Search
Friday 25 May 2018
  • :
  • :

బంజారాల్లో చైతన్యం రగిల్చిన ‘ఫేరి ఫరెరో’

edit1

బంజార జాతిని చైతన్యపరచి ఏకతాటిపై తీసుకురావటానికి కృషి చేసిన సద్గురు సేవాలాల్‌మహరాజ్. ‘ఫేరి ఫరెరో’ ఉద్యమంతో దేశమంతటా తిరిగి తమ జాతి ప్రజల నడవడికను క్రమబద్ధంచేసి, చివరి క్షణం వరకు వారి కోసం పరితపించారు. సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా గుత్తి తాలుకా రాంజీనాయక్ తండా స్థాపకుడు రాంజీ నాయక్ కుమారుల్లో ఒకడైన భీమా నాయక్, ధర్మణిభాయి దంపతులకు 1741, ఫిబ్రవరి 15న జన్మించాడు. బాల్యంలో ఖాడు(పశువుల మంద) ను కాసేవాడు. చిన్నతనం నుంచే అందరికీ తోడ్పాటుగా ఉంటూ ఆదర్శంగా ఉండేవాడు. భక్తి పేరిట సాగుతున్న హింస, జంతుబలులను ఆయన నిరసించాడు. పద్దెనిమిదవ శతాబ్దంలో దేశంలో సంభవించిన కరువు, కాటకాలతో వేలాది మంది బంజారాలు మరణించారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ సామాజిక సంక్షోభ పరిస్థితిని ఆసరాగా చేసుకొని నవాబులు, ఆంగ్లేయులు చేపట్టిన సంస్కరణలు బంజారాల జీవితాన్ని మరింత సంకటంలో పడేశాయి. నిర్బంధ మతమార్పిడిలతో బంజార సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించారు. వారి చర్యలను ప్రతిఘటించిన బంజారాలను దేశద్రోహులుగా ముద్రవేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సేవాలాల్ తమ జాతి పునరుజ్జీవనానికి, సంస్కృతి పరిరక్షణకు కంకణం కట్టుకొని ‘ఫేరి ఫరెరో’ ఉద్యమాన్ని లేవదేశాడు. ప్రత్యమ్నాయ తండా సంస్కృతిని ఏర్పాటు చేయడానికి నాలుగు లక్ష్యాలతో ఉద్యమాన్ని నడిపారు. అవి 1) మత ప్రచారాన్ని వ్యతిరేకించటం 2) తండా రాజ్యం నిర్మాణం 3) బంజార ధర్మాన్ని ప్రచారం చేయటం 4)జాతి రక్షణకు యుద్ధం చేయటం. ఉద్యమం విజయవంతం కావటానికి సేవాలాల్ తన అనుచరులను నాలుగు దళాలుగా ఏర్పాటు చేశాడు. మొదటి దళం భృగురాజ్ సారథ్యంలో ‘ఫేరి ఫరెరో’ను ప్రచారం చేస్తారు. రెండవ దళం సంపన్నులైన జంగీ, భంగీల నాయకత్వంలో తండా ప్రజలకు గోవులను దానం చేస్తారు. మూడవ దళం బిడారులుగా వెళ్ళిన వారు తండాలు స్థాపించుకునేలా ప్రాంతాలను సూచిస్తారు. నాల్గవ దళం సేవాలాల్ ఆధ్వర్యంలో తండాల్లో ధర్మాన్ని బోధిస్తూ, సంస్కృతి పరిరక్షణకు ప్రజలను ఉత్తేజపరుస్తూ దేశమంతటా పర్యటిస్తారు.
ఆంగ్లేయులు సామ్రాజ్య విస్తరణతోపాటు తమ క్రైస్తవ మతవ్యాప్తిని కూడా విపరీతంగా ప్రచారం చేశారు. సేవాలాల్ తన అనుచర దళంతో తండాలకు వెళ్ళి విదేశీయులు వారి మతాన్ని మనకు బలవంతంగా అంటగట్టుతున్నందున తండాలను గ్రామాలకు, పట్టణాలకు దూరంగా, అడవులకు సాధ్యమైనంత దగ్గరలో స్థాపించి మన సంస్కృతిని కాపాడుకుందామని ప్రబోధించాడు. మతాంతీకరణకు గురిచేస్తున్న బ్రిటీష్ పాలకులను హెచ్చరిస్తూ ‘మా జాతి సంస్కృతి మాది, మాదైన జీవన విధానంలో మేము జీవిస్తాం. దీనికి ఎంతకైన తెగిస్తాం’ అని బంజారాల్లో సాంఘిక విప్లవాన్ని రగిలించాడు సేవాలాల్. రెండో లక్ష్య సాధనలో భాగంగా బిడారీలు (సరుకులు మోసుకెళ్లే సమూహాలు)గా తమ జీవనాన్ని సాగిస్తున్న బంజారాలతో ఆ వృత్తిని మాన్పించి ఎక్కడికక్కడ తండా రాజ్యాలను స్థాపించి వారిని నాగరికతకు దగ్గరగా చేర్చాడు. స్థిర నివాసం ఏర్పరచుకున్న బంజారాలు తమ తండా రాజ్యంలో నిలకడగా ఉంటూ క్రమంగా వ్యవసాయానికి అలవాటుపడి జీవనం గడపటానికి కొంత వరకు పురోగతిని సాధించారు. ప్రతి తండాకు నాయక్, కారోబారీ, డావో పేర్లతో నాయకులను నియమించి తండాల పరిపాలన చేయాలని సేవాలాల్ నిర్దేశించాడు.
మూడో లక్ష్యమైన ధర్మ ప్రచారంలో భాగంగా సత్యం, అహింస మార్గంలో నడవాలని బంజారాలకు సేవాలాల్ జ్ఞానబోధ చేశాడు. మూఢనమ్మకాలకు, మద్యపానానికి బానిసకాకుండా ఆదర్శ జీవనం గడపటానికి సన్మార్గంవైపు నడిపించాడు. లంబాడీల ఆచార వ్యవహారాలలోని జంతు బలి, రక్త తర్పణం, మద్యపానం అలవాట్లను మానుకొని సాత్వికంగా జీవించాలని హితోపదేశం చేశాడు. తమ జాతి దైవమైన మేరామాకు బలి ఇవ్వటాన్ని ఆయన నిరాకరించాడు. నీ ఆకలి తీర్చుకోవటానికి దేవుని పేరుతో నీలాగే ప్రాణం కలిగిన జంతువులను చంపటం తప్పు అని, జీవహింస చేయరాదని మేరామ భగత్(పూజారి)తో వాదిస్తాడు. ఇలా హింసాయుత సంస్కృతి నుంచి బంజార జాతిని అహింసాయుత మార్గం వైపు నడిపించటానికి ప్రయత్నం చేశాడు. లంబాడీలలో నేటికి కొందరు సేవాలాల్‌ను అనుసరిస్తూ మద్యం, మాంసంను త్యజించి సాధువులుగా జీవిస్తున్నారు.
దొంగతనాలు చేసే వారిని ఉద్దేశించి దొంగసొమ్ముతో తాత్కాలికంగా సుఖం పొందినప్పటికీ తరువాత ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కొనవల సి ఉంటుందని తన జాతికి హితోపదేశం చేసి జాతి నడవడికను సేవాలాల్ క్రమబద్ధం చేశాడు. నసాబ్ (పంచాయితీలు)పెట్టి పేదలపై దండుగ(జరిమాన) వేసి వారిని బాధించకుండ ధర్మాధర్మ విచక్షణను పాటించాలని ధర్మసూక్ష్మాలను ప్రబోధించాడు.తన తమ్ముని కొడుకుకు కడుబీదవాడైన తుకారాం పమార్ కూతురుతో వివాహం జరిపించి తామంతా బంజారలమని, తమలో పేద ధనిక, ఎక్కువతక్కువ భేదాలు, ఆర్థిక తారతమ్యాలు లేవని జాతి సంస్కృతిని లోకానికి చాటాడు. ఇలా జీవహింస చేయరాదు, సత్యాన్ని పాటించాలి. దొంగతనం చేయరాదు, అధిక ధనాన్ని ఇతరుల ఆస్తిని ఆశించరాదు అని సేవాలాల్ చేసిన ధర్మోపదేశంలో గౌతమ బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గాలను దర్శించవచ్చు.
యావత్ బంజారా జాతికి శాంతి సందేశాన్ని అందించడమేగాక అవసరమైపుడు యుద్ధాలు చేసి జాతిని రక్షించుకోవడం ఈ ఉద్యమంలోని నాలుగో లక్ష్యం. ఆ రోజుల్లో నవాబులు బ్రిటీషర్ల ఏజెంట్లుగా మారి వారి శాసనాలను అమలు చేశారు. తండా నుండి శిస్తు వసూ లు చేయటానికి ఆదేశించారు. కాని సేవాలాల్ “మీరు పరదేశీయులకు బానిసలు, నేను బానిసలను రాజులుగా గుర్తించను” కాబట్టి మేము ఏ శిస్తును కట్టము. అని సమాధానమిచ్చాడు. బానిసలకు బానిసలుగా ఉంటానికి తమ జాతి సిద్ధంగా లేదని “మా తండాల్లో మా రాజ్యం”అని ధిక్కార స్వరాన్ని వినిపించాడు. ఈ విధంగా జ్ఞానం, సేవ, త్యాగంతో కూడిన తన శేషజీవితాన్ని బంజార జాతి అభ్యున్నతికి అంకితం చేసిన మహానుభావుడు సేవాలాల్ 12, ఏప్రిల్ 1806లో మహారాష్ర్టలోని నాందేడ్ జిల్లా రూయిగఢ్‌లో దేహత్యాగం చేశాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 15న సేవాలాల్‌కు ప్రీతిపాత్రమైన లాప్సి(బియ్యం బెల్లంతో చేసిన పాయసం)ను వండి “భోగ్‌”ను చేస్తారు. అంతేగాక బంజారాలు తమతమ వీలును బట్టి పలు పండగల సందర్భాల్లో సేవాలాల్‌కు ఈ “భోగ్‌”ను నిర్వహిస్తారు. ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి. ఆయన ఆశయాలను విస్తృతంగా ప్రచారం చేసి వాటి ప్రాధాన్యం పెంచాల్సిన ఆవశ్యకత బంజార జాతి ప్రజలపైన ఉంది.

Comments

comments