Search
Thursday 24 May 2018
  • :
  • :

తాళికట్టని పెళ్ళి

నయా జీవనశైలి తాళికట్టని పెళ్ళి

mrg

దాంపత్య సంబంధాల రూపురేఖలు మారుతున్నాయి. అంగరంగ వైభవంగా జరిగే పెళ్లి వేడుకలకు బదులు అర్థం చేసుకుని జీవించడాన్ని యువత ఇష్టపడు తున్నారు.. సహజీవనం అనే పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నారు. ఏదేమైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, తమకిష్టమైన రీతిలో బతకడమే అంటోంది యువత.. ఈ లివింగ్ రిలేషన్‌షిప్‌లో కోర్టులు, విడాకులు, పెద్దమనుషులు, పంచాయితీలు.. వంటివి తక్కువ. ఇద్దరికీ సయోధ్య కుదిరినంతవరకు ఓకే.. కుదరనప్పుడు సైలెంట్‌గా ఎవరిదారి వారిదే..అదే సహజీవనం.

ఈ రోజుల్లో సహజీవనం సహజమైంది. అమ్మాయిల అబ్బాయిల ఆలోచనా దృక్పథం మారింది. వివాహం మీద విరక్తో…కొత్త జీవితంపైన ఆసక్తో తెలియదు కానీ ఆడా మగ ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా కల్సి ఉందామనే నిర్ణయానికి వస్తున్నారు. సహజీవనం తప్పా, ఒప్పా అనే విషయం ఎప్పుడూ పెద్ద చర్చగా మారుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు కూడా మేజర్లు కలిసి జీవించడం, పెళ్లి చేసుకోవడాలు తప్పుకాదని సమర్ధించింది. ఇప్పటికే మన దేశంలో సహజీవనం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా సెలబ్రీటీలు ఈ విషయంలో చాలా ముందున్నారు. కానీ సామాన్యులు ఈ రిలేషన్‌ను కలకాలం సాగించడం సాధ్యమేనా అంటే అనుమానమే..మనసులు కలిసి ఉన్నంత వరకూ నో ప్రాబ్లెమ్. తేడా వస్తేనే సమస్యంతా.. సహజీవనంలో సమస్యలూ ఎక్కువే. చిన్న ఇగో వల్ల విడిపోవడాలూ అధికమే.. సహజీవనం చేస్తున్న ఆమె.. అబ్బాయి పెళ్లి చేసుకోలేదని, మోసం చేశాడని కేసు పెట్టడాలు లేదా ఆత్మహత్య చేసుకోవడాలను ఈ మధ్య ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో ఎక్కువగా చూస్తున్నాం..అనుమానంతో సహజీవనం చేస్తున్న పాట్నర్‌ను చంపడాలు కూడా జరుగుతున్నాయి…ఇలాంటి నేరాలు, ఘోరాలు ఎందుకు జరుగుతున్నట్లు.. అంటే సహజీవనంపై సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.
ఉద్యోగరీత్యా దూర ప్రదేశంలో ఉంటారు. పరిచయమైన ఇద్దరూ కొంతకాలం కలిసుందాం.. నచ్చితే పెళ్లి చేసుకుందాం లేకపోతే లేదు అనే స్పృహతో సహజీవనం చేస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో మహిళలకే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. లైంగికంగా కలిసుండటం వల్ల పిల్లలు పుట్టడం, లివ్ అండ్ రిలేషన్‌షిప్ వంకతో మోజు తీరగానే మోసం చేసే ప్రబుద్ధులూ ఉంటారు.. సహజీవనం పేరుతో అమ్మాయిలను మోసం చేస్తే , ఆర్ధికంగా ఆమెను సపోర్ట్ చేయడానికి గృహహింస చట్టన్ని ఉపయోగించుకోవచ్చు. ఇద్దరికీ పెళ్లయి వారి భాగస్వాములతో దూరంగా ఉన్నప్పుడు, మరొకరితో కలిసుంటే అది సహజీవనం కింద రాదనే విషయం చాలా మందికి తెలియదు. వారి అసలు భాగస్వాములు చట్టప్రకారం కేసు వేసే అవకాశం ఉంది. ఈ సహజీవనం లో ఎటుతిరిగినా అన్యాయమైపోయేది మళ్లా మహిళనే. చాలా కేసుల్లో సహజీవనంలో ఎటువంటి ఆధారాలుండవు. ఆధార్‌కార్డులాంటివి ఉండవు. చాలా సిటీల్లో వీరికి ఇల్లు అద్దెకు కూడా దొరకదు. కొంతకాలం తర్వాత విడిపోవాలనుకున్నప్పుడు సంతోషంగా విడిపోవాలి. సహజీవనంలో డైవర్స్ లేవు.

                                                                                                                                                                        మల్లీశ్వరి వారణాసి

అవగాహన లేకపోవడంతోనే సమస్యంతా…

ph1

సహజీవనం అనేది పాశ్చాత్య సంస్కృతే. కానీ ఈ మధ్య జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలకు లివింగ్ లిలేషన్‌షిప్‌కి సంబంధం లేదు. పాశ్చాత్య సంస్కృతిలోని సహజీవనం వేరు. అక్కడ ఇద్దరూ కల్సి ఉంటారు. పిల్లలు కూడా పుడతారు. ఎవరికి ఇష్టం లేకపోయినా క్విట్ అంటారు. అంటే నీమటుకు నువ్వుండు. నా మటుకు నేనుంటా ..అది లివింగ్ లిలేషన్‌షిప్ అండ్ క్విట్స్. పిల్లల్ని ఎవరికి కావల్సివస్తే వారు తీసుకువెళ్లి పెంచుకుంటారు. ఈ సహజీవనం అనేది హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఉన్న మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసేవారు సహజీవనం కల్చర్‌ను ఎక్కువ పాటిస్తారు. వెస్ట్రన్ కల్చర్ నుంచి లివింగ్ రిలేషన్‌షిప్‌ను మాత్రమే తీసుకున్నారు. కానీ క్విట్‌ను మాత్రం తీసుకోవట్లేదు. అతను వదిలి వెళ్లిపోతే అప్పుడు మా దగ్గరకు వస్తున్నారు. నేను అతని కోసం అనేక పూజలు చేశాను. కర్వాచౌత్ చేశాను. కానీ నన్ను వదిలేసాడు అంటూ ఫిర్యాదులు ఇవ్వడం మొదలెట్టారు. అవగాహన లేకుండా ఎలా పాటిస్తున్నారో పరాయి సంస్కృతిని నాకైతే అర్థం కాదు. ఊర్లలో వారికి సహజీవనం అంటేనే తెలీదు. కానీ మీడియా వాళ్లు దానికి లివింగ్ రిలేషన్‌షిప్ అని వాడుతున్నారంతే.

ఇద్దరికీ మెచ్యూరిటీ ఉండాలి..

ph2

సహజీవనం చేసే ఇద్దరిలో మెచ్యూరిటీ ఉండాలి. వాళ్లకేం కావాలో తెలిసుండాలి. సమాజం నుంచి వచ్చే సమస్యల్ని, వారిద్దరి మధ్య వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అవగాహన ఉండాలి.  బంధం బలహీనమైతే కామ్‌గా బయటకు రాగలగాలి. అంతేగానీ నన్ను మోసం చేశారంటూ ఒకర్నొకరు బజారుకీడ్చుకోవడం తప్పు.   ప్రతి దానికీ ఇద్దరూ బాధ్యులే.  ఒకరిని ఒకరు వదిలేస్తే తిరిగి బతికేలా ఉండగలగాలి. మళ్లీ పెళ్లిలో ఉన్నట్లే అన్నీ కావాలనుకోవడం  ఎందుకో అర్థం కాదు.

 రాద్ధాంతాలు అనవసరం..

ph

సమాజానికి వ్యతిరేకంగా చేసే కొన్ని పనులకు క్లాసిక్‌గా సహజీవనం అనే పేరు పెట్టుకుంటున్నారు కొందరు.  సహజీవనంలో ఉండే పాజిటివ్‌లు, నెగిటివ్‌లు తెల్సుకొని చేస్తే మంచిది. ఏ రిలేషన్ అయినా సరే సర్దుకుపోవడం అనేది అవసరం. సహజీవనం అంటే ఏంటి..ఇష్టం ఉంటే ఉండటం లేకుంటే విడిపోవడం కదా. దీనికి మళ్లీ రాద్ధాంతాలు ఎందుకు చేసుకుంటున్నారో తెలియడం లేదు. సహజీవనం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి.

Comments

comments