Search
Friday 25 May 2018
  • :
  • :

యుపిఎ పునరుద్ధరణే మార్గం!

edit

భారతీయ జనతాపార్టీ(బిజెపి)ని తిరిగి రాకుండా కట్టడి చేయాలని కలగంటున్న కాంగ్రెస్ ముందు ఉన్న కీలక సవాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు మళ్లీ ఐక్య ప్రగతిశీల సంఘటన(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్‌యుపిఎ)కు ప్రాణం పోయడమే. ఇంతవరకు నోట్ల రద్దు, సరుకులు సేవల పన్ను(జియస్‌టి)పై తప్ప ఇతర తీవ్ర అంశాలపై ప్రభుత్వంతో పోరాడే శక్తి ప్రతిపక్షానికి కొరవడింది. గత ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్ ఒక బలమైన ఉదాహరణ. బిజెపి వ్యతిరేక ఐక్య వేదిక ద్వారానే మోడీ దూకుడును ప్రతిపక్షంఅరికట్ట గలదు. పనికివచ్చే మంత్రదండం అదొక్కటే. ప్రస్తుత రాజకీయ సన్నివేశాన్ని బట్టి ప్రతిపక్షం ఎన్నటికీ ఐక్యం కాలేకపోతోందన్నది స్పష్టంగా తెలుస్తోంది.2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి కేవలం 31శాతం ఓటుతో అధికారంలోకి వచ్చింది. 69శాతం ప్రజలు ప్రతిపక్షానికే ఓటు వేశారు. ఈ వాస్తవంతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షంలో ఐక్యత కొరవడింది. కాంగ్రెస్ బలహీనపడడంతో అనేక ప్రాంతీయ శక్తులు రాజకీయ క్రీడను శక్తిమంతంగా ఆడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే ఏ పార్టీ లేదా కూటమి బిజెపికి గట్టి పోటీని ఇచ్చే పరిస్థితిలో లేవు. ఇది ఆ పార్టీని బలోపేతం చేస్తున్న అంశం. ప్రతిపక్షాలను ఐక్యం చేస్తూ యుపిఎను మళ్లీ కూటమిగా పునరుద్ధ్దరించడం కాంగ్రెస్ ముందున్న మొదటి సవాలు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వంపై దీటుగా తలపడడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంకీర్ణ కూటమిని విజయవంతంగా కూర్చగలిగారు. ఇప్పుడు దృశ్యం మారింది. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. పార్టీ సారథ్యాన్ని కుమారుడు రాహుల్‌గాంధీకి అప్పగించారు.
శరత్‌పవార్, మమతాబెనర్జీ, ములాయం సింగ్ యాదవ్ లేదా మాయావతి వంటి ప్రతిపక్ష నేతలు రాహుల్ సారథ్యం కింద పనిచేయడానికి ఇష్టపడడంలేదు. అందుకే సోనియా ఇటీవలి మోడీకి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే కృషి చేపట్టారు. ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, రాజస్థాన్ ఉప ఎన్నికలలో రాహుల్‌గాంధీ శక్తిమంతమైన నేతగా గుర్తింపు సాధించినప్పటికీ చాలామంది యుపిఎ భాగస్వాములు సోనియాగాంధీనే ఆమె కొడుకు కంటే బలంగా కోరుకుంటున్నారు.అయితే ఆమె సారథ్యంలో తిరిగి కూటమి కట్టాల్సినంత బలమైన అంశాలు ఏవీ వారికి కనపడడంలేదు. రెండో సవాలు ఏమిటంటేప్రతిపక్ష ఐక్యతకోసం ‘పిల్లిమెడలో గంటకట్టేవారు ఎవరు’ అన్నది.
బలహీనపడిన కాంగ్రెస్‌కు ప్రాధాన్యతనివ్వడం ప్రాంతీయ పార్టీలకు ఇష్టం లేదు. గత నెలలోనే ఎన్‌సిపి అధిపతి శరద్‌పవార్ ప్రతిపక్ష ఐక్యతకోసం పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగాన్ని రక్షిద్దాం’ పేరిట మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ యాత్రను నిర్వహించారు. ఆ యాత్రలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నప్పటికీ వారికి ఎన్‌సిపి తరువాతి స్థానంలో నిలవడం ఇష్టం లేకపోయింది. ఎన్‌సిపి కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సోనియాగాంధీ ముందు వరుసలో నిలిచి పార్లమెంటులో ప్రతిపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సాగుతుండగానే ఐక్య ప్రతిపక్షానికి మమతాబెనర్జీ సారథ్యం మంచిది కదా అని తృణమూల్ కాంగ్రెస్ శిబిరంలో వినిపించింది. అందుచేత ప్రతి ఒక్కరిని ఐక్యత గొడుకు కిందకు చేర్చడం ఎలా అన్నది కాంగ్రెస్ ఆలోచించాలి. మూడవ సవాలు ఏమిటంటే ప్రధాని అభ్యర్థి విషయంలో అంగీకారానికి రావడం. ప్రాంతీయ పార్టీలతో విస్తృత కూటమికి కాంగ్రెస్ అంగీకరించినా, ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న సమస్యలను సృష్టించవచ్చు. ఏ ఇతర పార్టీ నాయకుడిని ప్రధాని పదవికి కాంగ్రెస్ అంగీకరించదు. అలాగే రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఇతర పార్టీలు అంగీకరించకపోవచ్చు. మమతాబెనర్జీ వంటి కొందరు ప్రాంతీయ నేతలు గట్టిగా తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. వారు విడిగా ఫ్రంట్‌గా ఏర్పడి ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న అంశాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయానికి వదిలిపెట్టవచ్చు. అయితే ప్రధాని అభ్యర్థి పేరు చెప్పకుండా ఏర్పడే ఫ్రంట్ బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ ముందు, దాని నేత మోడీ ముందు వెలవెలబోవడం ఖాయం.
నాలుగో సవాలు ఏదంటే దక్షిణ భారతదేశం, ఈశాన్యంలో బిజెపిని చొచ్చుకురాకుండా నిరోధించడం. కేవలం ఏడు రాష్ట్రాలలోనే కాంగ్రెస్, బిజెపి నువ్వా, నేనా అన్న పరిస్థితిలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా 12 పెద్ద రాష్ట్రాలలో బిజెపి ఈ సరికే ఉచ్ఛస్థితిలో ఉంది. రాజస్థాన్ ఉప ఎన్నికల తర్వాత ఎన్‌డిఎకు లోక్‌సభలో గల మొత్తం 336 సంఖ్యాబలంలో 272 ఆ రాష్ట్రాలవే. ఉత్తర భారతదేశంలో కూడా బిజెపి అగ్రస్థానంలో ఉంది. అందుకే మరింతగా విస్తరణకు దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలపై అది దృష్టి సారించింది. ఈశాన్య ప్రాంతంలో మొత్తం 25లోక్‌సభ సీట్లు ఉన్నాయి.
ఒకప్పుడు కాంగ్రెస్ ఇంచుమించు ఈ మొత్తం సీట్లను గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఏడు ఈశాన్యరాష్ట్రాలకు ఐదింట బిజెపి, దాని మిత్రపక్షాల హవా నడుస్తోంది. దక్షిణ భారతదేశంలో బిజెపి తలెత్తకుండా కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేయవలసి ఉంది. వచ్చేనెల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకను కాంగ్రెస్ తిరిగి గెలుచుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న రెండు పెద్ద రాష్ట్రాలు కర్నాటక, పంజాబ్ మాత్రమే. ఒకానొకప్పుడు దక్షిణ భారతదేశం కాంగ్రెస్‌కు పెట్టనికోటగా ఉండేది. క్రమంగా ఆ పార్టీ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలు ఆక్రమించాయి.1967నుండి తమిళనాడులో డిఎంకె లేదా ఎఐఎడిఎంకె తో అంటకాగి అస్తిత్వాన్ని కాంగ్రెస్ నిలుపుకుంటోంది. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యుడిఎఫ్) లేదా వామపక్షాల సారథ్యంలోని ఫ్రంట్(ఎల్‌డిఎఫ్) మధ్య అధికారం బదిలీ అవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒకప్పుడు చాలా బలంగా ఉండేది. అయితే తెలుగుదేశంపార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక అది తీవ్రంగా బలహీనపడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయాక ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ కంటికి కనపడని స్థితికి క్షీణించింది. ప్రతీ ఒక్క అంశంపై ప్రతిపక్షాలను ఏకత్రాటిపై నిలపడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదని ఒక గ్రంథావిష్కరణ సభలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్య సరైనదే. ‘కొన్ని అంశాలలో చాలామంది కూడతారు. చాలా అంశాలలో కొద్దిమంది కూడతారు. ప్రతి ఒక్క అంశంపై కాంగ్రెస్ వేదిక మీదికి దాదాపు 7, 8 దాకా ఉన్న రాష్ట్రస్థాయి ప్రాంతీయ పార్టీలు రావడం అన్నది అసాధ్యం అని నేను భావిస్తాను’ అని చిదంబరం అన్నారు. అందుచేత యుపిఎను పునరుద్ధరించడం ఒక్కటే చీలిపోయి ఉన్న ప్రతిపక్షాలన్నిటినీ కలిపే ఏకైక మార్గమని పరిశీలకులు భావిస్తున్నారు.

* కళ్యాణి శంకర్

Comments

comments