Search
Friday 25 May 2018
  • :
  • :

గతంలో ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు

వరుణ్‌తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘తొలిప్రేమ’. యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్‌తో ఇంటర్వూ విశేషాలు… 

BVSN

కథను నమ్మి…
‘తొలిప్రేమ’ చిత్రానికి మంచి స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉంది. వరుణ్‌తేజ్ కథను నమ్మి ఈ సినిమా చేశాడు. ‘ఫిదా’ తర్వాత అతను ఈ లవ్‌స్టోరీలో నటించి ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు.

 చివరికి మా బ్యానర్‌లో…
కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన పాత్రలు చేస్తున్న వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’తో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించాలనుకున్నారు. కానీ ఆయనకు కుదరకపోవడంతో చివరికి మా బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించాం.

 కొత్తదనంతో కూడిన…
యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. ప్రేమ కథల్లో కొత్తదనంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దీంతో ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతులను అందించింది ఈ చిత్రం.

 అతనితో మరో సినిమా…
గతంలో నేనెప్పుడూ కొత్త దర్శకుడితో సినిమా చేసే సాహసం చేయలేదు. మా అబ్బాయి బాపినీడు ఈ సినిమాను సెట్ చేయడం జరిగింది. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను నిర్మించాం. ఇక వెంకీతో మరో సినిమా కూడా చేయబోతున్నాం.

 అప్పుడే స్టార్లతో సినిమా…
ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ బిజీగా ఉన్నారు. వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఓ పెద్ద సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తాం.

 ఏమాత్రం రాజీపడం…
హీరో మార్కెట్‌ను బట్టి, కథకు అనుగుణంగా సినిమాను నిర్మించడం జరుగుతుంది. ప్రతి సినిమాకు బడ్జెట్‌ను ముందుగానే అనుకుంటాం. సినిమా నిర్మాణంలో ఏమాత్రం రాజీపడకుండా తెరకెక్కిస్తాం.

 నాకు సంతృప్తినిచ్చింది…
‘తొలిప్రేమ’ నా 24వ సినిమా. ఇటువంటి సినిమా సక్సెస్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చింది ఈ చిత్రం.

 మహేశ్‌తో సినిమా చేస్తా…
తెలుగులోని పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు అందరితో సినిమాలు చేశాము. మహేశ్‌తో సినిమా చేయాల్సి ఉంది. అతనితో కూడా ఓ సినిమా చేస్తాము. ఇక మంచి సినిమాలు చేయాలనే లక్షంతోనే ముందుకు పోతున్నాము.

Comments

comments