Search
Thursday 24 May 2018
  • :
  • :

నీటివాటాపై నిలదీద్దాం

harish

ప్రాజెక్టుల వారీ కేటాయింపుల తర్వాతనే కృష్ణ, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని డిమాండ్ 

పోలవరం ముంపు ముప్పుపై అధ్యయనం జరిపించేలా కేంద్రంపై ఒత్తిడి

నేటి ఢిల్లీ జలవనరుల సమావేశానికి రాష్ట్ర వ్యూహం ఖరారు 

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాపై గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో గురువారం జరుగనున్న సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల ప్రక్రి య అనంతరమే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ట్రిబ్యునల్ ద్వారా ఖరారు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరనుంది. రైతుల ప్రయోజనాల కు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనలను తిప్పికొట్టే అంశంపై కూడా చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల రాష్ట్రంలోని చారిత్రక భద్రాచలం సీతారామ స్వామి దేవాలయం సహా పలు గ్రామాలు, బొగ్గు గనులు, మణుగూరు హెవి వాటర్ ఫ్లాంట్ తదితర ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి ప్రస్తావించారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాలు, తలెత్తే సమస్యలను అధ్యయనం చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ)ని ఆదేశించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఉన్నతాధికారులను మంత్రి కోరారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరంకు జలసంఘం అనుమతులు ఇచ్చిన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 45 టిఎంసిల నీటిని వినియోగించుకునే హక్కు దక్కుతుందన్నారు. ప్రస్తుతం కేంద్రమే జాతీయ ప్రాజెక్టు గా పోలవరంను చేపట్టినందున ఆ 45 టిఎంసిల నీటిని రాష్ట్రానికి కేటాయించాలని హరీశ్ కోరారు. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద 36.45 లక్షల హెక్టార్ల సాగుయోగ్యమైన భూములు ఉన్నప్పటికీ కేవలం 5.71 (15 శాతం) లక్షల హెక్టార్ల భూమికి మాత్రమే సాగునీరు అందుతోందని, 45 టిఎంసిల నీటిని రాష్ట్రానికి కేటాయిస్తే, నీరందని ప్రాంతాల్లో సాగుకు వాడుకోవచ్చని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులోని 811 టిఎంసిల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 575 టిఎంసిలు కేటాయించాలన్నదే తెలంగాణ వైఖరి అని, ఇదే విషయాన్ని గురువారం నాడు డిల్లీలో జరిగే సమావేశంలో చెప్పాలని సూచించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీం కింద రాష్ట్రానికి 15.9 టిఎంసిల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ వాస్తవంగా సగటున 4.56 టిఎంసిలకు మించి రావడం లేదని హరీశ్‌రావు తెలిపారు. ఆర్డీఎస్ కాలువల ఆధునీకరణ చేపట్టాలని 2004లోనే నిపుణుల కమిటీ సిఫార్సు చేసినా, ఇప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా సమావేశంలో ప్రతిపాదించాలని సూచించారు. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నీటి వాడకాన్ని లెక్కకట్టేందుకు టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని 2016 జూన్‌లోనే నిర్ణయించినా, ఇప్పటికీ అమలు కావట్లేదని మంత్రి అన్నారు. తొలి విడతలో 19 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు 2017 ఫిబ్రవరిలో కెఆర్‌ఎంబి ప్రతిపాదించినా, ఆ స్టేషన్లు పనిచేయడం లేదని, రెండో విడత టెలీమెట్రీ స్టేషన్ల జాబితాను ఇంతవరకు రూపొందించనేలేదని ప్రస్తావించారు. టెలీమెట్రీల జాప్యంతో పోతిరెడ్డిపాడు నుంచి అధిక నీరు కృష్ణా బేసిన్ నుంచి అక్రమంగా తరలిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్‌రాజ్, ఇఎన్‌సిలు మురళీధర్‌రావు, నాగేందర్‌రావు, సిఇలు సునీల్, ఖగేందర్‌రావు, లింగరాజు, హరిరాం, బంగారయ్య, శంకర్, భగవంతరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments