Search
Thursday 24 May 2018
  • :
  • :

భూగర్భజల అదృశ్యం

ph

నిరంతర విద్యుత్ వల్ల భూగర్భంలో నీటిమట్టం వేగంగా పడిపోతున్నదని ఇఆర్‌సి ఎదుట రైతుసంఘాల అభిప్రాయం 

హైదరాబాద్: వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వ డం వల్ల భూగర్భ జలాలు వేగంగా పడిపోతాయని విద్యుత్ నియంత్రణ కమిషన్ (టిఎస్ ఇఆర్‌సి) ముందు రైతు సంఘాలు వాపోయాయి. ఇఆర్ సి సోమవారం ఫ్యాప్సీభవన్‌లో నిర్వహించిన బహిరంగ విచారణకు కిసాన్ ఖేత్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఎం. కోదండరెడ్డి హాజరై మాట్లాడుతూ సాగునీటి వసతి లేనందువల్ల బోర్లపై ఆధారపడి సేద్యం చేస్తున్నందున 24 గంటల విద్యుత్ సరఫరాతో ఎక్కువ సమయం మోటార్లను నడిపించాల్సి వస్తోందని, దీనివల్ల అంతంత మాత్రంగా ఉన్న భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయన్నారు. ప్రతి ఏటా కేవలం మూడు నెలలపాటు కురిసే వర్షంతోనే భూగర్భ జలం పెరగాల్సి ఉందని, మిగిలిన తొమ్మిది నెలలు వాడుకోవాల్సిన ఈ నీటిని నిరంతర విద్యుత్‌తో స్వల్పకాలంలోనే వాడేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే వెయ్యి అడుగుల లోతుకు జలమట్టం పడిపోయిందని వివరించారు. రెండు నెలల నిరంతర విద్యుత్ సరఫరాతోనే పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయాయని రైతులు ఆందోళనతో ఉన్నారని గుర్తుచేశారు. విద్యుత్ టవర్ల నిర్మాణం కోసం తీసుకున్న భూమికి రైతులకు సకాలంలో సరైన తీరులో నష్టపరిహారం ఇవ్వడం లేదని, గతంలో ఏ కలెక్టర్ కూడా ఆదేశాలను పకడ్బందీగా అమలుచేయలేదని ఆరోపించారు. సాగునీటిపారుదల శాఖ ప్రతినిధి బల్వంత్ జోషి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే, మెట్రో రైలు కంటే కూడా డిస్కంలు ఎక్కువ చార్జీలు వసూలుకు ప్రతిపాదించాయని, బంగారు తెలంగాణ సాధనలో ఆయకట్టు పెంపు, తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరివ్వడానికే ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నదని స్పష్టం చేశారు. రైతు సంఘాల నేతలు దొంతి నర్సింహారెడ్డి, శ్రీధర్ రెడ్డి, మాణిక్‌రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్ కనెక్షన్లకు, విద్యుత్ లైన్ల నిర్మాణానికి, సర్వీస్ కనెక్షన్ ఇవ్వడానికి, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, మరమ్మత్తులకు క్షేత్రస్థాయిలో సిబ్బందికి లంచాలు ఇస్తే తప్ప పనులు జరగడంలేదని ఆరోపించారు.
ఇఆర్‌సి చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో దక్షిణ డిస్కమ్ సిఎండి జి. రఘుమారెడ్డి తమ అవసరాలు, టారిఫ్ ప్రతిపాదనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రదర్శించారు. డిస్కంకు రూ.23,519 కోట్ల ఆదాయం కావాలని, ప్రస్తుత టారిఫ్‌తో రూ.18,504 కోట్లు మాత్రమే వస్తుందని, మొత్తంగా రూ.4,222 కోట్లు లోటు ఉందని వివరించారు. సగటున ఒక్కో యూనిట్‌కు రూ.4.37 ఖర్చతో 42,193 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు రూ.18,433 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని పేర్కొన్నారు.
24 గంటల కరెంటు ఇస్తున్నప్పటికీ రైతులు వారికి అవసరమున్నప్పుడే వాడుకోవాలని, అప్పుడే భూగర్భ జలాలను పదికాలాల పాటు నిలుపుకోగలమని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్లు గతంకంటే తగ్గాయని స్పష్టం చేశారు. ఫ్యాప్సీ ప్రతినిధి సుజాత మాట్లాడుతూ చార్జీలు పెంచకుండా డిస్కంల ప్రతిపాదిత రూ.9,000 కోట్ల లోటును ఎలా పూడుస్తారని ప్రశ్నించారు. తప్పుడు లెక్కలతో మాయ చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు, సౌర, పవన విద్యుత్, నిర్వహణ వ్యయం, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జిల, ఇతరత్రా వివరాలెందుకు ఇవ్వడం లేదని, జెన్‌కో స్టేషన్లు బ్యాక్ డౌన్ చేస్తే, దాని ఖర్చు ఎవరు భరించాలని నిలదీశారు. గత సంవత్సరం రూ.4777 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చామని చెప్పారేతప్ప వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఎంతిస్తారో ఇఆర్‌సి అధికారులు ఈ బహిరంగ విచారణలో స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

Comments

comments