Search
Thursday 24 May 2018
  • :
  • :

సూచీలకు బ్యాంకింగ్ షేర్ల బ్రేకు

PH0

 ఆర్‌బిఐ నిబంధనల నేపథ్యంలో వెల్లువెత్తిన అమ్మకాలు

 145 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

న్యూఢిల్లీ : స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి. బ్యాంకుల పతనం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తుల)పై ఆర్‌బిఐ కొత్త నిబంధనలను జారీ చేయడంతో బుధవారం బ్యాంకింగ్ షేర్లు బేర్‌మన్నాయి. దీంతో సూచీలు నష్టాల ముగింపు బాట పట్టాయి. సెన్సెక్స్ 144.52 పాయింట్లు కోల్పోయి 34155.95 వద్ద ముగిసింది. ఇక నిప్టీ 39 పాయింట్లు నష్టపోయి 10,500 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో సానూకుల వాతావరణం నెలకొన్నా, బ్యాంకింగ్ రంగ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. సెన్సెక్స్ 34, 028 నుంచి- 34,374 పాయింట్ల మధ్య శ్రేణిలో కదలాడింది. నిఫ్టీ సూచీ 10,457.65- 10,590.55 రేంజ్‌లో ట్రేడ్ అయ్యింది. ఆర్‌బిఐ జారీచేసిన నూతన నోటిఫికేషన్‌తో బ్యాంకింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పిఎస్‌యు బ్యాంక్ 5 శాతం, ప్రైవేట్ బ్యాంక్ 1.46 శాతం మేరకు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయి 25,341 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు లాభాలతో ముగింపు, ఆసియా మార్కెట్ల మిశ్రమ ప్రారంభం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని నివ్వడంతో ప్రారంభంలో సూచీలు లాభపడ్డాయి. భారీ కొనుగోళ్లతో సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 34,387 వద్దకు చేరగా.. ఆఖరి సమయంలో అమ్మకాలు వెల్లువెత్తి నష్టాల్లోకి జారుకుంది. ఆర్‌బిఐ కొత్త నిబంధనలతో బ్యాంకుల కేటాయింపు వ్యయం పెరిగి 2019 లాభాలపై ప్రభావం చూపుతుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ బ్యాంక్ స్టాక్స్‌లో అమ్మకాలు పెరిగి సూచీలు డీలాపడ్డాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీ, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్, ఇండియన్ బుల్ హౌసింగ్ ఫైనాన్స్, టెక్ మహేంద్రా షేర్లు 1 నుంచి 3 శాతం లాభపడ్డాయి. ఇన్‌ఫ్రాటెల్, ఒఎన్‌జిసి, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ బ్యాంక్, యస్‌బ్యాంక్ షేర్లు 3 నుంచి 5 శాతం మేరకు నష్టపోయాయి. కాగా రిజర్వ్ బ్యాంక్ ఎగవేతదారుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆర్‌బిఐ ప్రకటించిన నిబంధనలు మొండి బకాయిదారులకు ప్రమాద ఘంటికలని,  మొండి బకాయిదారులపై చర్యలకు బ్యాంక్‌లకు 180 రోజుల గడువు విధించడం ఆర్‌బిఐ కఠిన వైఖరిని సూచిస్తోందని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మొండి బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సోమవారం రాత్రి బ్యాంకులకు కొత్త నిబంధనలను జారీ చేసింది. ఒత్తిడి ఆస్తులను వెంటనే గుర్తించి, ఇచ్చిన గడువులోగా రిసొల్యూషన్ ప్లాన్ అమలు చేయాలి. ఈ విషయంలో విఫలమైతే బ్యాంకులపై జరిమానా పడనుంది. మొండి బకాయిల పరిష్కారానికి ఇప్పటికే ఉన్న ఎస్4ఎ, ఎస్‌డిఆర్(వ్యూహాత్మక రుణ పునర్వస్థీకరణ), సిడిఆర్(కార్పొరేట్ రుణ పునర్వవస్థీకరణ) వంటి వివిధ స్కీమ్‌లను ఆర్‌బిఐ రద్దు చేసింది.  ఈ సవరించిన నిబంధనల ప్రకారం, బ్యాంకులు మొండి బకాయిలున్న ఖాతాలను వెంటనే గుర్తించి, వాటిపై రిజల్యూషన్ ప్లాన్(ఆర్‌పి) అమలు చేయాలి. ఈ ప్లాన్ అంటే ఖాతాదారులపై చర్యలు తీసుకోవడం.. వారి నుంచి రుణాలు రాబట్టుకోవడం చేయాల్సి ఉంటుంది. 180 రోజుల్లోగా ఈ ప్రక్రియ ముగిసేలా చూడాలని స్పష్టం చేసింది. గడువులోగా రిజల్యూషన్ ప్లాన్ పూర్తి కాకపోతే ఆయా బ్యాంకులు దివాలా కేసు కింద నమోదు చేయవచ్చు. అయితే అది కూడా గడువు పూర్తయిన 15 రోజుల్లోగానే నమోదు చేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంక్‌లు పెద్ద మొత్తంలో మొండి బకాయిలను రద్దు చేశాయి. 201617లో దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ రూ.20,339 కోట్ల మొండి బకాయిలను రద్దు చేసింది. రుణాలను రద్దు చేసిన ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐ వాటానే అధికంగా ఉంది. అయితే  201617లో అన్ని ప్రభుత్వ బ్యాంకుల రుణాల మొత్తం రూ.81,683 కోట్లు రద్దు అయింది.  ఆర్‌బిఐ అంచనాల ప్రకారం, మొత్తం 21 బ్యాంకులకు గాను 9 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల(ఎన్‌పిఎ) విలువ 15 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. 14 పిఎస్‌బిల స్థూల నిరర్థక ఆస్తులు 12 శాతానికి పైగా పెరిగాయి.

10 శాతానికి పైగా నష్టపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు

BSNS

ప్రభుత్వరంగ బ్యాంకు పిఎన్‌బి(పంజాబ్ నేషనల్ బ్యాంక్) కుంభకోణం నేపథ్యంలో సంస్థ షేరు భారీగా పతనమైంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో పిఎన్‌బి షేర్లు రూ.160 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 10 శాతం నష్టపోయి రూ.144.85కు పడిపోయింది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.128.30లు, రూ.231లుగా ఉన్నాయి. పిఎన్‌బిలో  కుంభకోణం వెలుగుచూడడం బ్యాంక్‌ను దెబ్బతీసింది. ముంబైలోని ఓ బ్రాంచులో కొంతమంది అకౌంట్ హోల్డర్స్…మోసపూరిత లావాదేవీలు జరిపినట్లు పిఎన్‌బి స్టాక్ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.11,359 కోట్లుగా ఉంటుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ నగదును విదేశీ అకౌంట్లకు తరలించినట్లు పిఎన్‌బి తెలిపింది. ఈ కుంభకోణంలో 10 మంది ఉద్యోగుల హస్తం ఉందనే అనుమానంతో వారిని సస్పెండ్ చేసినట్టు బ్యాంకింగ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు.

75 శాతం క్షీణించిన సన్‌ఫార్మా లాభం

BSNS1
దేశీయ అతిపెద్ద ఫార్మా సంస్థ సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ బుధవారం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ ముగిం పు నాటి క్యూ3 ఫలితాల్లో సంస్థ నికర లాభం భారీగా 75 శాతం క్షీణించి రూ.3.65 బిలియన్లు(57 మిలియన్ డాలర్లు) నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేదు. గత ఏడాది ఇదే సమయంలో రూ.14.72 బిలియన్లతో పోలిస్తే ఈసారి లాభం భారీగా తగ్గుముఖం పట్టింది. 17 మంది విశ్లేషకులు రూ.9.12 బిలియన్ల లాభం వస్తుందని అంచనా వేయగా.. అంచనాలను అందుకోలేదు. అదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.66.53 బిలియన్లతో 16 శాతం తగ్గింది

Comments

comments