Search
Thursday 24 May 2018
  • :
  • :

మాస్కోలో విమాన ప్రమాదం

int

71 మంది దుర్మరణం

మాస్కో : మాస్కో నగర శివారులో ఆదివారం 71 మందితో వెళ్తున్న రష్యన్ విమానం కూలిపోయింది. డెమోడిడోవో విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానం కుప్పకూలినట్టు రష్యన్ మీడియా తెలిపింది. దేశీయ సరటవ్ ఎయిర్‌లైన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంటోనోవ్ ఎఎన్148 విమానం యురాల్స్‌లోని ఒర్‌స్క్‌కు వెళ్తుండ గా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో 65 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్టు మీడియా పేర్కొంది. ఆకాశం నుంచి కూలిపోయి విమానం మంటల్లో కాలిపోవడాన్ని తాను చూశానని ఆర్గునోవోకు చెందిన స్థానికుడు ఒకరు తెలిపారు. కాగా, ఇందులో ప్రయాణిస్తున్న 71 మంది ప్రాణాలతో ఉండే అవకాశం లేదని రష్యన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ పేర్కొంది. విమానం కూలిపోయిన స్థలంలో శకలాలు చాలా దూరం వరకు పడిపోయాయని కూడా తెలిపింది. ఏడేళ్ల క్రితం ఈ విమానాన్ని రష్యా తయారు చేసింది. ఏడాది క్రితం దీన్ని రష్యన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ నుంచి సరటోవ్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేసింది. అత్యవసర సహాయ బృందం రోడ్డు మార్గం ద్వారా ఘటనాస్థలికి చేరుకోవడానికి వీలుకాకపోవడంతో, కాలినడకన అక్కడికి వెళ్లారు. విమానం టేకాఫ్ తీసుకున్న రెండు నిమిషాలకే రాడార్ నుండి సంబంధాలు తెగిపోయాయని, ఆకాశంలో విమానం అదృశమైందని డెమోడిడోవో విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విమాన దుర్ఘటనకు మానవ తప్పిదం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వంటి అనేక కారణాలు ఉండే అవకాశముందని రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది.

Comments

comments