Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

వడగండ్ల వాన బీభత్సం

mnr

ఈదురు గాలులతో జనం అతలాకుతలం
కూలిన బిఎస్‌ఎన్‌ఎల్ టవర్, స్తంభించిన నెట్‌వర్క్
దెబ్బతిన్న పత్తి, మొక్క జొన్న, మిరప పంటలు
నేలకొరిగిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, నిలిచిన విద్యుత్ సరఫరా
పలు గ్రామాల్లో లేచిన ఇండ్ల పై కప్పులు
గ్రామాల్లో పర్యటించిన ఎంఎల్‌ఏ, సబ్ కలెక్టర్
బాసరలో గొర్రెల కాపరి మృతి

అర్థరాత్రి ఒక్క సారిగా ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. కేవలం గంటలోపే గ్రామాలన్నీ అతలాకుతలం అయ్యాయి. ఒక్కో చోట పెద్ద సైజు మంచు ముక్కలు పడగా ఇండ్లు దెబ్బతిన్నాయి. తాండూర్ శివారులో ఉన్న సిరామిక్స్(పైపుల) కంపెనీలకు చెందిన పైకప్పులు పూర్తిగా లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఎక్కడికక్కడే నేలకొరగడంతో సరఫరా నిలిచిపోయి. గ్రామాలు అందకారమయం అయ్యాయి. జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. మాదారంలోని బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ నేలకొరగడంతో నెట్‌వర్క్ సేవలు స్తంభించాయి. ఏదిఏమైనా కేవలం గంట పాటు ఈదురు గాలులు, వడగళ్ల వాన కురియడం వల్ల జనం ఇంకా ఆ సంఘటన నుంచి కోలుకోలేక పోతున్నారు. ఇండ్లలో పత్తి నిల్వ ఉంచగా పై కప్పులు లేచిపోవడంతో వర్షానికి పత్తి ముద్దగా మారింది. అదే విధంగా మొక్కజొన్న, మిరప, శనగ, ఉల్లి పంటలు వర్షం తాకిడికి నేలకొరిగాయి.మంచిర్యాల జిల్లాలోని తాండూర్, భీమిని, కన్నెపల్లి మండలాల్లో సోమవారం అర్థరాత్రి 1.30 సమయంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. తాండూర్ మండలంలోని తాండూర్ , కొత్తపల్లి, రేచిని, పెగడపల్లి, మాదారం, అచ్చులాపూర్, చౌటపల్లి, బోయపల్లి గ్రామాలలో భారీనష్టం జరిగింది. ఇండ్ల పైకప్పులు కూలిపోగా పంటలు దెబ్బతిన్నాయి. తాండూర్ మండలంలో మంగళవారం 41.4ఎంఎం వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. రేచిని గ్రామంలో దాదాపు 24 ఇండ్ల పై కప్పులు లేచిపోగా నిరాశ్రయిలయ్యారు. ఐబి ఏరియాలోని పైపుల కంపెనీల పై కప్పు రేకులు లేచిపోవడంతో పైపులు దెబ్బతిన్నాయి. మొత్తం ఐదు కంపెనీలకు చెందిన రేకులు లేచిపోవడంతో భారీ నష్టం వాటిలింది.పెద్ద ఎత్తున మంచు ముక్కలు పడడంతో జనం బయటకు వెళ్లలేకపోయారు. అదే విధంగా బోయపల్లి గ్రామంలో పూతకు వచ్చిన మామిడిపంటలు దెబ్బతిన్నాయి. అకస్మాత్తుగా వచ్చిన వడగళ్ల వాన వలన ఈసారి మామిడి రైతులు మళ్లీ నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. వడగళ్ల వాన ఈదురు గాలుల వల్ల దెబ్బతిన్న గ్రామాలను బెల్లంపల్లి ఎంఎల్‌ఏ దుర్గం చిన్నయ్య,జడ్‌పిటిసి మంగపతి సురేష్‌బాబు , బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం పర్యటించింది. జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మొదట పైపుల కంపెనీ రేకులు లేచిపోగా ఆ ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడి నుంచి పలు గ్రామాల్లో పర్యటించి, ఇండ్ల పై కప్పులు, లేచిపోయిన ఇండ్లను దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఏ దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని అదే విధంగా పరిహారం కూడా అందిస్తామన్నారు.

Comments

comments