Search
Thursday 24 May 2018
  • :
  • :

బయ్యారం ఉక్కు మా హక్కు

ktr

*విభజన చట్టంలో హామీ మేరకు కర్మాగారానికి త్వరగా అనుమతి ఇచ్చి సహకరించాలి
*కేంద్రాన్ని కోరిన మంత్రి కెటిఆర్
*హైదరాబాద్‌లో ప్రారంభమైన మూడు రోజుల ‘మైనింగ్ టుడే’ అంతర్జాతీయ సదస్సు

మన తెలంగాణ / హైదరాబాద్ : మొత్తం దక్షిణ భారత దేశంలోనే బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణేనని, గ్రానైట్, ఇనుము, ఇతర ఖనిజ నిక్షేపాలు కూడా విస్తారంగా ఉన్నాయని రాష్ట్ర మైనింగ్ శాఖమంత్రి కెటి రామారావు చె ప్పారు. ఖనిజాల తవ్వకాల్లో డ్రోన్, జియో ట్యా గింగ్, జియో ఫెన్సింగ్ టెక్నాలజీలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కు కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించాలన్నా రు. అపార ఖనిజ నిక్షేపాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం ఆవశ్యకత ఉన్న విషయాన్ని కేంద్రం కూడా గుర్తించిందని, రాష్ట్ర విభజన చట్టం హామీల్లోనూ తెలంగాణలో ఉక్కు కర్మాగా రం ఏర్పాటు చేస్తామని పేర్కొందని కెటిఆర్ గుర్తు చేశారు. మైనింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కి, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మూడు రోజు ల పాటు నిర్వహించే మైనింగ్ టుడే-2018 అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్‌ను బుధవారం మాదాపూర్ హైటెక్స్‌లో కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, మంత్రి కెటిఆర్‌లు ప్రారంభించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధిశాఖ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో టిఎస్ ఐపాస్ ద్వారా మైనింగ్ రంగంలోనూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ రెవెన్యూ రూ. 3,170 కోట్లు వచ్చిందని, 201718 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయాన్ని రూ. 3,500 కోట్లకు చేర్చాలని లక్షంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్న మైనింగ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. గ్రానైట్ పరిశ్రమ అభివృద్ది కోసం ఆ రంగం నిపుణులు, వ్యాపారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ మైనింగ్ రంగం దేశంలో అత్యధిక మందికి ఉపాధిని కల్పిస్తోందన్నారు. దేశం మొత్తంమీద సుమారు 32 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయని, దేశ జిడిపిలో మైనింగ్ రంగానిది అగ్రస్థానమని అన్నారు. భూగర్భంలో ఎక్కువ ఖనిజ నిక్షేపాలు ఉన్న చోటే పేదరికం కూడా ఎక్కువగా ఉంటోందని, ఈ అసమానతలను తొలగించాల్సిన అవసరం అటు కేంద్రం పైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్ర మైనింగ్ శాఖ నుండి రూ. 1300 కోట్లు ఇచ్చామని, ఈ నిధులను మైనింగ్ ప్రాంతాల్లోని కుటుంబాలకు వినియోగించుకోవాలని సూచించామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాక ముందు మైనింగ్ రంగంలో అవకతవకలు యావత్తు దేశానికి తెలుసునని, ఎన్డీఏ ప్రభుత్వం ఆలాంటి వాటికి దూరంగా ఉందని గుర్తుచేశారు. కేంద్ర మైనింగ్ శాఖ అత్యంత పారదర్శకంగా పని చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాలు కూడా మైనింగ్ తవ్వకాల్లో ఇదే విధంగా పారదర్శక విధానాలను అవలంభిస్తే కేంద్రం వంద శాతం సహకరిస్తుందన్నారు. మైనింగ్ రంగాన్ని మరింత అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాలంటే రాష్ట్రాల సహకారం కూడా తప్పని సరి అని నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.
కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి : గవర్నర్ నరసింహన్
గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ మైనింగ్ వల్ల వచ్చే ఆదాయంపైన మాత్రమే ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా పని ప్రదేశాల్లో గని కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా దృష్టి పెట్టాలని కోరారు. గనుల లోపల పని స్థలాల్లో కార్మికులు హెల్మెంట్ ధరించడం, సరైన విద్యుత్ వెలుగులు ఉండేలా చూడాలన్నారు. ఒక వేళ కార్మికులు చని పోతే వారి కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. పరిహారం అందుకున్న కుటుంబాల వివరాలను కూడా ఎప్పటికప్పుడు కంప్యూటరీకరించి తరుచూ ఆ కుటుంబాలను కలుస్తూ వారికి ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. చత్తీస్‌ఘడ్‌లో ఇలాంటి విధానాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తోందని, తెలంగాణ కూడా ఈ దిశగా ముందుకు వెళ్తుందన్న నమ్మకం తనకుందన్నారు. మైనింగ్ కోసం రైతుల దగ్గర నుండి భూములు తీసుకుంటే ఆ ప్రజలకు సరైన పరిహారం ఇవ్వడమే కాకుండా ఆ గ్రామాల్లో విద్య, వైద్యం, పారిశుద్ధ్ంయ తదితర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఖనిజ తవ్వకాలు, ఇసుక విక్రయాలు, ఇంకా మైనింగ్ శాఖకు ఒనగూరే ఆదాయ వివరాలను ఎప్పటి కప్పుడు మైనింగ్ శాఖ వెబ్ పోర్టల్‌లో ఉంచి పారదర్శకతను పాటించాలన్నారు. మైనింగ్ రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారని, తన మిత్రుడిగా కెటిఆర్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నానని మంత్రిని గవర్నర్ పొగడ్తల్లో ముంచెత్తారు. దేశ, రాష్ట్రాల ఎకానమీ మైనింగ్‌రంగం ద్వారానే ముందుకు వెళ్తున్నందున ఈ విషయంలో పరస్పరం కలిసి పని చేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. మైనింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆకట్టుకుంటున్న మైనింగ్ స్టాళ్లు…
వివిధ రా్రష్ట్రాలకు చెందిన కంపెనీలు ఈ ఎగ్జిబిషన్‌లో తమ స్టాళ్లను ప్రదర్శించాయి. సింగరేణి కాలరీస్ సంస్థ, ఎన్‌ఎండిసితో పాటు సుమారు 50 సంస్థల స్టాళ్ళు ఈ ప్రదర్శనలో కొలువు దీరాయి. ఆయా కంపెనీలు తమ లక్షాలను, ఉద్ధేశాలను ఈ ప్రదర్శన ద్వారా సందర్శకులకు వివరిస్తున్నారు.

Comments

comments