Search
Thursday 24 May 2018
  • :
  • :

రోహిత్ రాయుడు సెంచరీ

match2*జమ్ముపై హైదరాబాద్ ఘన విజయం

మన తెలంగాణ/ హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సోమవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 149 పరుగుల భారీ తేడాతో జమ్మూకశ్మీర్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 312 పరుగుల భారీ స్కోరును రోహిత్ రాయుడు (130) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జమ్మూ 163 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓపెనర్లు అహ్మద్, శుభం ఖజూరియా ప్రారంభంలో బాగానే ఆడారు. ఇద్దరూ హైదరాబాద్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కానీ ఐదు ఫోర్లతో 26 పరుగులు చేసిన అహ్మద్‌ను మెహదీ హసన్ పెవిలియన్ పంపించాడు. తర్వాత జమ్మూ మళ్లీ కోలుకోలేక పోయింది. హైదరాబాద్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ముందుకు సాగారు. జమ్మూ జట్టులో ఓపెనర్ శుభం (35) పరుగులు చేశాడు. చివర్లో పునీత్ 3సిక్సర్లు, మరో నాలుగు బౌండరీలతో 34 బంతుల్లోనే 43 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్ బౌలర్లలో ఆకాశ్ భండారి మూడు, మహ్మద్ సిరాజ్, రవికిరణ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో జమ్మూ ఇన్నింగ్స్ 34.1 ఓవర్లలో 163 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌ను ఓపెనర్ రోహిత్ రాయుడు అద్బుత సెంచరీతో ఆదుకున్నాడు. అక్షత్ రెడ్డి (18), రవితేజ (2), మెహదీ హసన్ (2)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో ఒక దశలో హైదరాబాద్ 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
ఆదుకున్న రోహిత్, సందీప్
ఈ దశలో సందీప్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు జమ్మూ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలిచారు. ఇద్దరు కుదురుగా ఆడడంతో హైదరాబాద్ కోలుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన సందీప్ ఐదు ఫోర్లతో వేగంగా 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 171 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రోహిత్ పోరాటాన్ని కొనసాగించాడు. చివరికి 130 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 130 పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్ స్కోరు 312కి చేరింది.
జార్ఖండ్ ఓటమి
జింఖానా మైదానంలో జరిగిన మరో మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్ ఏడు వికెట్ల తేడాతో జార్ఖండ్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు సౌరభ్ తివారీ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన తివారీ 8ఫోర్లు, మరో మూడు సిక్స్‌లతో 105 బంతుల్లోనే 107 పరుగులు చేశాడు. కుమార్ (51) తనవంతు సహకారం అందించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ మరో రెండు ఓవర్లు మిగిలివుండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి అక్ష్యాన్ని అందుకుంది. టాప్ ఆర్డర్ రాణించడంతో చత్తీస్‌గఢ్ సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్లు సానిధ్య హుర్కట్ (39), సుశాంక్ చంద్రకర్ (61) తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించి శుభారంభం అందించారు. మరోవైపు కెప్టెన్ అమన్‌దీప్ రెండు సిక్స్‌లు, 8ఫోర్లతో 76 పరుగులు చేసి తనవంతు సహకారం అందించారు. కాగా, వికెట్ కీపర్ మనోజ్ సింగ్ 54 (నాటౌట్), విశాల్ (40 నాటౌట్; 17 బంతుల్లో 6×4, 2×6) చెలరేగడంతో చత్తీస్‌గఢ్ ఘన విజయం సాధించింది.
సౌరాష్ట్ర జయకేతనం
సర్వీసెస్‌తో ఎఓసి గ్రౌండ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 8వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 176 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సౌమిక్ ఛటర్జీ (52), రాజీవ్ సేథి (33) తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు.
ప్రత్యర్థి జట్టులో జడేజా నాలుగు, జైదేవ్ ఉనద్కట్, శౌర్య సాండిల్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో సర్వీసెస్ కనీసం 200 పరుగుల స్కోరును కూడా అందుకోలేక పోయింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 21.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ సమర్థ్ వ్యాస్ 66 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, మరో 12 ఫోర్లతో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ చటేశ్వర్ పుజారా కూడా మూడు ఫోర్లు, మరో 3సిక్స్‌లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో సౌరాష్ట్ర ఘన విజయాన్ని అందుకుంది.
ఆంధ్రా జయభేరి…
చెన్నైలో జరిగిన మరో మ్యాచ్‌లో తెలు గు జట్టు ఆంధ్రా 9వికెట్ల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యా టింగ్ చేసిన గుజరాత్ 250 పరుగులు చేసింది. రుజుల్ భట్ (74), పియూష్ చావలా (56), కెప్టెన్ పార్థివ్ పటేల్ (39) జట్టును ఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా 45.2 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ శ్రీకర్ భరత్ 4ఫోర్లు, మరో నాలు గు సిక్సర్లతో అజేయంగా 106 పరుగు లు చేసి జట్టును ఆదుకున్నాడు. మరో ఓపెనర్ అశ్విన్ హబ్బర్ రెండు సిక్స్‌లు, 11 ఫోర్లతో 99 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కెప్టెన్ హను మ విహారి 3సిక్స్‌లు, మరో మూడు ఫోర్లతో అజేయంగా 39 పరుగులను చేయడంతో ఆంధ్రా ఘన విజయం సా ధించింది. ఈ విజయంతో ఆంధ్రా గ్రూ ప్‌సి నుంచి నాకౌట్‌కు అర్హత సాధించింది. మరో మ్యాచ్‌లో ముంబయి 4వికెట్ల తేడాతో గోవాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గోవా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 46.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ (71), పృథ్వీ షా (53), కెప్టెన్ ఆదిత్య తారే 59(నాటౌట్) రాణించడంతో ముంబయి జయభేరి మోగించింది. ఈ గెలుపుతో ముంబయి కూడా నాకౌట్‌కు చేరుకుంది.

Comments

comments