Search
Friday 25 May 2018
  • :
  • :

కొత్త నిబంధనలు

మొండి బకాయిల లెక్కలు 180 రోజుల్లోగా తేల్చాలి
బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు

RBI

న్యూఢిల్లీ : మొండి బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ కొత్త నిబంధనలను జారీ చేసింది. సవరించిన నిబంధనలను సోమవారం ఆర్‌బిఐ ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం, ఒత్తిడి ఆస్తులను వెంటనే గుర్తించి, ఇచ్చిన గడువులోగా రిసొల్యూషన్ ప్లాన్ అమలు చేయాలి.. ఈ విషయంలో విఫలమైతే బ్యాంకులపై జరిమానా పడనుంది. మొండి బకాయిల పరిష్కారానికి ఇప్పటికే ఉన్న ఎస్4ఎ, ఎస్‌డిఆర్(వ్యూహాత్మక రుణ పునర్వస్థీకరణ), సిడిఆర్(కార్పొరేట్ రుణ పునర్వవస్థీకరణ) వంటి వివిధ స్కీమ్‌లు ఉండగా.. వాటిని ఆర్‌బిఐ రద్దు చేసింది. నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారం కోసం దివాలా చట్టం కింద ఇప్పటివరకు ఇచ్చిన అధికారాలతో బ్యాంకులు ఏమీ తేల్చలేకపోవడంతో ఆర్‌బిఐ తీవ్రంగా పరిగణించింది. కొత్త విధానాల ద్వారా మొండి బకాయిలను బ్యాంకులు వేగంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చని ఆర్‌బిఐ పేర్కొంది. దివాలా చట్టం(ఐబిసి) కింద మొండి బకాయిదారులపై బ్యాంకులు చర్యలు తీసుకోవచ్చని ఆర్‌బిఐ తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం, బ్యాంకులు మొండి బకాయిలున్న ఖాతాలను వెంటనే గుర్తించి, వాటిపై రిజల్యూషన్ ప్లాన్(ఆర్‌పి) అమలు చేయాలి. ఈ ప్లాన్ అంటే ఖాతాదారులపై చర్యలు తీసుకోవడం.. వారి నుంచి రుణాలు రాబట్టుకోవడం చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఒక్క రోజులో అయిపోదు కాబట్టి దీనికి ఆర్‌బిఐ కొంత గడువు ఇచ్చింది. 180 రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగిసేలా చూడాలని స్పష్టం చేసింది. గడువులోగా రిజల్యూషన్ ప్లాన్ పూర్తి కాకపోతే ఆయా బ్యాంకులు దివాలా కేసు కింద నమోదు చేయవచ్చు. అయితే అది కూడా గడువు పూర్తయిన 15 రోజుల్లోగానే నమోదు చేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంక్‌లు పెద్ద మొత్తంలో మొండి బకాయిలను రద్దు చేశాయి. 201617లో దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ రూ.20,339 కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది. రుణాలను రద్దు చేసిన ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐ వాటానే అధికంగా ఉంది. అయితే 201617లో అన్ని ప్రభుత్వ బ్యాంకుల రుణాల మొత్తం రూ.81,683 కోట్లు రద్దు అయింది. ఎస్‌బిఐలో అనుబంధ బ్యాంకులు విలీనం చేయకముందు గణాంకాలు కావడం గమనార్హం.. 2012-13లో పిఎస్‌యు బ్యాంకులు రద్దు చేసిన మొత్తం రూ.27,231 కోట్లుగా ఉందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. అయితే ఈ మొత్తం ఐదేళ్లలోనే మూడు రెట్లు పెరిగింది. ఎస్‌బిఐతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2016-17లో రూ 9205 కోట్లను, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ 7346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ 5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ 4,348 కోట్ల మేర మొండి బాకీలను రద్దు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం రూ 53,625 కోట్లకు పెరిగింది. ఆర్‌బిఐ అంచనాల ప్రకారం, మొత్తం 21 బ్యాంకులకు గాను 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పిఎ) విలువ 15 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. 14 పిఎస్‌బిల స్థూల నిరర్థక ఆస్తులు 12 శాతానికి పైగా పెరిగాయి.
ఎగవేతదారులకు ఇది హెచ్చరిక
రిజర్వ్ బ్యాంక్ ఎగవేతదారుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆర్‌బిఐ ప్రకటించిన నిబంధనలు మొండి బకాయిదారులకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మొండి బకాయిదారులపై చర్యలకు బ్యాంక్‌లకు 180 రోజుల గడువు విధించడం ఆర్‌బిఐ కఠిన వైఖరిని సూచిస్తోందని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

Comments

comments