Search
Friday 25 May 2018
  • :
  • :

కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు

nagashourya

శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌లో నాగశౌర్య,  షామిలి జంటగా నటించిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వంలో కె.ఆర్, రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్‌ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య మాట్లాడుతూ “తొలిసారి చక్కని కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నాను. షూటింగ్ చేస్తున్నంత సేపు సెట్‌లో పండుగ వాతావరణంలా ఉంటోంది. కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు… చిన్న చిన్న మనస్పర్థలు, ఆవేదన ఎలా ఉంటుందనేది  దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. కథను నమ్మి ఈ సినిమా చేశాను. నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉంటాయి”అని అన్నారు. హీరోయిన్ షామిలి మాట్లాడుతూ “ఓయ్ సినిమా తర్వాత సరైన కథ కుదరకపోవడంతోనే మరో సినిమా చేయలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘అమ్మమ్మగారిల్లు’ కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. నాగశౌర్యతో సినిమా చేయడం సంతోషంగా ఉంది”అని తెలిపారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ “రిలేషన్ నెవర్ ఎండ్ అనే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని రాసిన కథ ఇది. దర్శకుడిగా నాకిది తొలి సినిమా. తెరపై సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు పండుగ వాతావరణంలో తమ కుటుంబంతో గడుపుతున్న అనుభూతి కలుగుతుంది. నాగశౌర్య అద్భుతంగా నటించాడు. ఎమోషన్ సన్నివేశాల్లో ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులంతా కూడా తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు”అని చెప్పారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. అలాగే నాగశౌర్య నటన సినిమాకు హైలైట్‌గా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో రావు రమేష్, పోసాని కృష్ణమురళి సుమన్, శివాజీరాజా, షకలక శంకర్, సుమిత్ర, సుధ, హేమ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణంః రసూల్ ఎల్లోర్, సంగీతంః కళ్యాణ్ రమణ, పాటలుః సిరివెన్నెల సీతారామశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌ః జె.పి, కొరియోగ్రఫీః స్వర్ణ, ఫైట్స్‌ః మల్లేష్.

Comments

comments