Search
Friday 25 May 2018
  • :
  • :

హీరోయిన్లు పరిస్థితిని అంతవరకు తెచ్చుకోవద్దు

MAA

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే హైదరాబాద్‌లో టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో అంగరంగ వైభవంగా కర్టెన్‌రైజర్ వేడుక జరిగింది. తాజాగా విదేశాల్లో వేడుకలను నిర్వహించేందుకు ‘మా’ ముహూర్తం పెట్టేసింది. ఏప్రిల్ 28న అమెరికాలోని డల్లాస్‌లో తొలి ఈవెంట్ గ్రాండ్‌గా జరుగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ “చిరంజీవికి ‘మా’ వేడుకల గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. అలాగే మహేష్‌బాబు కూడా మే నెలలో జరిగే ఓ ఈవెంట్‌కు వస్తానన్నారు. అలాగే బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్, నాగార్జున కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఆమధ్య కర్టెన్‌రైజర్ వేడుకలో నాజర్ మాట్లాడుతూ ‘మా’ అసోసియేషన్ మాకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఆ మాట నాకు ఎంతో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్నిచ్చింది. అలాగే పరభాషా హీరోయిన్లు అయినా మన తెలుగు హీరోయిన్లు అయినా సరే ఖచ్చితంగా ‘మా’లో సభ్యత్వం తీసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చిందంటే ‘మా’ ముందుకు వస్తున్నారు కానీ అప్పటివరకు మేము గుర్తుకు రావడం లేదు. ఆ సమయంలో ఒక చేతిలో ‘మా’ మెంబర్‌షిప్ ఫారమ్… మరో చేత్తో కంప్లయింట్ ఫారమ్ తీసుకొని వస్తున్నారు. పరిస్థితిని అంతవరకు తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాను. అలాగే ‘మా’ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 35 మందికి ఈనెల నుంచి రూ.3000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం”అని అన్నారు. ‘మా’ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ “మా ఫండ్ రైజింగ్ కోసం కొంతమందిని కలిస్తే చిరంజీవి వస్తే ఫండ్ ఇస్తామన్నారు. ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అంతా కలిసి కట్టుగా ఉంటూ అన్ని పనులు చేస్తున్నారు. వాళ్ల అసోసియేషన్ ఆఫీసులు చాలా బాగుంటాయి. కానీ మనకు సరైన బిల్డింగ్ కూడా లేదు. అలాంటివన్నీ మనం కూడా ఏర్పాటుచేసుకోవాలి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రధాన కార్యదర్శి నరేష్, కార్యవర్గ సభ్యుడు సురేష్, బెనర్జీ, సురేష్ కొండేటి, అమెరికా ఈవెంట్ నిర్వాహకులలో ఒకరైన రాధాకృష్ణ రాజా, అమెరికాకు చెందిన స్టీఫెన్ పల్లామ్, రాంబాబు కల్లూరి, నిఖిల్ నాంచారి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments