Search
Friday 25 May 2018
  • :
  • :

మార్కెట్‌కు సానుకూల అంశాలు

Stock

ముంబై : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ సెలవు కావడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు పనిచేయలేదు. బుధవారం మార్కెట్లు ప్రారంభమవుతాయి. కొద్ది రోజులుగా ఒడిదుడుకుల మధ్య సాగుతున్న సూచీలు సోమవారం కోలుకున్నాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ కీలక మద్దతు స్థాయి 34 వేల మార్క్‌కు కొద్ది పాయింట్లు ఎగువన మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్ పుంజుకోవడం, ఆసియా మార్కెట్లు లాభపడంతో సోమవారం సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 34,300 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 84.80 పాయింట్లు పెరిగి 10539.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. పియుసి బ్యాంక్, ఐటీ రంగాలకు చెందిన షేర్లు తప్ప, మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లోనే ముగిశాయి. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్ల లాభపడి 25,701 పాయింట్ల వద్ద స్థిరపడింది. గత వారంలో నష్టాలు భయపెట్టినా వారాంతాన అమెరికా మార్కెట్ల లాభాల ముగిశాయి. ఈవారం కూడా అదేరీతిలో లాభాలు కొనసాగడం, మరోవైపు ఆసియా మార్కెట్లు సానుకూల ప్రారంభంతో సెంటిమెంట్‌ను బలపడింది. ప్రధానంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్, యుపిఎల్, అరబిందో ఫార్మా, టాటాస్టీల్ 3 నుంచి 4 శాతం లాభపడ్డాయి. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఎస్‌బిఐ, భారత్ పెట్రోలియం, భారత ఇన్‌ఫ్రాటెల్, టెక్ మహింద్రా షేర్లు నష్టపోయాయి. కాగా ఐఐపి(పారిశ్రామిక ఉత్పిత్తి సూచీ) వృద్ధిని కొనసాగిస్తుండగా, మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం మెల్లగా దిగివస్తోంది. ఈ గణాంకాలు మార్కెట్‌కు సానుకూలంగా మారనున్నాయి. డిసెంబర్‌లో ఐఐపి 7.1 శాతానికి పెరిగింది. తయారీ రంగం, ఉత్పాదక వస్తువుల పనితీరు వేగవంతమవడంతో పారిశ్రామిక ఉత్పత్తి వేగంగా వృద్ధిని సాధిస్తోందని సిఎస్‌ఒ(కేంద్ర గణాంకాల శాఖ) పేర్కొంది. అదే సమయంలో జనవరిలో వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం దిగివచ్చింది. డిసెంబర్ నెలలో ఇది 17 నెలల గరిష్ఠ స్థాయిలో 5.21 శాతంగా ఉండగా, జనవరిలో 5.07 శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే భారతీయ రిజర్వు బ్యాంక్ మధ్యస్థ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ప్రధానంగా ఆహార, ఇంధన ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
విదేశీ ఇన్వెస్టర్లు విక్రయిస్తున్నప్పటికీ…
అంతర్జాతీయంగా మార్కెట్లలో అలజడి మొదలవడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు దేశీయ సంస్థలు (డిఐఐ) మాత్రం కొనుగోళ్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 1 నుంచి దేశీయ సంస్థలు రూ.5,419 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోళ్లు చేశాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడం, దీర్ఘకాలిక మూలధన లాభాల(ఎల్‌టిసిజి) పన్ను , ద్రవ్యలోటు భయాలతో గత ఏడు ట్రేడింగ్‌లో సెషన్లలో భారత్ సూచీలు గరిష్టస్థాయి నుంచి భారీగా పతమనయ్యాయి. ఈ పతనంలో కూడా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మద్దతు చూపుతున్నారు. మరోవైపు అమెరికా బాండ్ల లాభాల పెరుగుదల నేపథ్యంలో ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) భారీ అమ్మకాలు చేపడుతున్నారు. ఇదే సమయంలో దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు రూ. 4,618.88కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. మార్కెట్లు భారీ పతనం అవుతున్నా ఇప్పటికీ ఇతర ఆదాయ వనరుల కంటే ఈక్విటీ షేర్లు వైపే ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం ఈక్విటీ షేర్లు పన్ను అనంతర రాబడుల్ని అందిస్తాయని దేశీయ సంస్థలు విశ్వాసంతో ఉన్నాయి. అందుకే ఆ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ పేర్కొంది. 2017లో దేశీయ స్టాక్ మార్కెట్లో డిఐఐలు 18.4 బిలియన్ డాలర్ల్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ మొత్తం ఎఫ్‌పిఐల కంటే 2.4 రెట్లు అధికమని సంస్థ పేర్కొంది.

Comments

comments