Search
Friday 25 May 2018
  • :
  • :

నెలకు లక్ష కోట్లు దాటడమే లక్ష్యం

వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి జిఎస్‌టి వసూళ్లు పెరుగుతాయి :  ఆర్థిక మంత్రిత్వశాఖ 

GSTన్యూఢిల్లీ : జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) నుంచి ఆదాయం నెలకు రూ. లక్ష కోట్లు దాటాలని ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. పన్ను గణాంకాలు, ఇవే బిల్ వంటి పన్ను ఎగవేత వ్యతిరేక చర్యల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరినాటికి లక్ష కోట్ల ఆదాయం లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఈమేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. ఒక్కసారి జిఎస్‌టి రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియ పూర్తిగా నిలకడ పరిస్థితి చేరుకుంటే డిజిఎఆర్‌ఎం(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్) రంగంలోకి దిగుతుందని అధికారులు తెలిపారు. జిఎస్‌టి ఫైల్ చేసేవాళ్ల ఆదాయం పన్ను రిటర్న్‌లను ఎప్పటికప్పుడు సరిచూడనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7.44 లక్షల కోట్ల జిఎస్‌టి వసూలు చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201718)లో జులై నుంచి ఫిబ్రవరి వరకు రూ.4.44 లక్షల కోట్ల జిఎస్‌టిని వసూలు చేశారు. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తొలి నెల జులైలో అత్యధికంగా రూ.95 వేల కోట్లు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఈ వసూళ్లు నెల నెలా తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్‌లో అతి తక్కువగా రూ.80 వేల కోట్లే వసూలయ్యాయి. గతేడాది డిసెంబర్‌నాటికి 98 లక్షల మంది వ్యాపారులు జిఎస్‌టి కింద నమోదు చేసుకున్నారు. జిఎస్‌టిలో చూపిన టర్నోవర్, వాళ్లు ఫైల్ చేసే ఆదాయం పన్ను రిటర్న్‌లతో పోల్చి చూస్తామని అధికారులు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి ఈ పని మొదలవుతుందని వారు వెల్లడించారు. ఆ తర్వాత నెలకు లక్ష కోట్ల జిఎస్‌టి వసూళ్లు సాధిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. 10 శాతం కస్టమ్ సుంకం నేపథ్యంలో బంగారం దిగుమతులు ప్రతి నెలా పెరుగుతున్నాయని, అయితే ఈ దిగుమతి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రాంతంలో జిఎస్‌టి ఉంటుందని.. వీటి వివరాలను కోరే అధికారం ఉందని అధికారులు తెలిపారు.

Comments

comments