి పార్లమెంటులో మాట్లాడుతూ గడచిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కనీస మద్దతు ధరలపై వాగ్దానమే చేయలేదని తప్పుడు ప్రకటన చేసాడు. ఐతే ఇప్పుడు మాత్రం మొట్టమొదటి సారిగా కేంద్రప్రభుత్వం రైతుకు ఉత్పత్తి ఖర్చుల మీద ఒకటిన్నర రెట్లు కలిపి కనీస మద్దతు ధర ను ఇస్తున్నట్టు తన బడ్జెట్ ప్రసంగంలో పొందుపరచింది.
మరో ప్రక్క కేంద్రప్రభుత్వం మరోసారి రైతులను తప్పుదోవ పట్టిస్తూ తమ ప్రభుత్వం ఇప్పటికే రబీలో ఉత్పత్తి ఖర్చుకి 50% జోడించి రైతులకు కనీస మద్దతు ధర అన్ని పంటలలో ఇచ్చినట్టు ప్రకటించింది. వాస్తవ లెక్కల ప్రకారం సమగ్ర ఉత్పత్తి ఖర్చు(C2)ఐతే, 2017 రబీలో వివిధ పంటలకు ఇచ్చిన మద్దతు ధరలను చూస్తే అది 3శాతం మొదలు 38శాతం వరకు మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వం ఉత్పత్తి ఖర్చు అనే పదానికి నిర్వచనాన్నే మార్చి లెక్క వేయటం మరో దారుణమైన విషయం. ప్రభుత్వం సమగ్ర ఖర్చు(C2)స్థానంలో తక్కువ ఖర్చు పద్ధతిని (A2+FL) ఎన్నుకుని ఇప్పటికే రైతులకు రబీలో కనీస మద్దతు ధరలు ఇచ్చినట్టు ప్రకటించింది. ఇది రైతులను దారుణంగా మోసగించటమే. ఇక ప్రభుత్వం తక్కువ ఖర్చు పద్దతిని ఎన్నుకుని కనీస మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ 2018 ఖరీఫ్‌లో రైతులకు ధరలలో పెద్దగా ఒరిగిందేమీలేదు. ఉదాహరణకు ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త ఫార్ముల ప్రకారం వరి పంట కనీస మద్దతు ధర రూ.1550 స్థానంలో రూ.1675 అవుతుంది, సరే అదే కందుల విషయానికి వస్తే ధర రూ.5450 నుండి రూ.4977కు పడిపోతుంది. ఇది వివిధ పంటల కనీస మద్దతు ధరలలో స్వల్ప మార్పులు సూచిస్తుందేమో . కనీస మద్దతు ధరల లో చరిత్రాత్మక మార్పులు తెస్తామని, 2022కు రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న హామీకి ఇది ఏ మాత్రం సరిపోదు.
గత 11 సంవత్సరాలుగా రైతు సంఘాల ప్రధాన డిమాండ్ అయిన డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసు చేసిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు(C2),కు ఒకటిన్నరరెట్లు కనీస మద్దతు ఇస్తామని మోడీ ఎన్నికల ప్రచారం లో తెలిపారు. కాని ప్రస్తుతం ప్రభుత్వం తక్కువ ఖర్చు లెక్క(A2+FL) ప్రామాణికంగా తీసుకుంది, ఇది పూర్తిగా అర్థరహితము. ఎందుకంటే ఈ లెక్కలే ప్రామాణికంగా తీసుకుంటే 2009-14 మధ్యలో యుపిఎ ప్రభుత్వం కూడా చాలా పంటలకు ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం అదనంగా ఇచ్చింది, మరి 2014ఎన్నికల ప్రచారంలో మేము ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం అదనంగా ఇస్తామంటూ ఊదరగొట్టిన మోడీగారు ఇప్పుడేమి సమాధానం ఇస్తారు. పంటలకయ్యే ఉత్పత్తి ఖర్చుల గురించి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ కొత్త ఫార్ములా(A2+FL) రైతులకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా ఏమాత్రం లేదు, ఇది రైతు ఆదాయం రెట్టింపును కలగానే మిగిలిస్తుంది. మొదట ఈ ప్రభుత్వం పంటల ఖర్చు విషయంలో, కనీస మద్దతు ధర విషయంలో ఏ ఫార్ములా తో ముందుకు వెళ్తుందో వివరణ ఇవ్వాలి. ఇక కనీస మద్దతు ధర అనేక పంటలకు అమలు కూడా కాలేదు. ఈ సమస్యను పరిష్కరించటానికి ఒక పధకం కాని కనీస కేటాయింపులు కాని ఈ బడ్జెట్‌లో లేవు. ఒక్క ఖరీఫ్ 2017 సీజన్‌లోనే కనీస మద్దతు ధరలకు (MSP), మార్కెట్‌లో రైతు అమ్ముకుంటున్న ధరలకు తేడా వల్ల రైతులు దేశవ్యాప్తంగా32,700 కోట్లు నష్ట పోతున్నారని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ నిర్వహించిన కిసాన్ కా లూట్ ప్రచారం ద్వారా అంచనా వేసింది. పరిస్థితి ఇలా ఉంటే 2018-19 కేంద్రబడ్జెట్‌లో మార్కెట్ ఇంటర్వెషన్ అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీంకు నిధుల కేటాయింపు 950 కోట్ల నుండి 200 కోట్లకు తగ్గించిందంటే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
ఈ బడ్జెట్ రైతును రుణ విముక్తిచేసే అంశం గురించి కనీస ప్రస్తావన కుడా తీసుకురాలేదు. దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతులు అప్పుల బారినపడి ఆత్మహత్య చేసుకుంటున్నపటికి, కిసాన్ ముక్తి సంసద్ జాతీయ స్థాయిలో ప్రధాన డిమాండ్ అయిన రైతు శాశ్వత రుణ విముక్తి కోసం ఏ మాత్రం మద్దతును ప్రకటించకపోగా కంపినీలకు మాత్రం మొండి బకాయిలను రద్దు చేస్తామని బడ్జెట్‌లో హామీ ఇచ్చింది.
ఈ బడ్జెట్‌ను రైతు బడ్జెట్‌గా చూపటానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, వాస్తవ కేటాయింపులు చూసేసరి కి ఇది కూడా ఒక ఎన్నికల మ్యానిఫెస్టోను తలపించింది. కేటాయింపులకు వచ్చేసరికి ఎక్కడా పెద్దగా పెరిగిందేమీ లేదు. పశుసంవర్ధక,మార్కెటింగ్, చేపల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం లాంటి ముఖ్యమైన వాటికి కూడా కేటాయింపులు పెరగలేదు. మొత్తంగా బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించింది 2.3% మాత్రమే. ఒక్క ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు మాత్రమే 9000 కోట్లనుంచి 13,000 కోట్లకు నిధులు పెంచినప్పటికీ అది ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రైతులకంటే ఎక్కువగా భీమా కంపినీలకే ఉపయోగ పడుతుంది. ఉత్పత్తి ఖర్చును తగ్గించటానికి ఎటువంటి సబ్సిడీలను కాని, పధకాలను కాని ఈ బడ్జెట్ ప్రకటించలేకపోయింది. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల వల్ల రైతులకు నష్టం కలుగుతుందని సూచించినపప్పటికీ, ఆ సమస్యను గుర్తించటానికి గాని, జాతీయ విపత్తుల ఉపశమన నిధిని పెంచటానికి గాని ప్రయత్నం జరగలేదు. రైతులు ప్రభుత్వం పంటల సమగ్ర ఉత్పత్తి ఖర్చు(C2) పై ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధరను ప్రకటించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి . వెంటనే రమేష్ చంద్ కమిటి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఉత్ప త్తి ఖర్చులను లెక్కెయ్యాలి. అదేవిధంగా రైతుల ప్రధాన డిమాండ్ అయిన రుణ విముక్తి గురించి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం బడ్జెట్ లో ఇచ్చిన హామీలపై జవాబుదారీగా ఉండాలి.
2016లో జరిగిన రైతు ఆత్మహత్యల వివరాలను జాతీయ నేర గణాంకాల విభాగం ( NCRB) ఇంతవరకు విడుదల చేయలేదు. 2016 గడిచిపోయి 14 నెలలు కావస్తుంది, కాని దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఆత్మహత్యలపై గణాంకాలు రాలేదు. మిగిలిన విషయాలపై పూర్తి గణాంకాలు వచ్చాయి ఒక్క రైతు ఆత్మహత్యలు మినహా. ఈ గణాంకాల ఆధారంగానే వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలపై జాతీయ స్థాయి చర్చ జరుగుతుంది.
ఒకవేళ ఆత్మహత్యలు పెరిగి ఉంటే అందుకు కారణాలు, తగ్గిఉంటే అందుకు కారణాలు కుడా తెలుస్తాయి. కాని రైతు ఆత్మహత్యల గణాంకాల విషయంలో ఈ ఒక్కసారే ఎందుకు ఇంత జాప్యం జరుగుతున్నదో అర్థం కావటం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ఈ ప్రభుత్వం రైతు ఆత్మహత్యల వివరాలు వెల్లడిస్తుందో లేదో వేచి చూడాలి.
(ఈ రోజు హైదరాబాద్‌లోని తార్నాకలో జరుగుతున్న కిసాన్ ముక్తి సదస్సు సందర్భంగా)

Comments

comments